Interesting Facts : పిడుగులు చెట్లపైనే ఎందుకు పడతాయో తెలుసా?
Interesting Facts : తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలకాలంలో పిడుగుపాట్లు ఎక్కువయ్యాయి. దీంతో వర్షం కురిసే సమయంలో చెట్లకింద ఉంటే ప్రమాదకరమని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మరి చెట్లపైనే పిడుగులు ఎక్కువగా పడటానికి కారణాలేంటి?

పిడుగుల గురించి ఆసక్తికరమైన విషయాలు..
Interesting Facts : సాధారణంగా వర్షాకాలంలో ఎక్కువగా భారీ వర్షాలు, వరదలు, తుఫాను, ఉరుములు మెరుపులు, పిడుగులు, ఈదురుగాలులు అనే పదాలు వినిపిస్తుంటారు. వర్షం గురించి చెప్పేసమయంలో వీటిలో ఏదోఒకటి ఉపయోగిస్తుంటాం. ఇక వర్షం కురిసే సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలగురించి చెబుతూ... ముందుగా చెట్లకిందకు వెళ్లరాదని చాలామంది సూచిస్తుంటారు. చెట్లపై ఎక్కువగా పిడుగులు పడే అవకాశాలుంటాయి కాబట్టి వర్ష సమయంలో వాటివద్దకు వెళ్లకూడదని మన పెద్దవారితో సహా వాతావరణ నిపుణులు హెచ్చరిస్తారు.
అయితే అసలు పిడుగులంటే ఏమిటి? ఇవి చెట్లపైనే ఎందుకు ఎక్కువగా పడతాయి, ఇందుకు శాస్త్రీయ కారణాలేంటి? చెట్లు కాకుండా ఇంకా ఎలాంటి ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశాలు ఎక్కువ? పిడుగుపాటు బారిన పడకుండా తీసుకోవాల్సిన ముందుజాగ్రత్త చర్యలేంటి? ఈ విషయాలన్నింటి గురించి ఇక్కడ తెలుసుకుందాం.
ఏమిటీ పిడుగులు, ఎలా ఏర్పడతాయి?
చాలామంది పిడుగు అంటే అగ్నిప్రవాహంగా భావిస్తారు... కానీ ఇది ఓ విద్యుత్ ప్రవాహం. ఆకాశంలో మేఘాల మధ్య దాదాపు 30 కోట్ల మెగావాట్ల విద్యుత్ జనరేట్ అవుతుందట... ఇది భూమిపైకి దూసుకువస్తూ గాలిని వేడిచేసి ప్లాస్మాగా మారుతుంది. ఇలా కాంతిని, వేడిని విడుదల చేస్తూ భూమిపైకి దూసుకువచ్చే విద్యుత్ ప్రవాహమే పిడుగు. ఇది భూమిని చేరే సమయానికి 27,000 సెల్సియస్ ఉష్ణోగ్రతను కలిగివుంటుంది... ఇంతటి వేడి ఉంటుంది కాబట్టే పిడుగుపాటుకు గురయితే చెట్లు కాలిబూడిద అవుతాయి.. మనుషులు ప్రాణాలు కోల్పోతారు.
చెట్లపైనే పిడుగులు ఎందుకు పడతాయి?
పిడుగు అనేది విద్యుత్ ప్రవాహం... ఇది ఆకాశం నుండి భూమివైపు దూసుకువచ్చే సమయంలో ఎత్తయిన చెట్లు ఆకర్షిస్తాయి. అంటే చెట్లు విద్యుత్ వాహకాలుగా పనిచేస్తాయి. అందుకే చెట్లపై పిడుగులు ఎక్కువగా పడతాయి. మరీముఖ్యంగా ఒంటరిగా ఉండే చెట్లు, బాగా ఎత్తుగా ఉండే తాటి, కొబ్బరి చెట్లు సహజ విద్యుత్ వాహకాలుగా పనిచేస్తాయి... అందుకే ఇలాంటి చెట్లు పిడుగులను ఎక్కువగా ఆకర్షిస్తాయి.
కొన్నిరకాల చెట్లలో ప్రత్యేకంగా విద్యుత్ వాహక సామర్థ్యం ఎక్కువగా ఉండే ద్రవాలు ఉంటాయి. ఇలాంటి ట్రంక్లో ద్రవం తాటిచెట్లలో ఉంటుంది... అందుకే ఈ చెట్లపై ఎక్కువగా పిడుగులు పడుతుంటాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ తాటి చెట్లు పిడుగులను తట్టుకునే సామర్థ్యాన్ని కలిగివుంటాయి... అందుకే కొన్నిసార్లు పిడుగులుపడినా తాటిచెట్లు బ్రతుకుతాయి.
చెట్లు కాకుండా ఇంకా ఎలాంటి ప్రాంతాల్లో పిడుగులు పడుతుంటాయి?
కేవలం చెట్లపైనే కాదు ఎత్తైన కొండలు, పర్వతప్రాంతాలు, విశాఖమైన మైదానాల్లో పిడుగులు ఎక్కవగా పడుతుంటాయి. అలాగే విద్యుత్ ప్రవాహం ఉండే పరికరాలు అంటే ట్రాన్స్ ఫార్మర్లు, పెద్దపెద్ద విద్యుత్ స్తంభాలపైనా పిడుగులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
అత్యధికంగా చెట్లు, కొండప్రాంతాలు గ్రామాల్లోనే ఉంటాయి... కాబట్టి పట్టణాలకంటే పల్లెటూళ్ళలోనే పిడుగులు ఎక్కువగా పడుతుంటాయి. భారతదేశంలో దాదాపు 96 శాతం పిడుగులు పల్లె ప్రాంతాల్లోనే పడుతున్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ పిడుగుల వల్ల రైతులు, వ్యవసాయ కూలీలు, మూగజీవాలు ఎక్కువగా చనిపోతుంటాయి.
పిడుగుల బారిన పడకుండా పాటించాల్సిన జాగ్రత్తలు
వర్షాకాలంలో భారీ వర్షాలు, వరదలే కాదు పిడుగులు, ఈదురుగాలులు ప్రమాదాలకు కారణం అవుతాయి. అందుకే సాధారణ వర్ష సమయంలో కంటే ఈ ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాల సమయంలో ప్రజలు మరింత ఎక్కువ జాగ్రత్తలు పాటించాలి.
1. చెట్లు ఎక్కువగా పిడుగులను ఆకర్షిస్తాయి. కాబట్టి వర్ష సమయంలో చెట్లకింద ఉండరాదు.
2. వ్యవసాయ పనులు చేసే రైతులు, కూలీలు ఎక్కువగా చెట్లమధ్యన ఉంటారు. కాబట్టి వారికి పిడుగులు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వర్ష సమయంలో చెట్లకింద కాకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి.
3. ఆరుబయట పనులు చేసుకునేవారికి కూడా పిడుగులబారిన ఎక్కువగా పడుతుంటారు. వీళ్లు వర్ష సమయంలో జాగ్రత్తలు పాటించాలి.
4. వర్ష సమయంలో ఇళ్లు, ఆఫీసుల్లో ఉన్నవారు అక్కడే ఉండాలి... అత్యవసరం అయితేనే వర్షంలో బయటకు రావాలి.
5. విద్యుత్ సబ్ స్టేషన్లు, ట్రాన్స్ ఫార్మర్లు, కరెంట్ స్తంభాలు, వైర్లు వంటివాటిపై కూడా పిడుగులు పడే అవకాశాలు ఎక్కువ. కాబట్టి వర్ష సమయంలో వీటికి దూరంగా ఉండాలి.
6. పశువులు, ఇతర మూగజీవులను కూడా వర్షం కురిసే సమయంలో చెట్లకింద ఉంచరాదు.
7. తాత్కాలిక నివాసాల్లో అంటే పూరిగుడిసెలు, రేకుల షెడ్డుల్లో నివాసముండేవారు కూడా వర్ష సమయంలో జాగ్రత్త. వీటిపై పిడుగులు పడితే ఎక్కువ ప్రమాదం జరుగుతుంది.
8. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సమయంలో సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రిక్ వస్తువులు ఉపయోగించరాదు. పిడుగుపాటు సమయంలో వీటిలో విద్యుత్ ప్రవాహం ఎక్కువై ప్రమాదాలు జరగవచ్చు.