- Home
- Andhra Pradesh
- Rain Alert : బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఈ ప్రాంతాల్లో అల్లకల్లోలమే, ప్రజలు బిఅలర్ట్
Rain Alert : బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఈ ప్రాంతాల్లో అల్లకల్లోలమే, ప్రజలు బిఅలర్ట్
Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో వాయుగుండం గండం పొంచివుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇవాళ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

తెలుగు రాష్ట్రాల్లో కుండపోతేనా?
Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం పొడి వాతావరణం ఉంది. గత వారమంతా కుండపోత వర్షాలు కురిశాయి... రెండుమూడు రోజులుగా వరుణుడు శాంతించాడు. అయితే ఇప్పటికీ నదులు, వాగులు వంకలు వరదనీటితో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి... జలాశయాలు, చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. ఇలా వరద పరిస్ధితులు నెలకొన్న సమయంలో వాతావరణ శాఖ ఆందోళనకర ప్రకటన చేసింది. వాతావరణ పరిస్ధితులు అనుకూలించడంతో మళ్లీ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరందుకోన్నాయని హెచ్చరించింది.
బంగాళాఖాతంలో మరో వాయుగుండం
ప్రస్తుతం ఆవర్తనం ప్రభావంతో పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఆంధ్ర ప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది మరింత బలపడుతూ ముందుకు సాగుతూ రేపటికి (అక్టోబర్ 2, గురువారం) పశ్చిమమధ్య, వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా రూపాంతరం చెందుతుందని హెచ్చరించింది. ఇది ఎల్లుండి (అక్టోబర్ 3, శుక్రవారం) దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర మధ్య తీరందాటే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
ఈ వారంకూడా భారీ వర్షాలు
ఈ వాయుగుండం ప్రభావంతో ఈ వారం భారీ వర్షాలు కురుస్తాయని APSDMA హెచ్చరించింది. ఈ వర్షాలతో మళ్లీ వరదలు సంభవించే అవకాశాలు ఉంటాయి... కాబట్టి నదీపరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రదేశాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇప్పటికే నదులు ప్రవాహం ప్రమాదకరంగా మారడంతో ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ టీంలు ఎలాంటి విపత్తులైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నాయి. ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు కూడా ఎప్పటికప్పుడు నీటిప్రవాహం ఆధారంగా ప్రజలను అలర్ట్ చేస్తున్నారు.
నేడు ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు
ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం అంతకంతకు బలపడుతోంది... దీని ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాలల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ వర్షాలకు 45-65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా తోడయి ప్రమాదాలు జరిగే అవకాశాలుంటాయి... కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.
బంగాళాఖాతంలో అల్లకల్లోలం
బంగాళాఖాతంలో ప్రస్తుతం పరిస్ధితులు అల్లకల్లోలంగా ఉన్నాయి... కాబట్టి మత్స్యకారులు చేపలవేటకు వెళ్లరాదని సూచించింది APSDMA. ఈ రెండుమూడు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని... శనివారం వరకు తీరప్రాంతాల ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్ధ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
నేడు తెలంగాణ వర్షాలు
ఇవాళ (అక్టోబర్ 1, బుధవారం) తెలంగాణలో సాధారణం నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వర్షాలకు ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు తోడై ప్రమాదకరంగా మారతాయని హెచ్చరించింది. ఇక 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని తెలిపింది. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు, పిడుగులు, ఈదురుగాలుల ప్రమాదం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.