- Home
- Andhra Pradesh
- IMD Rain Alert : ఒకటి కాదు రెండు వాయుగుండాలు.. ఈ ప్రాంతాల్లో ఐద్రోజులు వర్షబీభత్సమే
IMD Rain Alert : ఒకటి కాదు రెండు వాయుగుండాలు.. ఈ ప్రాంతాల్లో ఐద్రోజులు వర్షబీభత్సమే
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలను వర్షాలు వదిలిపెట్టడంలేదు. బంగాళాఖాతంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల కారణంగా మళ్లీ వర్షాలు జోరందుకునే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
IMD Rain Alert : బంగాళాఖాతం ప్రస్తుతం అల్లకల్లోలంగా మారింది. వరుస అల్పపీడనాలు, వాయుగుండంతో పాటు తుపాను పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి... ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు మొదలవగా తెలంగాణలో చలి పూర్తిగా తగ్గిపోయింది. ఈ వారం సెన్యారు తుపాను ఏర్పడే అవకాశాలున్నాయని... దీని ప్రభావంతో వర్షాలు జోరందుకుంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
రేపే తుపాను
ఇప్పటికే ఓ అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. ప్రస్తుతం మలక్కా జలసంధి ప్రాంతాల్లో వాయుగుండం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతూ రాబోయే 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. అంటే గురువారానికి (నవంబర్ 27) తుపానుగా మారే అవకాశాలున్నాయని చెబుతోంది.
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
ఇక మరోవైపు నైరుతి బంగాళాఖాతం, దక్షిణ శ్రీలంక, హిందూ మహాసముద్రం మీదుగా మరో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇది 24 గంటల్లో ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ తీవ్రఅల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఆ తర్వాత 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని హెచ్చరించింది.
మత్స్యకారులు చేపలవేటకు వెళ్లరాదు
ఇలా వరుస అల్పపీడనాలు, వాయుగుండాల ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు జోరందుకుంటాయని APSDMA హెచ్చరించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది కాబట్టి గురువారం (నవంబర్ 27) నుంచి మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని హెచ్చరించింది. ఇప్పటికే వేటకు వెళ్లినవారు వెంటనే తిరిగిరావాలని సూచిస్తోంది. తుపాను సమయంలో సముద్రంలో ప్రయాణం సేఫ్ కాదని.. ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుందని హెచ్చరిస్తోంది.
ఏపీలో భారీ వర్షాలు
వాయుగుండాలు, సెన్యార్ తుపాను ప్రభావంతో ఈ వారం వర్షాలు కురుస్తాయని APSDMA ప్రకటించారు. ఏపీలో ఈ శనివారం నుంచి మంగళవారం వరకు (నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2) కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కాబట్టి రైతులు అప్రమత్తమై వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
తెలంగాణలో మళ్లీ చలి
తెలంగాణలో వర్షసూచనలేమీ లేవు... కానీ ప్రస్తుతం చలితీవ్రత తగ్గిపోయింది. గతవారం సింగిల్ డిజిట్ కు పడిపోయిన ఉష్ణోగ్రతలు ఇప్పుడు సాధారణ స్థితికి చేరుకున్నాయి. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మళ్లీ చలి పెరిగే అవకాశాలున్నాయంటోంది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. డిసెంబర్ ఆరంభంలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలు కూడా ఉన్నాయంటోంది.

