- Home
- Andhra Pradesh
- Andhra Pradesh : ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, జాతికి అంకితం చేసిన ప్రాజెక్టులివే.. ఈ ప్రాంతాలకు మహర్ధశ
Andhra Pradesh : ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, జాతికి అంకితం చేసిన ప్రాజెక్టులివే.. ఈ ప్రాంతాలకు మహర్ధశ
Andhra Pradesh : సూపర్ జిఎస్టి - సూపర్ సేవింగ్ పేరిట కర్నూల్ లో చేపట్టిన భారీ బహిరంగ సభ వేదికపైనుండి ఏపీ రూపురేఖలు మార్చే ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు ప్రధాని మోదీ.

ఏపీలో భారీ పెట్టుబడులతో అభివృద్ధి పనులు
Andhra Pradesh : ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆంధ్ర ప్రదేశ్ పేరు మారుమోగుతోంది. ఇటీవలే గ్లోబల్ టెక్ దిగ్గజం ఏపీలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది... ఈమేరకు కూటమి ప్రభుత్వంతో ఒప్పందం కూడా చేసుకుంది. మొత్తం 15 బిలియన్ డాలర్లు అంటే 1,33,000 కోట్లతో విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు గూగుల్ ప్రకటించింది. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఏపీలో భారీ పెట్టుబడులతో కూడిన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
మారుతున్న ఏపీ రూపురేఖలు
'సూపర్ జీఎస్టి - సూపర్ సేవింగ్స్' పేరిట కర్నూల్ లో కూటమి ప్రభుత్వం భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ సహా పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ప్రజలు కూడా భారీసంఖ్యలో హాజరయ్యారు. ఈ సభావేదికపైనుండి ప్రధాని ఏకంగా రూ. 13429 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
ప్రధాని ప్రారంభించిన అభివృద్ధి పనులు
ప్రధాని నరేంద్ర మోదీ కర్నూల్ సభనుండే వర్చువల్ గా రూ. 9449 కోట్ల విలువైన 5 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
1. రూ. 2886 కోట్లతో చేపట్టిన విద్యుత్ ట్రాన్స్ మిషన్ (విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుండి సబ్ స్టేషన్లు అక్కడినుండి వినియోగదారులను విద్యుత్ సరఫరా చేసే) వ్యవస్థ పనులకు ప్రధాని మోదీ ప్రారంభించారు.
2. రూ. 4922 కోట్లు చేపట్టిన ఓర్వకల్లు-కొప్పర్తి పారిశ్రామిక కారిడార్ పనులను ప్రారంభించారు. ఇది కర్నూల్ జిల్లా ఓర్వకల్లు, కడప జిల్లా కొప్పర్తి మధ్య పారిశ్రామిక అభివృద్ధి కోసం చేపడుతున్న ప్రాజెక్ట్. దీన్ని ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చేపడుతోంది.
3. ఇక పలు జాతీయ రహదారుల్లో చేపట్టిన అభివృద్ధి పనులను కూడా ప్రధాని ప్రారంభించారు. ఇలా కొత్త వలస - విజయనగరం మధ్య రూ. 493 కోట్లతో చేపట్టిన 4వ లైన్ ను కు శంకుస్థాపన చేశారు.
4. పెందుర్తి - సింహాచలం నార్త్ మధ్య రూ. 184 కోట్లతో చేపట్టిన రైల్ ఫ్లైఓవర్ లైన్ పనులను కూడా ప్రధాని ప్రారంభించారు.
5. సబ్బవరం-షీలానగర్ మధ్య రూ.964 కోట్లతో చేపట్టిన జాతీయ రహదారి పనులను ప్రధాని మోదీ ప్రారంభించారు.
ప్రధాని మోదీ చేపట్టిన ప్రారంభోత్సవాలు
ప్రధాని నరేంద్ర మోదీ రూ. 1704 కోట్ల విలువైన 8 అభివృద్ధి పనులను ప్రారంభించారు.
1. రూ. 82 కోట్లతో చేపట్టిన రేణిగుంట - కడప - మదనపల్లె రోడ్డును ప్రారంభించారు.
2. రూ. 286 కోట్లతో నిర్మించిన కడప – నెల్లూరు - చునియంపల్లి రోడ్డును ప్రారంభించారు.
3. రూ.70 కోట్లతో నిర్మించిన కనిగిరి బైపాస్ రోడ్ ను కూడా ప్రధాని వర్చువల్ గా ప్రారంభించారు.
4. రూ.98 కోట్లతో చేపట్టిన గుడివాడ-నూజెండ్ల 4లేన్ల రోడ్డు ఓవర్ బ్రిడ్జిని ప్రారంభించారు.
5. రూ.13 కోట్లతో చేపట్టిన కల్యాణదుర్గం - రాయదుర్గం - మొలకలమూరు రోడ్డును ప్రారంభించారు.
6. రూ. 593 కోట్లతో నిర్మించిన పీలేరు - కలసూర్ నాలుగు లేన్ల రోడ్డు ప్రారంభం
7. రూ.362 కోట్లతో చేపట్టిన నిమ్మకూరులోని BELలో అడ్వాన్స్‌డ్ నైట్ విజన్ గ్లాసుల ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించారు.
8. రూ. 200 కోట్లతో ఏర్పాటుచేసిన చిత్తూరులోని ఇండేన్ బాట్లింగ్ ప్లాంట్ ను ప్రారంభించారు.
జాతికి అంకితం చేసిన ప్రాజెక్టులు
ప్రధాని నరేంద్ర మోదీ రూ. 2276 కోట్ల విలువైన 2 ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు.
1. కొత్తవలస –కొరాపుట్ రైల్వే డబ్లింగ్ పనులు రూ. 546 కోట్లతో పూర్తిచేశారు.
2. శ్రీకాకుళం- అంగుల్ నాచురల్ గ్యాస్ పైప్‌లైన్ పనులు రూ. 1730 కోట్లతో పూర్తిచేశారు.