మొంథా తుపాను ఎఫెక్ట్.. స్కూళ్లకు మూడు రోజులు సెలవులు
Cyclone Montha Impact Schools Closed : మొంథా తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు, ఈదురు గాలులు ఉంటాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఈ క్రమంలోనే పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ కు మొంథా తుపాను గండం
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రమైన వాయుగుండం మరింత బలపడి మొంథా తుపానుగా మారింది. మరో 12 గంటల్లో ఇది తీవ్ర తుపానుగా మారే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. ఈ తుపాను అక్టోబర్ 28 సాయంత్రం లేదా రాత్రి సమయంలో మచిలీపట్నం–కళింగపట్నం మధ్యలోని కాకినాడకు సమీపంలో తీరం దాటే అవకాశముందని భారత వాతావరణశాఖ (ఐఎండీ) తెలిపింది.
ప్రస్తుతం తుపాను కాకినాడకు ఆగ్నేయంగా సుమారు 830 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. వేగంగా పశ్చిమ–వాయవ్య దిశగా కదులుతున్న మొంథా, తీరం దాటే సమయానికి గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ, అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని అధికార యంత్రాంగం హెచ్చరిస్తోంది.
తుపాను ముప్పు.. స్కూళ్లకు సెలవులు
తుపాను తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వెంటనే చర్యలు ప్రారంభించాయి. పలు జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించాయి. పలు ప్రాంతాల్లో ఐదు రోజుల వరకు సెలవులు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ లో సెలవులు
కాకినాడ జిల్లా : అక్టోబర్ 27 నుంచి 31 వరకు 5 రోజులు సెలవులు
కృష్ణా, బాపట్ల, గుంటూరు, అనకాపల్లి : అక్టోబర్ 27–29 వరకు 3 రోజులు సెలవులు
తూర్పుగోదావరి, అన్నమయ్య, కడప, ఏలూరు, అంబేద్కర్ కోనసీమ : అక్టోబర్ 27–28 వరకు 2 రోజులు సెలవులు
పల్నాడు :అక్టోబర్ 27న 1 రోజు సెలవు
వాతావరణ మార్పుల ఆధారంగా సెలవుల సంఖ్య పెరగొచ్చని అధికారులు తెలిపారు. తల్లిదండ్రులు, విద్యార్థులు అధికారిక ప్రకటనలను అనుసరించాలని సూచించారు.
భారీ వర్షాలతో అల్లకల్లోలం.. పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ
తుపాను ముప్పు నేపథ్యంలో వాతావరణ శాఖ మూడు రకాల హెచ్చరికలు జారీ చేసింది. అత్యంత ప్రమాదం ఉన్న జిల్లాలుగా పొట్టిశ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
చిత్తూరు, తిరుపతి, నంద్యాల, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, తూర్పుగోదావరి, అనకాపల్లి, విశాఖపట్నం, పార్వతీపురం, విజయనగరం, శ్రీకాకుళం తదితర జిల్లాలపై తుపాను ప్రభావం వుంటుందని హెచ్చరిస్తూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తీరప్రాంతాల్లో సముద్ర అలలు చాలా ఎత్తుగా ఎగసే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని అధికారులు హెచ్చరిలు ఇచ్చారు.
తెలంగాణలోనూ భారీ వర్షాల హెచ్చరికలు
ఆంధ్రప్రదేశ్ లోనే కాదు తెలంగాణలో కూడా మొంథా తుఫాను ప్రభావం కనిపిస్తోంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రోజుల్లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
అక్టోబర్ 28న ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, కొత్తగూడెంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. అక్టోబర్ 29న ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ తదితర జిల్లాల్లో భారీ వర్షాల కురుస్తాయని అంచనా వేసింది. ప్రజలు బయటకు వెళ్లే ముందు వాతావరణ పరిస్థితులు పరిశీలించాలని అధికారులు సూచించారు.
మొంథా తుపాను పై ప్రభుత్వం అలర్ట్
మొంథా తుపాను తీవ్ర ప్రభావం చూపించనుందనే అంచనాల మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఏపీఈపీడీసీఎల్, విపత్తు నిర్వహణ శాఖలను అలర్ట్ చేసింది. అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామనీ, ఈ నెల 27, 28, 29 తేదీల్లో విద్యుత్ ఉద్యోగుల సెలవులు రద్దు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది.
హాస్పిటళ్లు, మొబైల్ టవర్లకు నిరంతరం పవర్ సరఫరా అందించాలనీ, 6 NDRF, 13 SDRF టీమ్‌లు సిద్ధంగా ఉండాలని పేర్కొంది. హెలికాప్టర్లు, బోట్లు సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, “ప్రాణ, ఆస్తి నష్టం ఏదీ జరగకుండా ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు చేసింది. ప్రజలు వదంతులను నమ్మవద్దని” తెలిపారు.