ఇప్పటికే కేసుల మీద కేసులు నమోదవుతున్న వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. తాజాగా ఆయన కార్యాలయానికి వెళ్లిమరీ కారును సీజ్ చేశారు పోలీసులు. 

YS Jagan : ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుల్లెట్ ప్రూఫ్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పల్నాడు జిల్లాలో ఈ కారు కిందపడే సింగయ్య అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఇప్పటికే ఈ కారు డ్రైవర్ తో పాటు వైఎస్ జగన్, మరికొందరు వైసిపి నాయకులపై కేసు నమోదయ్యింది.

తాజాగా నల్లపాడు పోలీసులు సింగయ్య మృతి కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు... స్పీడు పెంచి వైసిపి నాయకులకు నోటీసులు జారీ చేశారు. ఈ నోటిసులు అందించేందుకు తాడేపల్లి జగన్ కార్యాలయానికి వెళ్లారు... వైసిపి నేత లేళ్ల అప్పిరెడ్డి ఈ నోటీసులు తీసుకున్నారు. అలాగే ప్రమాదానికి కారణమైనట్లుగా భావిస్తున్న జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారును సీజ్ చేశారు.

అసలేం జరిగింది?

పల్నాడు జిల్లా రెంటపాళ్ళకు చెందిన నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి ఏడాది క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు వైసిపి కార్యకర్త... దీంతో ఆ గ్రామానికి చెందిన వైసిపి శ్రేణులు అతడి విగ్రహాన్ని ఏర్పాటుచేసారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వైఎస్ జగన్ హాజరయ్యారు... ఇలా భారీ ర్యాలీగా వెళుతున్న సమయంలోనే జగన్ కారు సింగయ్య అనే వ్యక్తిని డీకొట్టింది.

ముందుగా జగన్ కాన్వాయ్ లోని ఏదో వాహనం సింగయ్యను డీకొట్టినట్లు భావించారు. కానీ పోలీసుల దర్యాప్తులో స్వయంగా జగన్ వాహనమే ఆయనను డీకొట్టినట్లు తేలింది. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. దీంతో పోలీసులు జగన్ కారు డ్రైవర్ రమణారెడ్డిని A1 గా, జగన్ ను A2 గా చేర్చి కేసులు నమోదు చేశారు. ఈ పర్యటనలో పాల్గొన్న జగన్ పర్సనల్ సెక్రటరీ నాగేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజిని, మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డిపైనా కేసులు నమోదయ్యాయి.

గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ కూడా జగన్ ప్రయాణిస్తున్న వాహనమే సింగయ్యను ఢీకొట్టిందని స్పష్టంగా కనిపించిందన్నారు. అందువల్ల జగన్, డ్రైవర్ రమణా రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి, సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజినిలపై కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు.