- Home
- Andhra Pradesh
- Andhra Pradesh: ఏపిలో ల్యాండ్ అయిన ప్రధాని.. మోదీ రాకతో ఈ ప్రాంత రూపురేఖలు మారడం ఖాయం
Andhra Pradesh: ఏపిలో ల్యాండ్ అయిన ప్రధాని.. మోదీ రాకతో ఈ ప్రాంత రూపురేఖలు మారడం ఖాయం
Andhra Pradesh: కర్నూలు పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఓర్వకల్లు చేరుకున్నారు. పర్యటనలో భాగంగా మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. దీంతో ఏపీలో జరిగే మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఏపీకి చేరుకున్న ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ తదితరులు స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి మోదీ హెలికాప్టర్‌లో సున్నిపెంటకు వెళ్లనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీశైలం చేరుకుని శ్రీభ్రమరాంబ, మల్లికార్జున స్వామి ఆలయాల్లో ప్రత్యేక దర్శనం చేసుకోనున్నారు. మధ్యాహ్నం 12.05 వరకు శ్రీశైల క్షేత్రంలో ఉంటారు. తర్వాత హెలికాప్టర్‌లో నన్నూరుకు బయలుదేరి, రాగమయూరి గ్రీన్ హిల్స్ వద్ద జరిగే ‘సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్స్’ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి కర్నూలు ప్రాంత అభివృద్ధికి ఊతమిచ్చే ఓర్వకల్లు పారిశ్రామిక వాడ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని, ప్రజలతో సమావేశమై, సాయంత్రం 4.45 గంటలకు ప్రత్యేక విమానంలో నరేంద్ర మోదీ తిరిగి న్యూఢిల్లీకి పయనమవుతారు.
పర్యటన ఇలా సాగుతుంది..
* 7.50 AM: ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానం
* 10.20 AM: కర్నూలు ఎయిర్‌పోర్ట్
* 10.25 AM: సున్నిపెంటకు హెలికాఫ్టర్
* 11.10 AM: శ్రీశైలం భ్రమరాంబ గెస్ట్ హౌస్
* 11.45 AM: భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం
* 12.45 PM: తిరిగి భ్రమరాంబ గెస్ట్ హౌస్‌కు
* 1.25 PM: సున్నిపెంటకు రోడ్డు మార్గంలో బయల్దేరి, 1.40 PMకి నన్నూరు హెలిప్యాడ్
* 2.30 PM: రాగమయూరి గ్రీన్ హిల్స్ వెంచర్, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
* 4.00 PM: బహిరంగ సభ
* 4.15 PM: నన్నూరు హెలిప్యాడ్‌కి పయణం
* 4.40 PM: కర్నూలు ఎయిర్‌పోర్ట్‌కి బయల్దేరి
* 7.15 PM: ఢిల్లీకి చేరి పర్యటన ముగింపు
మారనున్న కర్నూలు భవితవ్యం
రాయలసీమ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పలు కీలక ప్రాజెక్టులను ప్రారంభించింది. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లాలో రూ.13,430 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టులతో జరగనున్న మార్పులివే.
విద్యుత్ రంగానికి ఊపిరి
రూ.2,880 కోట్ల వ్యయంతో కర్నూలు–3 పూలింగ్ స్టేషన్‌ను అనుసంధానించే కొత్త విద్యుత్ ప్రసార వ్యవస్థ నిర్మాణానికి ప్రధాని మోదీ పునాది వేయనున్నారు. ఈ ప్రాజెక్టు రాయలసీమలో విద్యుత్ సరఫరా సామర్థ్యాన్ని పెంచి, పరిశ్రమలకు స్థిరమైన విద్యుత్ అందించడంలో కీలకంగా నిలుస్తుంది.
ఓర్వకల్లు, కొప్పర్తి కారిడార్లకు కొత్త ఊపు
ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక కారిడార్లలో రూ.4,920 కోట్లతో మౌలిక సదుపాయాల పనులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ రెండు పారిశ్రామిక మండలాలు సుమారు రూ.21 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించే అవకాశముందని కేంద్రం అంచనా వేస్తోంది. ఈ ప్రాజెక్టుల ద్వారా రాయలసీమలో సుమారు లక్షకు పైగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
రహదారి మౌలిక సదుపాయాలకు బలమైన పునాది
పరిశ్రమలతోపాటు రవాణా సదుపాయాల అభివృద్ధికీ ప్రాధాన్యం ఇస్తూ, ప్రధాని మోదీ రూ.960 కోట్లతో సబ్బవరం–షీలానగర్ రహదారి నిర్మాణానికి, అలాగే రూ.1,140 కోట్లతో పీలేరు–కాలురు రహదారి నాలుగు వరుసల విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మార్గాలు పూర్తయితే, ప్రాంతీయ కనెక్టివిటీ గణనీయంగా మెరుగుపడనుంది.
రైల్వే అభివృద్ధికి శ్రీకారం
గుడివాడ–నూజెండ్ల మధ్య రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి కూడా మోదీ శ్రీకారం చుట్టనున్నారు. ఈ ప్రాజెక్టు రైల్వే రవాణాలో సౌకర్యాన్ని పెంచి, రోడ్డు ట్రాఫిక్ ఒత్తిడి తగ్గనుంది. ఈ అన్ని ప్రాజెక్టులు పూర్తయితే, రాయలసీమలో పారిశ్రామిక, రవాణాతో పాటు విద్యుత్ రంగాలు కొత్త దశలోకి అడుగుపెడతాయి. కేంద్రం ప్రాధాన్యతతో ముందుకు వస్తున్న ఈ అభివృద్ధి పథకాలు ప్రాంతీయ సమతుల్య అభివృద్ధికి పునాది వేస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.