- Home
- Telangana
- Rain Alert: దసరా రోజు బయట అడుగు పెట్టడం కష్టమేనా? వచ్చే రెండు రోజులు అత్యంత భారీ వర్షం
Rain Alert: దసరా రోజు బయట అడుగు పెట్టడం కష్టమేనా? వచ్చే రెండు రోజులు అత్యంత భారీ వర్షం
Rain Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిక జారీ చేశారు. అల్పపీడనం మరింత బలపడే అవకాశాలున్నాయన్న అధికారులు గురు, శుక్రవారాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
వాతావరణ శాఖ ప్రకారం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం రేపటి వరకు బలంగా ఉండే అవకాశం ఉంది. ఇది వేగంగా పశ్చిమ వాయవ్య దిశలో కదులుతూ, రేపు ఉదయానికి వాయుగుండంగా మారవచ్చని అధికారులు తెలిపారు.
తీరాన్ని తాకే అవకాశాలు
ఈ అల్పపీడనం పశ్చిమ కోస్తా నుంచి దక్షిణ ఒడిశా మధ్య తీరానికి చేరే అవకాశం ఉంది. అక్టోబర్ 3న తీరాన్ని దాటవచ్చని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో తీరప్రాంతంలో గాలులు బలంగా వీస్తాయి, సముద్రంలో అలల తీవ్రత పెరుగుతుంది.
ఎల్లో అలర్ట్ జారీ
తెలుగు రాష్ట్రాలలో కోస్తాంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు వాతావరణ శాఖ బుధవారం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షాలు, గాలులు కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు సైతం ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది.
భారీ వర్షాల సూచనలు
గురు, శుక్రవారాల్లో తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. వర్షాలు కొనసాగినప్పుడు లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. గతంలో వరదలు సంభవించిన ప్రాంతాల్లోని జనాలు ముందుగానే ఇతర ప్రదేశాలకు వెళ్లాలని తెలిపారు.
బలమైన ఈదురు గాలులు
తీర ప్రాంతంలో రాగల మూడు రోజుల పాటు గంటకు 30 కిలోమీటర్లకు పైగా వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించారు. సముద్రంలో మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని, మత్స్యకారులు భద్రతా చర్యలు పాటించాలని సూచించారు. ఈ గాలుల కారణంగా సముద్రంలో అలలు అల్లకల్లోలంగా ఉంటాయి.