అకౌంట్‌లో జీరో బ్యాలెన్స్ ఉన్నా, రూ. 10 వేలు విత్‌డ్రా చేసుకోవచ్చు.. ఎలాగంటే.?
Bank Account: బ్యాంక్ అకౌంట్‌లో తగినంత బ్యాలెన్స్ ఉంటేనే డబ్బులు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుందనే విషయం తెలిసిందే. అయితే జీరో బ్యాలెన్స్ ఉన్నా కూడా రూ. 10 వేలు తీసుకునే అవకాశం ఉందని మీకు తెలుసా.?

జీరో బ్యాలెన్స్ ఉన్నా డబ్బు తీసుకునే అవకాశం
ప్రధానమంత్రి జనధన్ యోజన (PMJDY) కింద తెరిచిన బ్యాంక్ ఖాతాల్లో ఎలాంటి మినిమం బ్యాలెన్స్ ఉండాల్సిన అవసరం ఉండదు. అంతేకాదు, ఖాతాలో ఒక్క రూపాయి కూడా లేకపోయినా 10,000 రూపాయల వరకు ఓవర్‌డ్రాఫ్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఖాతాలో డబ్బు లేకపోయినా, అత్యవసర సమయంలో 10 వేల రూపాయలు విత్‌డ్రా చేసుకోవచ్చు.
ఈ సదుపాయం ఎలా పొందాలి?
జనధన్ ఖాతాలను బేసిక్ సేవింగ్ ఖాతాలుగా పరిగణిస్తారు. ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయం కావాలంటే.. మీ బ్రాంచ్‌కి వెళ్లి ఓవర్‌డ్రాఫ్ట్ కోసం అప్లై చేయాలి. మంచి ట్రాన్సాక్షన్ హిస్టరీ ఉంటే బ్యాంకు త్వరగా ఆమోదిస్తుంది. బ్యాంకులు సాధారణంగా ఈ దరఖాస్తును తిరస్కరించవు. మీరు ఖాతాను యాక్టివ్‌గా ఉపయోగిస్తే ఓవర్‌డ్రాఫ్ట్ పొందడం మరింత సులభం అవుతుంది.
ఓవర్‌డ్రాఫ్ట్ అంటే ఏమిటి?
ఖాతాలో డబ్బు లేకున్నా బ్యాంకు మీకు కొంత మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునే అనుమతి ఇచ్చే విధానాన్ని ఓవర్‌డ్రాఫ్ట్ అంటారు. ఇది చిన్న మొత్తంలో ఇచ్చే తక్షణ రుణం లాంటిదన్నమాట. తరువాత మీ ఖాతాలో డబ్బు జమ అయినప్పుడు ఈ మొత్తాన్ని ఆటోమేటిక్‌గా బ్యాంకు తిరిగి వసూలు చేస్తుంది.
ఈ సదుపాయంపై వడ్డీ కూడా ఉంటుంది
ఓవర్‌డ్రాఫ్ట్ కూడా ఒక రకమైన రుణమని చెప్పాలి. కాబట్టి మీరు తీసుకున్న మొత్తంపై కొద్దిపాటి వడ్డీ చెల్లించాలి. అయినప్పటికీ, అత్యవసర సమయంలో ఈ సదుపాయం చాలా ఉపయోగపడుతుంది. డబ్బు వచ్చే వరకు ఇబ్బంది పడకుండా ఖర్చులను నిర్వహించుకోవచ్చు.
వినియోగదారులు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు
ఓవర్‌డ్రాఫ్ట్ ఉపయోగించే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
* తరచుగా ఓవర్‌డ్రాఫ్ట్ తీసుకుంటే ఖాతా నెగటివ్ బ్యాలెన్స్‌లోకి వెళుతుంది
* సమయానికి చెల్లించకపోతే క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం పడుతుంది
* ప్రతి బ్యాంకుకు ఓవర్‌డ్రాఫ్ట్ నిబంధనలు వేరువేరుగా ఉండొచ్చు.
* అత్యవసర సందర్భాల్లో మాత్రమే ఈ సదుపాయాన్ని ఉపయోగించడం మంచిది.

