Interesting Facts : గాల్లో ఎగిరే విమానాలపై పిడుగులు పడతాయా?
Interesting Facts : గాల్లోంచి దూసుకువచ్చే పిడుగులు భూమిపై విధ్వంసం సృష్టిస్తాయి. మరి అదే గాల్లో ఎగిరే విమానాలపై ఈ పిడుగులు పడతాయా?ఇలా విమాన ప్రమాదాలు జరుగుతాయా? ఈ డౌట్ ను ఇక్కడ క్లియర్ చేసేకొండి.

మీ డౌట్ ను క్లియర్ చేసుకొండి
Interesting Facts : ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి... తెలుగు రాష్ట్రాలను అయితే ఈ వర్షాలు వీడటంలేదు. ఈ వర్షాలకు ఉరుములు మెరుపులు, పిడుగులు తోడవడంతో ప్రాణనష్టం జరుగుతోంది. వర్షాకాలంలోనే కాదు ఎండాకాలంలో వర్షాలు కురిసినా పిడుగులు పడుతుంటాయి... దీంతో మనుషులే కాదు మూగజీవాలు చనిపోవడం, ఆస్తుల నష్టం జరుగుతుంది. ఆకాశంలోని నేలపైకి దూసుకువచ్చే పిడుగులు వేల డిగ్రీల ఉష్ణోగ్రతను కలిగివుంటాయి... ఆ వేడికి అది పడినచోటే కాదు దాని చుట్టుపక్కల కొంతదూరంలో ఉన్నవన్నీ కాలిపోతాయి. ఇంత పవర్ ఫుల్ గా ఉండే పిడుగులు ఆకాశంలోనే ఉత్పత్తి అవుతాయి... అలాంటిది గాల్లో ఎగిరే విమానాలను, హెలికాప్టర్లపై పడవా? భూమిపైనే పడతాయా? అనే డౌట్ చాలామందికి ఉంటుంది. ఆ అనుమానాన్ని ఇప్పుడు ఇక్కడ క్లియర్ చేసుకుందాం.
విమానాలపై పిడుగులు పడతాయా?
భూమిపై పడినట్లే గాల్లో ఎగిరే సమయంలో విమానాలపై కూడా పిడుగులు పడతాయి. ఇలా ఒకటి రెండు కాదు ఏడాదికి దాదాపు వెయ్యికి పైగా విమానాలు పిడుగుపాటుకు గురవుతుంటాయని కొన్ని అద్యయనాలు చెబుతున్నాయి. ఇంతటి ప్రమాదకరమైన పిడుగులు పడినా విమానాలకు, అందులో ప్రయాణిస్తున్నవారికి ఏమీ కాకపోవడానికి కారణం వాటి నిర్మాణమే. విమానాలను పిడుగులను తట్టుకునేలా ప్రత్యేక టెక్నాలజీతో చాలా దృఢంగా నిర్మిస్తారు.
అసలు పిడుగు అంటే ఏమిటి? ఎలా ఏర్పడుతుంది?
పిడుగు అనేది విద్యుత్ ప్రవాహం... ఆకాశంలోని మేఘాలలో పిడుగులు ఉత్పత్తి అవుతాయి. అయితే ఈ విద్యుత్ ప్రవాహం భూమిపైకి దూసుకువస్తూ గాలిని వేడి చేస్తుంది... ఈ వేడిగాలి ప్లాస్మాగా మారి తీవ్రమైన కాంతిని, వేడిని విడుదలచేస్తుంది. ఈ ప్రక్రియలో దాదాపు 27,000 సెల్సియస్ కి పైగా వేడి పుడుతుంది... ఈ అధిక ఉష్ణోగ్రతే ప్రమాదాలకు కారణం అవుతుంది. కానీ విమానాలను ఈ విద్యుత్ ప్రవాహాన్ని తట్టుకునేలా 'పేరడే కేజ్' సూత్రం ఆధారంగా రూపొందిస్తారు.
అంటే గాల్లో ఎగురుతున్న విమానంపై పిడుగు పడినా ఆ విద్యుత్ ప్రవాహం లోపలికి వెళ్లదు. విమానాన్ని ప్రత్యేకమైన లోహంతో తయారుచేస్తారు... ఇది విద్యుత్ ప్రవాహాన్ని నియంత్రిస్తుంది. అందువల్లే విమానంపై పిడుగులు పడినా బయటిభాగమే దాన్ని నియంత్రిస్తుంది... అందుకే బయటినుండి బయటికే విద్యుత్ వెళ్లిపోతుంది. ఇంకా ఏదైనా విద్యుత్ విమానంలో ప్రవాహిస్తున్నా ల్యాండింగ్ సమయంలో అది ఎర్త్ అయ్యేలా రన్ వే నిర్మాణం ఉంటుంది. అందుకే విమానంపై పిడుగులు పడినా లోపలున్నవారికి తెలియదు... అందరూ సురక్షితంగా ఉంటారు.
విమానంపై పిడుగు పడినట్లు తెలుస్తుందా?
విమానంలోని ప్రయాణికులకు పిడుగు పడినట్లు తెలియదు... కానీ పైలట్లకు మాత్రం ఆ విషయం అర్థమవుతుందట. పైలట్లకు మెరుపులు కనిపిస్తుంది... చిన్న శబ్దం వినిపించవచ్చు... ఒక్కోసారి చిన్నపాటి కుదుపులకు గురికావచ్చు. దీన్నిబట్టి పిడుగు పడినట్లు పైలట్లు గుర్తిస్తారు. ఈ పిడుగుల వల్ల విమానాలకు ప్రమాదం జరగడంగాని, లోపలున్న పరికరాలు దెబ్బతినడం కానీ, ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడటం కానీ జరగదు.
ఒక్కోసారి విమానాలపై బలమైన పిడుగులు పడినప్పుడు బయటిభాగం కాస్త దెబ్బతినే అవకాశాలుంటాయి. ఇలా జరిగితే ఆ విమానాన్ని భద్రతా పరీక్షల తర్వాతే తిరిగి గాల్లో ఎగరడానికి అనుమతిస్తారు. కాబట్టి విమాన ప్రయాణ సమయంలో పిడుగులు పడతాయన్న భయం వద్దు.. వర్షం కురుస్తున్నవేళ కూడా విమాన ప్రమాణం సురక్షితమే.
పిడుగుల వల్ల విమాన ప్రమాదాలు జరిగాయా?
ఇప్పుడున్నంత అడ్వాన్స్ టెక్నాలజీ లేని సమయంలో విమానాల నిర్మాణం ఇంత స్ట్రాంగ్ ఉండేదికాదు. అందువల్ల అనేక ప్రమాదాలు జరిగేవి... పిడుగుల వల్ల కూడా ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఉన్నాయి. 1963, డిసెంబర్ 8న అమెరికాలో ఎగురుతున్న విమానంపై పిడుగుపడటంతో మంటలు చెలరేగి పేలిపోయింది.. ఈ ప్రమాదంలో 81 మంది చనిపోయారు.
ఈ దుర్ఘటన తర్వాత విమాన ప్రయాణికుల భద్రతపై ప్రత్యేక శ్రద్ద పెట్టారు.. అందులో భాగంగానే వాటిని మరింత బలంగా ఉండేలా రూపొందించారు. కాలానుగుణంగా ఆధునిక సాంకేతికను ఉపయోగించుకోవడంతో వీటిలో భద్రతా ప్రమాణాలు పెరిగాయి. గతంలో కంటే విమానాల ప్రమాదాలు చాలా తగ్గాయి. కొన్నిసార్లు సాంకేతిక సమస్యలతో అహ్మదాబాద్ లో ఎయిరిండియా విమాన ప్రమాదంవంటికి జరగవచ్చు.