- Home
- Andhra Pradesh
- Weather Update: ఈశాన్య గాలుల ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణలలో దంచికొట్టనున్న వానలు.. ఈ ప్రాంతాలకు అలర్ట్
Weather Update: ఈశాన్య గాలుల ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణలలో దంచికొట్టనున్న వానలు.. ఈ ప్రాంతాలకు అలర్ట్
Weather Update: ఈశాన్య గాలుల ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో రెండు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయనిన భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలో కూడా పలు ప్రాంతాలలో వానలు పడతాయని ఐఎండీ తెలిపింది.

ఈశాన్య గాలుల ప్రభావంతో మళ్లీ వర్షాలు
ప్రస్తుత వాతావరణ పరిస్థితులతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పలకరించనున్నాయి. ఈశాన్య గాలుల ప్రభావం బలంగా వీస్తున్న కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న రెండు రోజుల పాటు వాతావరణం ఒక్కసారిగా మారిపోనుంది. అమరావతిలోని విపత్తుల నిర్వహణ సంస్థ, వాతావరణ శాఖ అందించిన వివరాల ప్రకారం, కోస్తాంధ్ర, రాయలసీమ అలాగే తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే వాతావరణ మార్పుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఏపీలోని కోస్తా, రాయలసీమల్లో వానల జోరు
ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఆది, సోమవారాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. అమరావతి, విశాఖపట్నం వాతావరణ కేంద్రాల అంచనా ప్రకారం రానున్న 24 నుంచి 48 గంటల్లో పలు ప్రాంతాల్లో వాతావరణం మేఘావృతం అయి చిరుజల్లులు లేదా మోస్తరు వర్షాలు పడనున్నాయి. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.
తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో కూడా వాతావరణం మారిపోయింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, యాదాద్రి భువనగిరి జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు సంభవించే అవకాశం ఉందని బులెటిన్ పేర్కొంది.
ప్రజలు, రైతన్నలకు హెచ్చరికలు
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలి. రోడ్లపై నీరు నిలిచే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ రద్దీ ఏర్పడవచ్చు. ఎక్కడికైనా బయటికి వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు.
అలాగే బలహీనమైన నిర్మాణాలు, హోర్డింగ్లు, చెట్ల కింద ఎవరూ తలదాచుకోవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. వ్యవసాయదారులు ఈ వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తమ వ్యవసాయ పనులను తగిన జాగ్రత్తలతో కొనసాగించాలి. ఒంటరిగా ఉన్న చెట్ల కింద ఆశ్రయం పొందవద్దు, ఎందుకంటే అవి పిడుగుపాటుకు గురయ్యే ప్రమాదం ఉంది.













