18 లక్షల మందిపై మొంథా తుపాను ప్రభావం.. వారికి రూ.5 లక్షల పరిహారం
Cyclone Montha : మొంథా తుపాను ప్రభావం, నష్టాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రైతులకు సహాయం, విద్యుత్-రోడ్ల పునరుద్ధరణ కోసం చర్యలు వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే, రూ. 5 లక్షల పరిహారం వెంటనే అందించాలని పేర్కొన్నారు.

మొంథా తుపాను : పంట నష్టం నివేదికపై వెంటనే చర్యలకు సీఎం ఆదేశాలు
మొంథా తుపాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా నష్టపోయిన రైతుల పరిస్థితిని గుర్తించి వెంటనే వారిని ఆదుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పంట నష్టంపై పూర్తి వివరాలను ఐదు రోజుల్లోగా సమర్పించాలని వ్యవసాయ శాఖ అధికారులకు స్పష్టం చేశారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేసి పంటలను రక్షించే మార్గాలపై రైతులకు సూచనలు అందించాలన్నారు.
పంటనష్టం పై ప్రస్తుతం అందిన ప్రాథమిక అంచనాల ప్రకారం.. 304 మండలాలు, 1,825 గ్రామాలు ప్రభావితం అయ్యాయి. 87 వేల హెక్టార్లు పంట నష్టంతో 78,796 మంది రైతులు ప్రభావితం అయ్యారు. వరి, ప్రత్తి, మొక్కజొన్న, మినుము పంటలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. అలాగే, 42 పశువులు చనిపోయాయి. అయితే ఇది కేవలం ప్రాథమిక సమాచారం మాత్రమేనని, అసలు నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
విద్యుత్, రహదారుల పునరుద్ధరణకు ప్రాధాన్యత
సహాయక చర్యల పురోగతిపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు.. విద్యుత్ సరఫరా బుధవారం రాత్రికల్లా పునరుద్ధరించాలనీ, రహదారుల మరమ్మతులు గురువారానికి పూర్తిచేయాలని ఆదేశించారు. ఆర్టీసీ సేవలు యథావిధిగా కొనసాగాలని సూచిస్తూ… నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. డ్రైనేజీలను బలపరచి ఎక్కడా నీరు నిలువకుండా చూడాలని కూడా ఆదేశించారు.
పారిశుధ్యం, తాగునీటి భద్రతపై దృష్టి
ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి స్పష్టతనిచ్చారు. నీటి నిల్వలు లేకుండా శుభ్రపరిచే పనులు ముమ్మరం చేయాలన్నారు. తాగునీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డయేరియా వంటి కేసులు రాకుండా రూరల్ వాటర్ సప్లయ్ చర్యలు తీసుకోవాలన్నారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న కుటుంబాలకు 24 గంటల్లోగా రేషన్, నిత్యావసరాల పంపిణీ జరగాలని ఆదేశించారు.
ప్రకాశం జిల్లాలో మెరుగైన చర్యలు అవసరం
ఒంగోలులో కొన్ని కాలనీలు నీట మునగడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో పాలనా లోపాలు జరగకుండా తగిన విధానాలు రూపొందించుకోవాలని సూచించారు. తుఫాన్ కారణంగా రాష్ట్రంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం ప్రకటించారు. వెంటనే వారికి సాయం అందేలా చూడాలన్నారు. ప్రజాభిప్రాయాన్ని సేకరించి చర్యలను మరింత మెరుగుపరచాలని సూచించారు.
పునరావాసం, మౌలిక సదుపాయాల నష్టం వివరాలు
తుపాను సమయంలో 1,209 పునరావాస కేంద్రాలు 1.16 లక్షల మందికి ఆశ్రయం కల్పించాయి. మొంథా తుపాను 18 లక్షల మందిని ప్రభావితం చేసింది. ప్రభుత్వ సమీక్షలో ఇప్పటివరకు గుర్తించిన నష్టం వివరాలు గమనిస్తే..
• పంచాయతీరాజ్ రోడ్లు: 380 కి.మీ — రూ. 4.86 కోట్లు నష్టం
• ఆర్ అండ్ బీ రోడ్లు: 2,294 కి.మీ — రూ. 1,424 కోట్లు నష్టం
• రూరల్ వాటర్ సప్లయ్: రూ. 36 కోట్లు
• ఇరిగేషన్: రూ. 16.45 కోట్లు
3,175 మంది గర్భిణీలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 2,130 మెడికల్ క్యాంపులు నిర్వహించారు. రహదారులపై విరిగిపడ్డ 380 చెట్లను పూర్తిగా తొలగించారు. సమీక్ష సమావేశంలో మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, సీఎస్ విజయానంద్‌తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.