తెలుగు రాష్ట్రాల్లో వరుస ప్రమాదాలు .. ఒకేరోజు మూడు బస్సు యాక్సిడెంట్స్
Bus Accident : తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు బస్సు ప్రమాదాలు జరిగాయి… ఇందులో కొందరు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా చాలామంది గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదాలు ఎక్కడెక్కడ జరిగాయంటే..

తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు
Bus Accident : తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కర్నూల్, చేవెళ్ల బస్సు ప్రమాదాలను మర్చిపోకముందే మరికొన్ని దుర్ఘటనలు సంభవించాయి. ఇవాళ (మంగళవారం తెల్లవారుజామున) ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణలో ప్రైవేట్, ఆర్టిసి బస్సులు ప్రమాదాలకు గురయ్యాయి. ఇందులో పలువురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
ఏలూరులో ట్రావెల్స్ బస్సు ప్రమాదం
ఆంధ్ర ప్రదేశ్ లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురయ్యింది... గత రాత్రి (నవంబర్ 03న) ఏలూరు నుండి హైదరాబాద్ కు బయలుదేరిన భారతి ట్రావెల్స్ బస్సు మార్గమధ్యలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్నవెంటనే స్థానిక పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఏలూరు జిల్లా లింగపాలెం మండలం జూబ్లీనగర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. గాయపడినవారు ప్రస్తుతం లింగంపాలెం ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
సత్యసాయి జిల్లాలో బస్సు ప్రమాదం
ఇదిలావుంటే సత్యసాయి జిల్లాలో మరో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు నుండి హైదరాబాద్ కు వస్తున్న జబ్బర్ ట్రావెల్స్ బస్సు మార్గమధ్యలో సత్యసాయిజిల్లాలో ప్రమాదానికి గురయ్యింది. చెన్నె కొత్తపల్లి మండలం దామాజిపల్లి వద్ద వేగంగా వెళుతున్న బస్సు ఒక్కసారిగా మరో వాహనాన్ని ఢీకొట్టి ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతిచెందగా 8 మంది ప్రయాణికులకు గాయాలపాలయ్యారు. వీరు ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.
కరీంనగర్ లో బస్సు ప్రమాదం
నిన్న చేవెళ్లలో జరిగిన ఘోర బస్సు ప్రమాదాన్ని మర్చిపోకముందే ఇవాళ తెల్లవారుజామున కరీంనగర్ లో మరో ప్రమాదం జరిగింది. తిమ్మాపూర్ మండలం రేణిగుంట బ్రిడ్జి వద్ద ఆర్టిసి బస్సు ప్రమాదానికి గురయ్యింది... వేగంగా వెళుతున్న బస్సు ముందు వెళుతున్న ట్రాక్టర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. కరీంనగర్ నుండి హైదరాబాద్ కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు... స్థానికుల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న వరుస రోడ్డు ప్రమాదాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి... బస్సు ఎక్కాలంటేనే ప్రజలు భయపడిపోయే పరిస్థితి నెలకొంది.