మంత్రి నారా లోకేశ్ పేరుతో భారీ సైబర్ మోసం.. రూ.54 లక్షలు కాజేశారు
Cyber Fraud Using Lokesh Name: ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ పేరుతో వాట్సాప్ ఫేక్ ప్రొఫైల్ సృష్టించి దుండగులు భారీ సైబర్ మోసానికి పాల్పడ్డారు. రూ.54 లక్షలు దోచుకున్న ఈ సైబర్ నేరగాళ్లను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు.

నారా లోకేశ్ పేరుతో సైబర్ క్రైమ్
Cyber Fraud Using Lokesh Name : రాష్ట్రంలో సైబర్ నేరాలు కొత్తకొత్త రూపాల్లో విస్తరిస్తున్నాయి. తాజాగా ఏపీ మంత్రి నారా లోకేశ్‌కు సంబంధించిన పేరు, ఫొటోను దుర్వినియోగం చేస్తూ భారీ మోసానికి పాల్పడిన గ్యాంగ్‌ను సీఐడీ అధికారులు పట్టుకున్నారు.
వాట్సాప్‌లో లోకేశ్ ఫొటోను డిస్‌ప్లే పిక్చర్‌గా పెట్టి, బాధితులను బెదిరిస్తూ వారి ఖాతాల్లో భారీ మొత్తాలు జమ చేయించుకున్న సంగతి వెలుగులోకి వచ్చింది. మొత్తం రూ.54 లక్షలు ఈ ముఠా కాజేసినట్టు విచారణలో తేలింది.
వాట్సాప్ ఫేక్ ప్రొఫైల్‌తో దందా
సైబర్ నేరగాళ్లు ముందుగా మంత్రికి సన్నిహితులు, పార్టీ నాయకులను టార్గెట్ చేశారు. నేరగాళ్లు నారా లోకేశ్ పేరు, ఫొటోలను ఉపయోగించి ఒక నకిలీ వాట్సాప్ ప్రొఫైల్ సృష్టించి, అత్యవసరంగా నిధులు కావాలని చెప్పి బాధితులను మోసగించారు.
పుట్టపర్తికి చెందిన రాజేష్ అనే నిందితుడు ఎన్నారై తెదేపా (తెలుగు దేశం పార్టీ) పేరుతో కూడా గతంలో మోసాలకు పాల్పడినట్టు తెలిసింది. వైద్య సాయం పేరుతో ఇప్పటివరకు సుమారు రూ.50 లక్షలకు పైగా వసూలు చేశాడని అధికారులు గుర్తించారు.
సీఐడీ గతంలోనే రాజేష్‌ను అరెస్ట్ చేసి విచారణ జరిపింది. అతడు ఇచ్చిన వివరాలతో మిగతా నిందితుల జాడలు సీఐడీకి దొరికాయి. తాజాగా హైదరాబాద్‌లో సాయిశ్రీనాథ్, సుమంత్ అనే మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితులకు రిమాండ్, పోలీసుల అలర్ట్
అరెస్టయిన ఇద్దరిని కోర్టులో హాజరుపరచగా, 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ కేసులో ఇంకా మరికొంత మంది ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు. బాధితుల ఫిర్యాదుల ఆధారంగా ఇంకా దర్యాప్తు కొనసాగుతున్నట్టు సీఐడీ వర్గాలు వెల్లడించాయి.
సైబర్ నేరాలపై ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి సందేహాస్పద సందేశాలు వచ్చినా వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని అధికారులు సూచిస్తున్నారు. అనుమానాస్పద వాట్సాప్ మెసేజ్‌లను నమ్మి డబ్బులు పంపితే భారీ నష్టాలు తప్పవని హెచ్చరికలు చేశారు.