Kia Seltos 2026 : కేక పుట్టిస్తున్న కొత్త కియా సెల్టోస్.. డిజైన్, ఫీచర్లు అదరహో !
New Kia Seltos 2026: కియా సెల్టోస్ 2026 ఎస్‌యూవీ భారత్‌లో విడుదలైంది. రూ. 10.99 లక్షల ప్రారంభ ధరతో, లెవెల్-2 ADAS, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి అత్యాధునిక ఫీచర్లతో ఈ కారు అందుబాటులోకి వచ్చింది.

భారత్‌లో కొత్త కియా సెల్టోస్ 2026 విడుదల: ధర, ఫీచర్లు, వేరియంట్లు, పూర్తి వివరాలివే
భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సెకండ్ జనరేషన్ కియా సెల్టోస్ 2026 ఎట్టకేలకు విడుదలైంది. దేశంలోని మిడ్ సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న కియా, ఈ కొత్త మోడల్‌తో మరోసారి సంచలనం సృష్టించేందుకు సిద్ధమైంది.
అధునాతన టెక్నాలజీ, మెరుగైన భద్రతా ప్రమాణాలు, సరికొత్త డిజైన్‌తో ఈ కారును కియా ఇండియా మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ప్రారంభ ధరను రూ. 10.99 లక్షలు (ఎక్స్ షోరూమ్) గా నిర్ణయించారు. ఈ కారుకు సంబంధించిన బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం కాగా, జనవరి మధ్య నుంచి డెలివరీలు మొదలవుతాయని కంపెనీ వెల్లడించింది.
New Kia Seltos 2026 : సరికొత్త డిజైన్, మరింత మెరుగైన ఎక్స్‌టీరియర్
కొత్త కియా సెల్టోస్ ను ఆపోజిట్స్ యునైటెడ్ అనే డిజైన్ లాంగ్వేజ్‌తో రూపొందించారు. పాత మోడల్‌తో పోలిస్తే ఇది మరింత ఆకర్షణీయంగా, దృఢంగా కనిపిస్తుంది. ముందు భాగంలో పెద్ద గ్రిల్, నిలువుగా ఉండే ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు, ప్రొజెక్టర్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు దీనికి ప్రీమియం లుక్‌ను ఇస్తాయి.
కారు వెనుక భాగంలో కూడా భారీ మార్పులు చేశారు. స్లిమ్ ఎల్ షేప్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, రీడిజైన్ చేసిన బంపర్ కారుకు మోడ్రన్ టచ్‌ను జోడించాయి. అంతేకాకుండా, ఇది పాత మోడల్ కంటే పొడవు, వెడల్పులో పెరిగింది. దీని పొడవు 4,460 మి.మీ కాగా, వీల్‌బేస్ 2,690 మి.మీ ఉండటం వల్ల లోపల ప్రయాణికులకు మరింత స్పేస్ లభిస్తుంది. 18 అంగుళాల అల్లాయ్ వీల్స్, ఫ్లష్ ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్ దీనికి స్పోర్టీ లుక్‌ను తీసుకొచ్చాయి.
New Kia Seltos 2026 అత్యాధునిక ఇంటీరియర్, ఫీచర్లు
క్యాబిన్ లోపల భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. డ్యాష్‌బోర్డ్‌లో అమర్చిన పనోరమిక్ కర్వ్డ్ డిస్‌ప్లే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఇందులో 12.3 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. అదనంగా 5 అంగుళాల క్లైమేట్ కంట్రోల్ డిస్‌ప్లే కూడా ఉంది.
ప్రయాణికుల సౌకర్యం కోసం వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, 8 స్పీకర్ల బోస్ సౌండ్ సిస్టమ్‌ను అందించారు. డ్రైవర్ సీటును 10 రకాలుగా ఎలక్ట్రికల్‌గా అడ్జస్ట్ చేసుకోవచ్చు, అంతేకాకుండా ఇందులో మెమరీ ఫంక్షన్ కూడా ఉంది. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్, 64 రంగుల యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లు దీనిని ఒక హై టెక్ కారుగా మార్చాయి.
New Kia Seltos 2026 ఇంజిన్ సామర్థ్యం, పనితీరు ఎలా ఉంది?
కొత్త కియా సెల్టోస్ మూడు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది.
- 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్: ఇది 115hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది.
- 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్: ఇది 116hp శక్తిని అందిస్తుంది.
- 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్: ఇది అత్యధికంగా 160hp శక్తిని విడుదల చేస్తుంది.
గేర్‌బాక్స్ విషయానికి వస్తే, మాన్యువల్, ఐఎంటీ (iMT), ఐవీటీ (IVT), ఆటోమేటిక్, డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. భవిష్యత్తులో పెట్రోల్ హైబ్రిడ్ వెర్షన్‌ను కూడా తీసుకురానున్నట్టు కియా పేర్కొంది.
New Kia Seltos 2026 భద్రతా ప్రమాణాలు ఎలా ఉన్నాయి?
భద్రత విషయంలో కియా ఎక్కడా రాజీ పడలేదు. అన్ని వేరియంట్లలో ప్రామాణికంగా 6 ఎయిర్‌బ్యాగ్‌లను అందించారు. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది లెవెల్-2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్). దీని ద్వారా అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీపింగ్ అసిస్ట్ వంటి 21 రకాల భద్రతా ఫీచర్లు లభిస్తాయి. అదనంగా 360-డిగ్రీల కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
New Kia Seltos 2026 వేరియంట్లు, ధరలు
కొత్త కియా సెల్టోస్ మొత్తం మూడు ప్రధాన ట్రిమ్ లైన్లలో లభిస్తుంది: టెక్ లైన్, జీటీ లైన్, ఎక్స్ లైన్. వేరియంట్ల వారీగా చూస్తే HTE, HTK, HTX, GTX ఆప్షన్లు ఉన్నాయి. కొత్త కియా సెల్టోస్ ప్రారంభ ధర రూ. 10.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. గరిష్ఠ ధర రూ. 19.99 లక్షలు (టాప్ ఎండ్ ఆటోమేటిక్ వేరియంట్).
ఈ కొత్త సెల్టోస్ భారత మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, స్కోడా కుషాక్, ఫోక్స్ వ్యాగన్ టైగూన్, హోండా ఎలివేట్ వంటి కార్లకు గట్టి పోటీని ఇవ్వనుంది. దీనికి సంబంధించిన రంగుల ఎంపికలో మార్నింగ్ హేజ్, మాగ్మా రెడ్ వంటి కొత్త రంగులను కూడా చేర్చారు.

