- Home
- Andhra Pradesh
- తెలుగు రాష్ట్రాల్లో కురిసేది చిరుజల్లులే, అయినా ప్రమాదకరం... ఈ ప్రాంతాల్లో అల్లకల్లోలమే
తెలుగు రాష్ట్రాల్లో కురిసేది చిరుజల్లులే, అయినా ప్రమాదకరం... ఈ ప్రాంతాల్లో అల్లకల్లోలమే
Thunderstorm Alert : తెలుగు రాష్ట్రాల్లో ఈ నాలుగైదు రోజులు భారీ వర్షసూచనలేమీ లేవు… కొన్ని జిల్లాల్లో చిరుజల్లులు కురిసే అవకాశాలున్నాయట. కానీ వీటివల్లే చాలా ప్రమాదం పొంచివుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

తెలుగు రాష్ట్రాలకు పొంచివున్న ప్రమాదం
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో వర్షాకాలం ముగిసినా వానలు పడుతున్నాయి. అక్టోబర్ చివర్లో మొంథా తుపాను ప్రభావంతో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిశాయి... కానీ నవంబర్ లో ఆ స్థాయి వర్షాలు లేవు... మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ వర్షాలకు పిడుగులు తోడయి ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. కాబట్టి తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు మరికొద్దిరోజులు వర్షాలతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాయి వాతావరణ విభాగాలు.
ఈ ఏపీ జిల్లాలకు పిడుగుల ప్రమాదం
ఇవాళ (అక్టోబర్ 04, మంగళవారం) ఆంధ్ర ప్రదేశ్ లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు పిడుగుల ప్రమాదం పొంచివుందని తెలిపారు. ఈ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడతాయి... కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది విపత్తు సంస్థ.
ఏపీ ప్రజలు తస్మాత్ జాగ్రత్త...
రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కూడా అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని... ఈ సమయంలో చెట్ల క్రింద నిలబడరాదని సూచించారు. సురక్షితమైన ప్రాంతాల్లో తలదాచుకుని తగిన జాగ్రత్తలు పాటించడం ద్వారా పిడుగుల ప్రమాదం ఉండని చెబుతున్నారు.
ఈ తెలంగాణ జిల్లాలకు పిడుగుల ప్రమాదం
ఇక తెలంగాణకు కూడా పిడుగుల ప్రమాదం పొంచివుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్,నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఈ ప్రమాదం ఎక్కువని తెలిపింది. ఈ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలతో పాటు పిడుగులు, ఈదురుగాలుల (గంటకు 30-40 కి.మీ వేగం) ప్రమాదం ఉందట... దీంతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
తెలంగాణలో ఉష్ణోగ్రతలు
తెలంగాణలో ఉష్ణోగ్రతల విషయానికి వస్తే అత్యల్పంగా మెదక్ లో 20.3 డిగ్రీ సెల్సియస్ నమోదయ్యింది. ఇక హైదరాబాద్ పటాన్ చెరులో 21.2, హయత్ నగర్ లో 21.6 డిగ్రీ సెల్సియస్ నమోదయ్యింది. అత్యధికంగా ఖమ్మంలో 34.4 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. మిగతా అన్ని జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 20-26 డిగ్రీ సెల్సియస్... గరిష్ట ఉష్ణోగ్రతలు 30-35 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.