- Home
- Andhra Pradesh
- Telugu States Weather Updates : తెలుగు రైతుల ఎదురుచూపులకు ఈ మూడ్రోజుల్లో తెరపడేనా?
Telugu States Weather Updates : తెలుగు రైతుల ఎదురుచూపులకు ఈ మూడ్రోజుల్లో తెరపడేనా?
తెలుగు రాష్ట్రాల్లో ఈ మూడ్రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఏఏ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయంట తెలుసా?

వర్షాల కోసం తెలుగు రైతుల ఎదురుచూపులు
Telangana and Andhra Pradesh Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. వర్షాకాలం మొదలై ఇప్పటికే చాలారోజులైంది... కానీ ఇప్పటివరకు చాలాప్రాంతాల్లో అనుకున్న స్థాయిలో వర్షాలు కురవలేవు. దీంతో వర్షాలపైనే ఆధారపడి వ్యవసాయ పనులు ప్రారంభించిన రైతులు ఆందోళన చెందుతున్నారు. కొద్దిరోజులుగా ఆకాశం మేఘాలతో కప్పివుండి వాతావరణం చల్లబడుతుందే తప్ప వానల జాడలేదు. ఈ నెలలో (జూన్) సాధారణంగా భారీ వర్షాలుంటాయి... కానీ ఇప్పటివరకు అలాంటి పరిస్థితి లేదు.
ఇక వర్షాలే వర్షాలు...
అయితే నైరుతి రుతుపవనాలు యాక్టివ్ గా మారడంతో పాటు వాతావరణ పరిస్థితులు ప్రస్తుతం వర్షాలకు అనుకూలంగా మారినట్లు ఐఎండి ప్రకటించింది. దీంతో ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణలో వర్షాలు జోరందుకోనున్నాయని తెలిపారు. ముఖ్యంగా ఏపీలో నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయని... కొన్నిప్రాంతాల్లో భారీ వానలు పడే అవకాశాలున్నట్లు వాతావరణ విభాగం ప్రకటించింది.
నేడు (జూన్ 16) ఏపీలో వాతావరణం ఎలా ఉంటుందంటే...
ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని... అలాగే ఉపరితల ద్రోణులు కూడా ఏర్పడ్డాయని.. వీటి ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. ఇవాళ (జూన్ 16, సోమవారం) ఏపీలో ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తీరప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తాయని... ఆ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఏపీలో ఈ జిల్లాలకు వర్షసూచన
సోమవారం శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, అనంతపురం, నంద్యాల, శ్రీసత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మిగతా జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉండి వాతావరణం చల్లగా ఉంటుందని.. అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
నేడు (జూన్ 16) తెలంగాణ వాతావరణ సమాచారం
ఇక తెలంగాణలో కూడా ఈ మూడ్రోజులు (జూన్ 16,17,18) మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడ మాత్రమే భారీ వర్షాలు కురవొచ్చని...మిగతా ప్రాంతాల్లో చిరుజల్లులే ఉంటాయని తెలిపారు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
నేడు ఈ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు..
ఇవాళ(సోమవారం) వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి, గద్వాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కొన్నిచోట్ల 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని... ఉరుములు, మెరుపులు కూడా వర్షాలకు తోడవుతాయని తెలిపారు.
రేపు (జూన్ 17)న ఈ జిల్లాల్లో వర్షాలు
మంగళవారం అంటే జూన్ 17న భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. జూన్ 18న ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇలా వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసారు.