Andhra Pradesh : విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటు గురించి ప్రధాని మోదీకి ఫోన్ చేసినట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించారు. ఏం మాట్లాడారో బైటపెట్టారు. 

Andhra Pradesh : గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ ఆంధ్ర ప్రదేశ్ లో భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చింది. బీచ్ సిటీ విశాఖపట్నంలో అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇలా దాదాపు 15 బిలియన్ డాలర్ల (1,33,000 కోట్లు) పెట్టుబడులతో డేటా సెంటర్ ఏర్పాటుచేయనున్నట్లు గూగుల్ ప్రకటించింది. సీఎం చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్ లు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్ సమక్షంలో గూగుల్ క్లౌడ్ సిఈవో థామస్ కురియన్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు.

వైజాగ్ గూగుల్ డేటా సెంటర్ పై సుందర్ పిచాయ్ కామెంట్స్

ఈ చారిత్రాత్మక ఒప్పందంపై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ స్పందించారు. భారతదేశంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుపై స్వయంగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి మాట్లాడినట్లు ఎక్స్ వేదికన ప్రకటించారు. ఆయనతో మాట్లాడటం గర్వంగా ఉందని... విశాఖపట్నంలో గ్లోబల్ స్థాయి ఏఐ హబ్ కి సంబంధించి తమ ప్లాన్ ను ఆయనతో పంచుకున్నానని తెలిపారు.

''వైజాగ్ లో ఏర్పాటుచేసే ఏఐ హబ్ 1 గిగావాట్ స్కేల్ కంప్యూట్ సామర్థ్యాన్ని కలిగివుంటుంది. ఇది అంతర్జాతీయ స్థాయిలో ఏఐ సేవలను అందించేందుకు గేట్ వే గా నిలుస్తుంది. భారీ స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పనకు ఈ డేటా సెంటర్ ఉపయోగపడుతుంది. ఇది ఇండియాలోని వివిధ సంస్థలు, ప్రజలకు మరింత అద్భుత టెక్నాలజీ సేవలను అందిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలను మరింత విస్తృతం చేసి దేశ అభివృద్ధికి తోడ్పడుతుంది'' అని గూగుల్ సీఈవో అన్నారు.

Scroll to load tweet…

సుందర్ పిచాయ్ పోస్ట్ పై పీఎం రియాక్ట్

గూగుల్ సీఈవో ఎక్స్ పోస్ట్ పై ప్రధాని మోదీ కూడా రియాక్ట్ అయ్యారు. డైనమిక్ సిటీ విశాఖపట్నంలో గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటుకావడం ఆనందాన్ని ఇస్తోందన్నారు. ఈ డేటా సెంటర్ ఏర్పాటుకోసం గూగుల్ పెట్టుబడి పెట్టడం వికసిత్ భారత్ నిర్మాణానికి మరింత ఊతం ఇస్తుందన్నారు. టెక్నాలజీని అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ఉపయోగపడుతుందని... ఏఐని మరింతమందికి చేరువచేస్తుందని ప్రధాని అన్నారు. డిజిటల్ ఎకానమీకి బూస్ట్ ఇవ్వడమే కాదు ఇండియాను గ్లోబల్ టెక్నాలజీ లీడర్ గా నిలిపేందుకు గూగుల్ విశాఖపట్నంలో ఏర్పాటుచేయనున్న డేటాసెంటర్ ఉపయోగపడుతుందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.