బాలినేనితో విభేదాలే వైవీ సీటుకు ఎసరు: రాత్రి రాత్రే మాగుంట
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డితో ఉన్న విభేదాల కారణంగానే ఒంగోలు సీటును వైవీ సుబ్బారెడ్డి జారవిడుచుకున్నట్లు తెలుస్తోంది. బాలినేనితో విభేదాల వల్ల తిరిగి బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని ఒంగోలు పార్లమెంటు సీటులో పోటీకి దింపితే చిక్కులు తప్పవని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావించినట్లు తెలుస్తోంది.
ఒంగోలు: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డితో ఉన్న విభేదాల కారణంగానే ఒంగోలు సీటును వైవీ సుబ్బారెడ్డి జారవిడుచుకున్నట్లు తెలుస్తోంది. బాలినేనితో విభేదాల వల్ల తిరిగి బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని ఒంగోలు పార్లమెంటు సీటులో పోటీకి దింపితే చిక్కులు తప్పవని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావించినట్లు తెలుస్తోంది.
దాంతో వైవీ సుబ్బారెడ్డి స్థానంలో మాగుంట శ్రీనివాసులు రెడ్డిని తెర మీదికి తెచ్చినట్లు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అయిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాత్రికి రాత్రే వైసిపిలో చేరడానికి నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్యతలో పడ్డారని సమాచారం. ఆయన మంగళవారం వైసిపిలో చేరే అవకాశాలున్నాయి.
పార్టీలోకి వస్తే మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఒంగోలు ఎంపీ టికెట్ ఇచ్చేందుకు వైఎస జగన్ సుముఖుత వ్యక్తం చేసినట్లు సమాచారం. కాగా గత ఎన్నికల్లో ఒంగోలు నుంచి పోటీచేసి గెలిచిన జగన్ బాబాయ్, వైసీపీ మాజీ ఎంపీని రాజ్యసభకు లేదా ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తారని తెలుస్తోంది. ఈ మేరకు సుబ్బారెడ్డికి జగన్ హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు.
వైసీపీలో చేరాలని ఆదివారం రాత్రి మాగుంట శ్రీనివాసులు రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈసారి తాను లోక్‌సభకు పోటీ చేయలేనని ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుకు చెప్పారు. దీంతో టీడీపీ అధినాయకత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లవైపు కూడా దృష్టి సారించింది.
చివరి ప్రయత్నంగా ఆదివారం రాత్రి మరోసారి మాగుంట శ్రీనివాసులు రెడ్డి కోసం టీడీపీ నేతలు ప్రయత్నం చేసినట్లు తెలిసింది. అదే సమంయలో వైసీపీకి చెందిన కొందరు ముఖ్య నేతలు ఏదో విషయం తేల్చాలని ఆయనపై ఒత్తిడి పెంచినట్లు తెలుస్తోంది. పైగా, వైసిపిలో చేరాలని మాగుంటపై అనుచరుల నుంచి కూడా తీవ్రమైన ఒత్తిడి వచ్చినట్లు చెబుతున్నారు.