- Home
- Andhra Pradesh
- Recalling Chandrababu's Manifesto : చంద్రబాబు పేరు, క్యూఆర్ కోడ్... వైఎస్ జగన్ సరికొత్త కార్యక్రమం
Recalling Chandrababu's Manifesto : చంద్రబాబు పేరు, క్యూఆర్ కోడ్... వైఎస్ జగన్ సరికొత్త కార్యక్రమం
చంద్రబాబు పేరు, క్యూఆర్ కోడ్ తో సరికొత్త కార్యక్రమాన్ని ప్రకటించారు వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇంతకూ ఆ కార్యక్రమం ఎందుకోసమో తెలుసా?

కూటమి ప్రభుత్వంపై యుద్దానికి జగన్ పిలుపు
YS Jaganmohan Reddy : ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పీడ్ పెంచారు. కూటమి ప్రభుత్వంపై పోరాటానికి సిద్దం కావాలని... ఇక ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లాలని సూచించారు. ఈ ప్రభుత్వం ఎలా మోసం చేస్తుందో ప్రజలవద్దకు వెళ్లి వివరించాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేక కార్యక్రమానికి పిలుపునిచ్చారు వైసిపి అధినేత జగన్.
కూటమి (టిడిపి, జనసేన, బిజెపి) ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచింది... వారి హనీమూన్ కాలం ముగిసిందని వైఎస్ జగన్ అన్నారు. ఇక మనం ప్రజలతో మమేకం కావాలి... అలాగే ప్రభుత్వంతో యుద్దం చేయాలని పార్టీ నాయకులకు సూచించారు. కాబట్టి అందరినీ కలుపుకుపోతూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
ముఖ్యంగా ఎమ్మెల్యే అభ్యర్థులు పార్టీ శ్రేణులను ముందుండి నడిపించాలని.. ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు తెలుసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడాలని... అయితేనే నాయకుడిగా మంచి గుర్తింపు వస్తుందని జగన్ సూచించారు.
వైసిపి శ్రేణులతో వైఎస్ జగన్ కీలక సమావేశం
ఇవాళ(జూన్ 25, బుధవారం) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో విస్తృతస్థాయి సమావేశం జరిగింది. వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు హాజరయ్యారు.
'చంద్రబాబు మ్యానిఫెస్టోను గుర్తుకు తెస్తూ'... వైసిపి సరికొత్త నిరసన కార్యక్రమం
అధికార కూటమి ప్రభుత్వం పోరాటానికి వైసిపి సరికొత్త నిరసన కార్యక్రమాలను రూపొందించింది. ఇందులో ఒకటి ఈ 'రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో' లేదా 'చంద్రబాబు మ్యానిఫెస్టోను గుర్తుకు తెస్తూ''. ఈ కార్యక్రమం ద్వారా 5 వారాల నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు వైఎస్ జగన్. క్యూఆర్ కోడ్ సాయంతో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు... ఇందుకు సంబంధించిన క్యూఆర్ కోడ్ ను జగన్ ఆవిష్కరించారు. దీనిగురించి పార్టీ నాయకులకు వైఎస్ జగన్ వివరించారు.
ఈ ఏడాది కూటమి పాలనలో రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి నష్టం జరిగింది... అది ఎంతో లెక్కలతో సహా తెలియజేయడమే ఈ రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో కార్యక్రమ లక్ష్యం, ముఖ్య ఉద్దేశమని జగన్ అన్నారు. ఎన్నికల్లో హామీఇచ్చి ఈ ఏడాది కూడా అమలుచేయని పథకాలేవి.... దీనివల్ల ఇంకా ఎంత నష్టం జరుగుతుందో కూడా వివరించనున్నట్లు తెలిపారు. మరోవైపు వైసిపి ప్రభుత్వమే ఇప్పుడు అధికారంలో ఉంటే ఎన్ని ప్రయోజనాలు ఉండేవో కూడా ప్రజలకు వివరించాలని జగన్ పార్టీ శ్రేణులకు సూచించారు.
చంద్రబాబు మోసాలపై ప్రజలను చైతన్యం చేయాలని సూచించారు. ఇంకా కొన్ని హామీలకు రిబ్బన్ కూడా కట్ చేయకుండా అన్నీ అమలు చేశామని చెబుతున్నాడని… ఎవరైనా ప్రశ్నిస్తే నాలుక మందం అంటున్నాడని చంద్రబాబుపై జగన్ మండిపడ్డారు. ఎన్నికల సమయంలో మ్యానిఫెస్టోలో ఏం చెప్పాడు? ఇప్పుడు ఎలా మోసం చేస్తున్నాడు? అన్నింటినీ గ్రామగ్రామానికి తీసుకుపోయేదే ఈ చంద్రబాబు మ్యానిఫెస్టో గుర్తుకు తెస్తూ అనే కార్యక్రమని జగన్ పేర్కొన్నారు.
5 వారాలపాటు రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో కార్యక్రమం
ఎన్నికల సమయంలో నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను ప్రజలకు గుర్తుచేస్తూ 5 వారాలపాటు 'రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వైఎస్ జగన్ ప్రకటించారు. ముందుగా పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారు... ఆ తర్వాత రెండు బటన్లు నొక్కితే చంద్రబాబు మ్యానిఫెస్టో, బాండ్లు వస్తాయి... మరో బటన్ నొక్కితే ఒక్కో కుటుంబం ఈ ఏడాది ఎంతెంత నష్టపోయిందో వస్తుందన్నారు.
రెండో దశలో నియోజకవర్గ స్థాయిలో, మూడో దశలో మండల స్థాయిలో క్యూఆర్ కోడ్ ఆవిష్కరణ ఉంటుందన్నారు. ఆ స్థాయి నాయకుల ప్రెస్‌కాన్ఫరెన్స్ లు నిర్వహించి ప్రజలకు చంద్రబాబు మోసాలను వివరిస్తారని అన్నారు.
ఇక నాలుగో దశలో గ్రామస్థాయిలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలని... అందరికీ అర్థమయ్యేలా ఈ ప్రభుత్వం వల్ల ఎంత నష్టపోతున్నది వివరించాలన్నారు. ఇందులో గ్రామ కమిటీలను ఇన్‌వాల్వ్ చేయాలని జగన్ సూచించారు.
క్యూఆర్ కోడ్ తో సరికొత్త నిరసన కార్యక్రమం
ఈ ప్రక్రియ కొనసాగే సమయంలోనే ఎక్కడైనా మండల, గ్రామ కమిటీల ఏర్పాటు పూర్తి కాకపోతే దాన్నీ పూర్తి చేయాలని సూచించారు. ఇలా 5 వారాల ఈ కార్యక్రమం జరిగే నాటికి గ్రామస్థాయిలో కూడా అన్ని కమిటీల ఏర్పాటు పూర్తి కావాలని సూచించారు.
క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే ప్రజాగళం. సూపర్‌సిక్స్, సూపర్ సెవెన్ హామీలు వస్తాయి... అంతే కాకుండా చంద్రబాబు చేసిన దగా, పచ్చి మోసం వివరాలు కూడా వస్తాయన్నారు. గత ఏడాది ఇవ్వకుండా ఎగ్గొట్టింది ఎంత? ఇక ఈ ఏడాది రావాల్సిన మొత్తం ఎంత? అనేది కూడా తెలుస్తుందన్నారు. ఈ వివరాలను ప్రజలను రెడీగా పెట్టుకోవాలని సూచించాలని... వారి ఇంటికి టీడీపీ నాయకులు రాగానే నిలదీసేలా రెడీ చేయాలని పార్టీ శ్రేణులకు జగన్ సూచించారు.