బంగాళాఖాతంలో మొంథా తుపాను రెడీ .. ఈ జిల్లాల్లో అల్లకల్లోలమే
IMD Rain Alert : బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలం తప్పేలాలేదు… అత్యంత భారీ వర్షాలకు బలమైన ఈదురుగాలు తోడయి నానా బీభత్సం సృష్టించనున్నాయని APSDMA హెచ్చరిస్తోంది.

బంగాళాఖాతంలో మొంథా తుపాను
Montha Cyclone : బంగాళాఖాతంలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడగా ఇప్పుడు తుపాను సిద్దమయ్యింది. ఈ 'మొంథా' తుపాను ఎఫెక్ట్ తో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా ఇకపై అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తోంది విపత్తు నిర్వహణ సంస్థ. ఇవాళ (అక్టోబర్ 27, సోమవారం) నుండి కొన్నిప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది... దీంతో ఆయా జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. ప్రజలు కూడా వాతావరణం ప్రశాంతంగా ఉందని అశ్రద్ధగా ఉండకూడదని... ఏ క్షణంలో అయినా వాతావరణం పూర్తిగా మారిపోయి వర్షాలు ప్రారంభం అవుతాయని హెచ్చరించింది.
మొంథా తుపాను తీరందాటేది ఇక్కడే
ప్రస్తుతం నైరుతి, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో మొంథా తుపాను కేంద్రీకృతమై ఉందని.. ఇది ఆంధ్ర ప్రదేశ్ తీరంవైపే దూసుకువస్తోందని APSDMA వెల్లడించింది. ఈ తుపాను గంటకు 18 కిలోమీటర్ల వేగంతో ముందుకు కదులుతోందని... ఇది రేపు (అక్టోబర్ 28, మంగళవారం ) తీవ్ర తుపానుగా మరుతుందని హెచ్చరించింది. ఇదేరోజు రాత్రి ఏపీలోని కాకినాడ సమీపంలో తీరందాటే అవకాశాలున్నాయని ప్రకటించింది.
దూసుకొస్తున్న మొంథా తుపాను
ప్రస్తుతానికి చెన్నైకి 600కి.మీ, విశాఖపట్నంకి 710 కి.మీ, కాకినాడకి 680 కి.మీ దూరంలో మొంథా తుపాను కేంద్రీకృతం అయివుందని విపత్తు నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ తుపాను ప్రభావంతో వర్షాలే కాదు బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుపాను తీరందాటే సమయంలో గంటకు 90-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తూ తీరంవెంబడి అల్లకల్లోలం సృష్టించే అవకాశాలున్నాయని హెచ్చరించారు.
ఈ జిల్లాల్లో నేడు భారీ వర్షాలు
మొంథా తుపాను ప్రభావంతో నేడు (సోమవారం) కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని విపత్తు నిర్వహణ సంస్థల తెలిపింది. ఇక శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని... ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్దంగా ఉండాలని APSDMA, హోంశాఖ సూచిస్తోంది.
మొంథా తుపాను... అత్యవసర సాయంకోసం ఫోన్ చేయాల్సిన నంబర్లివే
ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలతో నదులు, వాగులువంకలు వరదనీటితో ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. జలాశయాలు, చెరువులు, కుంటలు కూడా నిండుకుండల్లా మారి ఉప్పొంగుతున్నాయి. ఇలాంటి సమయంలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిస్తే వరదలు ఏర్పడే ప్రమాదముంది... నీటిప్రవాహాలు రోడ్లపైకి, జనవాసాల్లోకి చేరే అవకాశాలున్నాయి. కాబట్టి లోతట్టు, తీర ప్రాంతాల్లో నివాసముండే ప్రజలు పరిస్థితిని బట్టి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందుకు సిద్దంగా ఉండాలని సూచించింది APSDMA. అత్యవసర సాయంకోసం విపత్తు నిర్వహణ సంస్థ కంట్రోల్ రూం టోల్ ఫ్రీ నెంబర్లు 112 లేదా 1070 లేదా 1800 425 0101 కాల్ చేయాలని సూచించింది.
తస్మాత్ జాగ్రత్త...
మొంథా తుపాను ఏ స్థాయిలో బీభత్సం సృష్టించనుందో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోంమంత్రి అనితకు వివరించింది విపత్తు నిర్వహణ సంస్థ. ఈ క్రమంలోనే తుపాను తీవ్రత ఎక్కువగా ఉండే జిల్లాల కలెక్టర్లును అప్రమత్తం చేసి ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు... ఇందుకోసం ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయించారు. అలాగే సహాయక చర్యలకోసం 9SDRF, 7NDRF జిల్లాల్లో మొహరించారు... మరికొన్ని బృందాలను హెడ్ క్వార్టర్స్ సిద్ధంగా ఉంచారు. అత్యవసర విభాగాల ఉద్యోగాలు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయంకోసం డ్రోన్లు, చిన్నచిన్న పడవలను సిద్దం చేసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు.
తెలంగాణలో మొంథా ఎఫెక్ట్... ఈ జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలో కూడా మొంథా తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు (అక్టోబర్ 27న) ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబుబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
ఈ తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్
అయితే రేపు (అక్టోబర్ 28, మంగళవారం) తెలంగాణలోని కొన్నిజిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలుండటంతో రెడ్ అలర్ట్ జారీచేసింది. ఇక కొమ్రంభీ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కాబట్టి ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ విభాగం హెచ్చరించింది.