- Home
- Andhra Pradesh
- Rain Alert : వాయుగుండంతో అతిభారీ వర్ష గండం ... ఆ ప్రాంతాల్లో దసరా సెలవులు పొడిగింపు
Rain Alert : వాయుగుండంతో అతిభారీ వర్ష గండం ... ఆ ప్రాంతాల్లో దసరా సెలవులు పొడిగింపు
Rain Alert : వాయుగుండం తీరం దాటడంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో దసరా సెలవులు ముగియడంతో ఇవాళ (శుక్రవారం) ప్రారంభంకావాల్సిన స్కూళ్లకి సెలవులు పొడిగించారు. ఇలా ఏఏ ప్రాంతాల్లో సెలవులున్నాయో తెలుసా?

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే వర్షాలు
Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి... ఇలా సముద్రంలో ఉండగానే అల్లకల్లోలం సృష్టించిన వాయుగుండం ఇప్పుడు తీరందాటి భూమిపైకి చేరింది. దీంతో అటు ఆంధ్ర ప్రదేశ్, ఇటు తెలంగాణలో కుంభవృష్టి తప్పదని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ క్రమంలోనే కొన్ని విద్యాసంస్థలకు దసరా సెలవులు పొడిగించారు.
తీరందాటిన వాయుగుండం
నిన్న (అక్టోబర్ 2, గురువారం) సాయంత్రం 5 గంటలకు బంగాళాఖాతం ఏర్పడిన తీవ్రవాయుగుండం ఒడిషాలోని గోపాల్‌పూర్ సమీపంలో తీరం దాటిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లోని కొన్ని జిల్లాల్లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలపై ఈ వాయుగుండం ప్రభావం ఎక్కువగా ఉంటుందని ప్రకటించింది.
నేడు ఏపీలో వర్షాలు కురిసే జిల్లాలివే
ఇవాళ (శుక్రవారం, అక్టోబర్ 3న) శ్రీకాకుళం,విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్ధ తెలిపింది.
వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రకు భారీ వర్షాలు, ఈదురుగాలుల ప్రమాదం పొంచివున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా ఎలాంటి ప్రమాదాలు జరక్కుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
ప్రమాదంలో ఉంటే ఈ టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేయండి
ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ కూడా రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తీరంవెంబడి 40-60 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంటుంది... కాబట్టి ప్రజలు చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు,హోర్డింగ్స్ వద్ద ఉండరాదని తెలిపింది. అత్యవసర సహాయం కోసం APSDMA లోని టోల్ ఫ్రీ నెంబర్లు112,1070, 18004250101 సంప్రదించాలని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.
దసరా సెలవులు పొడిగింపు
భారీ వర్షాల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని మండలాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. నరసన్నపేట, జలుమూరు, అముదాలవలస, పొలాకి, కొత్తూరు, శ్రీకాకుళం, హిరమండలం, గార, సరుబుజ్జిలి, ఎల్ఎన్ పేట మండలాల్లో స్కూళ్లకు శుక్రవారం సెలవు ప్రకటిస్తున్నట్లు డిఈవో రవికుమార్ తెలిపారు. ఇక పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా స్కూళ్ళకు సెలవులు ప్రకటించారు. అంటే ఈ ప్రాంతాల్లో స్కూళ్లకు దసరా సెలవులు మరోరోజు పొడిగించారన్నమాట.
తెలుగు ప్రజలారా... ఈ జాగ్రత్తలు పాటించండి
ఉత్తరాంధ్ర తీరం వెంబడి 55-75 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదముంది కాబట్టి ఆ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ కింది జాగ్రత్తలు పాటించాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్ధ సూచించింది.
1. ప్రజలు అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయవద్దు.
2. బయటకు వెళ్లకుండా ఇంట్లోనే సురక్షితంగా ఉండండి
3. ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోండి
4. ఎలాంటి విపత్కర పరిస్ధితులు ఎదురుకాకుండా అలర్ట్ గా ఉండండి
నేడు తెలంగాణలో వర్షాలు
తెలంగాణలో కూడా ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి... ఇవాళ కూడా ఆ వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, జనగామ, వరంగల్, హన్మకొండ, ములుగు, భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయట... ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.