- Home
- Andhra Pradesh
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. రెండు రోజులు ఆ దర్శనాలు రద్దు చేస్తూ నిర్ణయం
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. రెండు రోజులు ఆ దర్శనాలు రద్దు చేస్తూ నిర్ణయం
శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రతీ నిత్యం వేలాది మంది తిరుమలకు వస్తుంటారు. దేశంలోని నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున శ్రీవారిని దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా భక్తులకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.

ఆస్థానం పర్వదినం నేపథ్యంలో
తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 16న నిర్వహించనున్న ఆణివార ఆస్థానం పర్వదినం నేపథ్యంలో, జూలై 14, 15 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ప్రోటోకాల్ ప్రముఖులను మినహాయించి మిగిలిన వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించిన సిఫార్సు లేఖలను స్వీకరించబోమని టీటీడీ స్పష్టం చేసింది. ఈ రెండు రోజులలో దర్శనానికి వచ్చే భక్తులు ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలని విజ్ఞప్తి చేసింది.
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం – ఆలయ శుద్ధి కార్యక్రమం
జూలై 15న ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అనే విశిష్ట శుద్ధి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇది ప్రతి పర్వదినానికి ముందు చేసే సంప్రదాయ కార్యక్రమం. ఈ శుద్ధి అనంతరం జూలై 16న నిర్వహించనున్న ఆణివార ఆస్థానం వేడుకలు ప్రారంభమవుతాయి. ఈ ఉత్సవాల కారణంగా, టీటీడీ ఆలయ కార్యకలాపాల్లో మార్పులు చేసింది.
భక్తుల రద్దీ పెరుగుదల
తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది. జూలై 4న శుక్రవారం ఒక్కరోజే 70,011 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 28,496 మంది తలనీలాలు సమర్పించగా, హుండీ ఆదాయం రూ. 3.53 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.
వారాంతం కావడంతో శనివారం ఉదయం నుంచే తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. క్యూలైన్లు ఎన్‌జీ షెడ్ల దాకా చేరాయి. సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులకు కనీసం 24 గంటల పాటు వేచి ఉండాల్సి వస్తోంది. ఆదివారం భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది.
ఏనుగుల భయం
కొద్ది రోజుల క్రితం తిరుమల మెట్లు మార్గాల్లో చిరుతల సంచారం భక్తుల్లో భయం కలిగించిన విషయం తెలిసిందే. తాజాగా, ఏనుగుల గుంపు ఘాట్ రోడ్డులో కనిపించడం భక్తుల్లో మరింత ఆందోళనకు కారణమైంది. గురువారం రాత్రి నాలుగు ఏనుగులు మొదటి ఘాట్ రోడ్డులో సంచరిస్తుండగా భక్తులు వాటిని గమనించి వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. వాటిలో ఒక ఏనుగు రోడ్డుపైకి రావడానికి ప్రయత్నించినట్లు కనిపించింది.
ఏనుగుల భయం
ఈ ఘటనపై స్పందించిన టీటీడీ అటవీ శాఖ సిబ్బంది వెంటనే ఘాట్ రోడ్డుకు చేరుకుని ఏనుగులను సురక్షితంగా అడవిలోకి తరలించారు. భక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా పర్వత మార్గాల్లో వెళ్లకూడదని, గుంపులుగా ప్రయాణించాలని అధికారులు సూచించారు. భక్తుల రక్షణ కోసం ఐదుసార్లు పెట్రోలింగ్ ఏర్పాటు చేశారు. అన్ని మార్గాల్లోనూ అటవీ శాఖ గస్తీ బృందాలు క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నాయి.