Tata Motors : 2026 లో ఈ EV కార్లదే హవా.. అమ్మకాల్లో ఆల్ టైమ్ రికార్డుల మోతే..!
ఓ భారతీయ కంపెనీ ఏకంగా 2.5 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ కార్లను అమ్మి సరికొత్త రికార్డు సృష్టించింది. భవిష్యత్తులో ఈ కంపెనీ మరిన్ని ఈవి కార్లతో రాబోతోంది. ఇంతకూ ఈ కంపెనీ ఏది.. 2026 లో ఏ మోడళ్లను తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది?

టాటా మోటార్స్ సరికొత్త రికార్డు
ఎలక్ట్రిక్ కార్ల (EV)పై భారతీయులకు ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది... ఇందుకు నిదర్శనమే ఈ ఏడాది రికార్డుస్థాయి అమ్మకాలు. అయితే ఈవి కార్ల అమ్మకాల్లో ఇండియన్ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ముందుంది. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా 2.5 లక్షలకు పైగా టాటా ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడుపోయాయట... ఇలా టాటా మోటార్స్ ఒక కొత్త రికార్డు సృష్టించింది. ఇది కంపెనీ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా టాటా మోటార్స్ పేర్కొంది.
ఇండియన్ రోడ్లపై దుమ్మురేపుతున్న టాటా నెక్సాన్ ఈవి
టాటా మోటార్స్ తన మొదటి పబ్లిక్ ఎలక్ట్రిక్ కారు టాటా నెక్సాన్ ఈవీని 2020లో లాంచ్ చేసింది. అతితక్కువ టైంలోనే నెక్సాన్ ఈవీ దేశంలో 1 లక్ష యూనిట్ల అమ్మకాలను దాటిన మొదటి ఎలక్ట్రిక్ కారుగా నిలిచింది. ఇది భారత కస్టమర్లు ఎలక్ట్రిక్ వాహనాలను స్వీకరించడం మొదలుపెట్టారనడానికి ఒక ముఖ్యమైన సాక్ష్యంగా నిలిచింది.
ఈ ఈవి కార్లకు కూడా ఫుల్ డిమాండ్
ప్రస్తుతం టాటా ఈవీ లైనప్‌లో నెక్సాన్ ఈవీ మాత్రమే కాకుండా టాటా టియాగో ఈవీ, టాటా పంచ్ ఈవీ, టాటా హారియర్ ఈవీ, ఎక్స్‌ప్రెస్-టి ఈవీ లాంటి మోడళ్లు కూడా ఉన్నాయి. వేర్వేరు ధరలు, బాడీ టైప్ ఆప్షన్లు ఉండటం వల్లే, ప్యాసింజర్ ఈవీ మార్కెట్లో టాటా పెద్ద వాటాను దక్కించుకుంది.
టాటా ఈవి రికార్డులకు కారణాలివే..
ఈవీ అమ్మకాలు పెరగడానికి ముఖ్య కారణం వ్యక్తిగత కస్టమర్లు, కమర్షియల్ ఫ్లీట్ ఆపరేటర్లు పెద్ద సంఖ్యలో ఎలక్ట్రిక్ కార్లను ఎంచుకోవడమే. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఈ మార్పు వేగంగా జరుగుతోంది. టాటా ఈవీ కస్టమర్లు ఇప్పటివరకు 5 బిలియన్ కిలోమీటర్లకు పైగా ప్రయాణించారని కంపెనీ చెప్పింది. దీనివల్ల ఈవీలు రోజువారి వాడకానికి సరిపోతాయని నిరూపితమవుతోంది.
ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధి కోసం, టాటా మోటార్స్ ఛార్జింగ్ సౌకర్యాలలో కూడా నిరంతరం పెట్టుబడి పెడుతోంది. టాటా పవర్‌తో కలిసి దేశవ్యాప్తంగా 20,000కు పైగా పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. ఇది ఈవీ యూజర్ల నమ్మకాన్ని మరింత పెంచింది.
2026 లో రానున్న టాటా ఈవి మోడల్స్
భవిష్యత్ ప్రణాళికల విషయానికొస్తే టాటా మోటార్స్ కొత్త ఈవీ ప్లాట్‌ఫామ్‌తో చాలా మోడళ్లను తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. 2026 మొదట్లో టాటా సియెరా ఈవీ, అప్‌డేట్ చేసిన పంచ్ ఈవీ రిలీజ్ అవుతాయి. ఇంకా ప్రీమియం, లగ్జరీ సెగ్మెంట్ కోసం టాటా అవనియా సిరీస్ వచ్చే ఏడాది చివరి నాటికి లాంచ్ అవుతుంది. 2030 నాటికి ఐదు కొత్త ఈవీ బ్రాండ్లను విడుదల చేయడం టాటా దీర్ఘకాలిక లక్ష్యంగా పెట్టుకుంది. అంటే వచ్చే ఐదేళ్లలో టాటా ఈవి సరికొత్త రికార్డులను నెలకొల్పేందుకు సిద్దం అవుతోందన్నమాట.

