తీరంవైపు దూసుకొస్తున్న మొంథా తుపాను.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు
Montha Cyclone : మొంథా తుపాను తీరం దాటే ముందు కాకినాడ జిల్లాలో రక్షణ చర్యలను వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. 12 మండలాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సిద్ధంగా ఉండండి : పవన్ కళ్యాణ్
మొంథా తుపాను కాకినాడ ప్రాంతంలో తీరం దాటనున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం జిల్లా పరిధిలోని 12 మండలాల్లో తుపాను ప్రభావం ఉండే అవకాశం ఉంది. అందువల్ల అన్ని శాఖల అధికారులు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని సూచించారు.
ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకుండా ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. తీర ప్రాంత ప్రజలను వెంటనే సురక్షిత ప్రదేశాలకు తరలించి పునరావాస కేంద్రాల్లో ఉంచాలని అన్నారు.
పునరావాస చర్యలు వేగవంతం చేసిన సర్కారు
గర్భిణులు, బాలింతలు, వృద్ధులు, రోగులను ముందుగా గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ ప్రత్యేకంగా పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటికే 142 మంది గర్భిణులను గుర్తించి తరలించినట్టు జిల్లా కలెక్టర్ మోహన్ వివరించారు.
260 పునరావాస కేంద్రాలు సిద్ధం చేసినట్టు అధికారులు తెలిపారు. ఈ కేంద్రాల్లో ఆహారం, తాగునీరు, పాలు, అత్యవసర మందులు అందుబాటులో ఉండాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆంబులెన్సులు, అత్యవసర సేవలు సిద్ధంగా ఉండాలని, ఆసుపత్రుల్లో అదనపు బెడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు.
Montha Cyclone: సిద్ధంగా సహాయక బృందాలు
ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్దంగా ఉండాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. గ్రామాలలో మైకుల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని, భయాందోళనలు లేకుండా తుపాను ప్రభావంపై సమాచారం ఇవ్వాలని ఆదేశించారు.
గజ ఈతగాళ్లను తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున స్తంభాలు కూలితే వెంటనే పునరుద్ధరణ చేపట్టాలని సూచించారు. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతిన్నా శాటిలైట్ ఫోన్ల ద్వారా సమాచారం చేరవేయాలని తెలిపారు.
మొంథా తుపాను: భద్రతా పర్యవేక్షణ, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు
పునరావాస కేంద్రాలకు వెళ్లిన ప్రజల ఇళ్లకు భద్రత కల్పించాలని, దొంగతనాలు జరగకుండా సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ పెంచాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పోలీసులు ముంపు ప్రాంతాల్లో భద్రతా చర్యలు చేపట్టాలన్నారు.
ఏలేరు ప్రాజెక్టు నుంచి నీటి విడుదల జరిగే అవకాశం ఉన్నందున ప్రజలను అప్రమత్తం చేయాలని నీటి పారుదల శాఖకు సూచించారు. చెరువులు, వాగులు, కుంటల గట్లు బలహీనంగా ఉన్న చోట ఇసుక బస్తాలు సిద్ధంగా ఉంచాలని తెలియజేశారు.
మొంథా తుపాను: అత్యవసర నిధుల విడుదల
తుపాను ప్రభావిత ప్రాంతాల సాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.19 కోట్ల అత్యవసర నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. అందులో కాకినాడ జిల్లాకు రూ.1 కోటి కేటాయించారు.
ఈ నిధులతో పునరావాస కేంద్రాల్లో సౌకర్యాలు, నిత్యవసర సరుకుల పంపిణీ, ఇళ్లు కూలిపోవడం వంటి ఘటనలపై తక్షణ సాయం అందించాలని ఆదేశించారు.
మత్స్యకారుల భద్రతపై కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారు. వేటకు వెళ్లకుండా చూడాలనీ, పడవలకు రక్షణ చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖ అధికారులకు సూచించారు. మార్కెటింగ్ శాఖ కూరగాయలు, నిత్యావసర సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని చెప్పారు.