- Home
- Andhra Pradesh
- Tirupati laddu: తిరుమల లడ్డుకు 310 ఏళ్లు.. లడ్డు చరిత్ర ఏంటి.? ఎందుకింత ప్రత్యేకమో తెలుసా.?
Tirupati laddu: తిరుమల లడ్డుకు 310 ఏళ్లు.. లడ్డు చరిత్ర ఏంటి.? ఎందుకింత ప్రత్యేకమో తెలుసా.?
Tirupati Laddu History: తిరుమల లడ్డూకు ఉన్న ప్రత్యేకత ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎవరైనా తెలిసిన వాళ్లు తిరుపతి వెళ్లొస్తే వారిని ముందుగా అడిగేది లడ్డే. ఎంతో పవిత్రమైన ఈ ప్రసాదానికి శనివారంతో 310 ఏళ్లు నిండింది.

310 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీవారి లడ్డు
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రసాదం అంటే అందరికీ గుర్తొచ్చేది శ్రీవారి లడ్డు. ఈ ప్రసాదం తిరుమల ఆలయానికి మాత్రమే ప్రత్యేకం. ఆగస్టు 2వ తేదీతో ఈ లడ్డు 310 ఏళ్ల చరిత్రను పూర్తి చేసుకుంది. దేశవ్యాప్తంగా మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా తిరుమల లడ్డూకు ప్రత్యేక గుర్తింపు ఉంది. శ్రీవారిని దర్శించుకున్న ప్రతీ ఒక్కరూ ఈ ప్రసాదాన్ని తప్పక స్వీకరిస్తారు. కొందరు స్వయంగా తిరుమలకు రాలేకపోయినా, కుటుంబ సభ్యులు లేదా మిత్రుల ద్వారా తెప్పించుకొని మరి లడ్డూను తింటారు.
KNOW
లడ్డూ ప్రసాదం ఎప్పుడు ప్రారంభమైంది.?
శ్రీవారి లడ్డూను ప్రసాదంగా ఇవ్వడం 1715 ఆగస్టు 2న ప్రారంభమైంది. మొదట్లో భక్తులకు వడను మాత్రమే ప్రసాదంగా ఇచ్చేవారు. 17వ శతాబ్దం నుంచి బూందీ లడ్డూను తయారు చేసి పంచడం మొదలుపెట్టారు. ఆ కాలంలో హథీరాంజీ మఠం నిర్వాహకులు లడ్డు తయారీలో కీలక పాత్ర పోషించారు. క్రీ.శ. 1803లో బూందీ ప్రసాదంగా పంచడం ప్రారంభమై, 1940 నాటికి లడ్డూ శాశ్వత ప్రసాదంగా మారింది. తొలిసారి లడ్డూని కేవలం ఎనిమిది నాణేలకే విక్రయించేవారు. కాలక్రమంలో ధరలు పెరిగి ప్రస్తుతం 50 రూపాయలకు అందిస్తున్నారు.
లడ్డు తయారీ ప్రాముఖ్యత
లడ్డు తయారీకి తిరుమలలో ప్రత్యేక వంటశాలలు ఉన్నాయి. వీటిని లడ్డు పోటు అంటారు. ఇక్కడ రోజూ దాదాపు మూడు లక్షల ఇరవై వేల లడ్డూలను తయారు చేస్తున్నారు. 2010 వరకు రోజుకు ఒక లక్ష లడ్డూలు మాత్రమే తయారు చేయగా, భక్తుల రద్దీ పెరగడంతో ఉత్పత్తిని పెంచారు. లడ్డు తయారీలో 600 మందికి పైగా సిబ్బంది పాల్గొంటారు. వీరిలో పాకశాస్త్ర నిపుణులు, నాణ్యత తనిఖీ చేసే సిబ్బంది కూడా ఉంటారు. ప్రతి లడ్డూ రుచి, శుభ్రత, నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా టీటీడీ ప్రత్యేక పర్యవేక్షణ చేస్తుంది.
తిరుమల లడ్డు తయారీ విధానం
లడ్డూ రకాలు
తిరుమలలో తయారు చేసే లడ్డూలకు వేర్వేరు రకాలున్నాయి.
ప్రోక్తమ్ లడ్డు: సాధారణ యాత్రికులకు ఇచ్చే లడ్డు. బరువు 65-75 గ్రాములు.
ఆస్తానం లడ్డు: ప్రత్యేక పండుగ సందర్భాల్లో తయారు చేసే లడ్డు. బరువు 750 గ్రాములు. ఇందులో జీడిపప్పు, బాదం, కుంకుమపువ్వు ఉపయోగిస్తారు.
కళ్యాణోత్సవ లడ్డు: కళ్యాణోత్సవం, ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులకు ఇచ్చే లడ్డు. పరిమిత సంఖ్యలో మాత్రమే తయారు చేస్తారు.
తిరుమల లడ్డు తయారీ వీడియో
GI గుర్తింపు, ప్రత్యేకత
తిరుపతి లడ్డూకు 2009లో భౌగోళిక సూచిక (GI) గుర్తింపు లభించింది. దీంతో ఈ లడ్డు తయారీ విధానం ఇతర ప్రదేశాల్లో అనుకరించరాదు. 2014లో ట్రేడ్ మార్క్ కూడా పొందింది. 2017లో ఇండియా పోస్ట్ ఈ లడ్డూను గుర్తుచేసే పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది. తరతరాలుగా ఈ లడ్డు తన రుచి, సువాసన, పవిత్రతతో భక్తుల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. డూప్లికేట్ లడ్డూలను ఆన్‌లైన్‌లో విక్రయించే సంస్థలపై టీటీడీ కఠిన చర్యలు తీసుకుంది. తిరుపతి లడ్డూ 2009లో 'భౌగోళిక సూచిక' (GI) గుర్తింపు పొందిన తొలి ఆలయ ప్రసాదంగా నిలిచింది. GI Tag ద్వారా ఈ లడ్డూని కేవలం తిరుమలలోనే తయారు చేయాల్సిందే, బయట ఎక్కడా తయారీ నిషేధం ఉంది. ఈ లడ్డు కేవలం ఒక ప్రసాదం మాత్రమే కాదు. ఇది తిరుమల వేంకటేశ్వర స్వామి భక్తికి ప్రతీక.