- Home
- Andhra Pradesh
- Vanjangi Hills : మేఘాలు తాకే కొండలపైనుండి సూర్యోదయం... వంద సిమ్లాలు, వెయ్యి ఊటీలను మించిన సీన్
Vanjangi Hills : మేఘాలు తాకే కొండలపైనుండి సూర్యోదయం... వంద సిమ్లాలు, వెయ్యి ఊటీలను మించిన సీన్
Vanjangi Hills : తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రకృతి రమణీయమైన ప్రదేశాలున్నాయి… ఇలాంటివే వంజంగి మేఘాల కొండలు. ఇది సిమ్లా, ఊటీ కంటే వందరెట్లు అందంగా ఉంటుందని అక్కడికి వెళ్లివచ్చిన పర్యాటకులు చెబుతుంటారు.

వంజంగి అందాలు
Vanjangi Hills : ప్రకృతి అందాలను ఇష్టపడేవారు తరుచు ఏ ఊటీకో, కొడైకెనాల్ కో లేదంటే సిమ్లాకో వెళుతుంటారు. కానీ తెలుగు రాష్ట్రాల్లోనూ వీటిని తలదన్నే అనేక ప్రాంతాలున్నాయి... వాటిలో ఎక్కువగా వినిపించేది అరకు, లంబసింగి వంటి పేర్లు. కానీ శీతాకాలంలో వీటికంటే అందమైన ప్రాంతమొకటి ఉంది... అదే వంజంగి మేఘాల కొండలు.
వంజంగి కొండలు ఎక్కడున్నాయి..?
ఆంధ్ర ప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ఈ వంజంగి ప్రాంతం ఉంది. మన్యం ప్రాంతంలోని తూర్పు కనుమలలోనే వంజంగి ఉంటుంది... ఎత్తైన కొండలపైనుండి తెల్లవారుజామున సూర్యోదయం, దట్టమైన పొగమంచు, తాకుతూ వెళ్లే మేఘాలు… ఈ అద్భుత దృశ్యాలు కనువిందు చేస్తాయి.
కొండ అంచుల్లో కాఫీ తోటలు, దట్టంగా పరుచుకున్న చెట్లతో ప్రకృతి రమణీయంగా ఉంటుంది. ఇలాంటి ప్రాంతంలో శీతాకాలం వచ్చిందంటే చాలు దట్టమైన మేఘాలు, పొగమంచుతో ఆ ప్రాంతం మరింత అందంగా మారుతుంది. ఉదయం ఈ మేఘాలు, మంచును చీల్చుకుంటూ ఎర్రగా పైకితేలే సూర్యుడిని చూడటం ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. ఇది చూడ్డానికే వంజంగి ప్రాంతానికి పర్యాటకులు తరలివస్తున్నారు.
వంజంగి కొండలకు ఎలా చేరుకోవాలి..?
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరుకు కేవలం 6 కిలోమీటర్ల దూరంలోనే వంజంగి కొండలున్నాయి. విశాఖపట్నం నుండి పాడేరు 100 కిలోమీటర్లు... అక్కడికి ఆర్టిసి బస్సులు, టాక్సీలు ఉంటాయి. హైదరాబాద్ నుండి వంజంగికి చేరుకోవాలంటే మాత్రం ప్లైట్ లేదా రైలు, బస్సులో విశాఖకు... అక్కడినుండి వంజంగికి చేరుకోవచ్చు. పాడేరు నుండి వంజంగి వివ్ పాయింట్ కు ఐదుకిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది... ట్రెక్కింగ్ ను ఇష్టపడేవారికి వంజంగి టూర్ పర్పెక్ట్ గా ఉంటుంది.
వంజంగికి గుర్తింపు...
గతంలో అరకు, లంబసింగి, చింతపల్లి , మారేడుమిల్లి ప్రాంతాలు ప్రకృతి అందాలతో నిండివుండి ఇప్పటికే పర్యాటక ప్రాంతాలుగా గుర్తింపుపొందాయి. పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండటంతో ఈ ప్రాంతాలు కలుషితం అవుతున్నాయి. కానీ పాడేరు సమీపంలోని వంజంగి ఇప్పుడిప్పుడు బాగా గుర్తింపుపొందుతోంది. ఇక్కడి వ్యైపాయింట్ నుండి సూర్యోదయం, మేఘాల దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ ప్రాంతాన్ని సందర్శించేందకు పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా శీతాకాలంలో 3,400 అడుగులోని వంజంగి హిల్స్ సరికొత్త అందాలను సంతరించుకుంటాయి.
వంజంగి టూర్ ప్లాన్...
విశాఖపట్నం నుండి అనేక టూరిజం కంపెనీలు వంజంగి టూర్ సదుపాయం కల్పిస్తున్నాయి. సాధారణంగా 1 రాత్రి, రెండు రోజులు టూర్ ప్లాన్ చేసుకోవచ్చు. వంజంగితో పాటు అరకు లోయ, బొర్రా గుహలు, కాఫీ తోటలు, గిరిజన మ్యూజియం, పద్మాపురం గార్డెన్స్ ను కూడా చూడవచ్చు. కొత్తపల్లి జలపాతాలను కూడా సందర్శించవచ్చు. పూర్తిగా ప్రకృతి ఒడిలొ సేదతీరాలంటే ఇది పర్పెక్ట్ ప్లేస్... రాష్ట్ర పర్యాటక శాఖ కూడా వంజంగి ప్రాంతాన్ని పర్యాటకానికి అనుకూలంగా తీర్చిదిద్దుతోంది.

