- Home
- Andhra Pradesh
- IMD Rain Alert : బంగాళాఖాతంలో ఆవర్తనం, అల్పపీడనం .. ఈ ప్రాంతాల్లో చలిగాలుల వర్ష బీభత్సమే
IMD Rain Alert : బంగాళాఖాతంలో ఆవర్తనం, అల్పపీడనం .. ఈ ప్రాంతాల్లో చలిగాలుల వర్ష బీభత్సమే
IMD Cold Wave Alert : ఇప్పటికే తెలుగు రాష్ట్రాలను చలిగాలులు వణికిస్తున్నాయి. వీటికి వర్షాలు తోడయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చలికి వర్షాలు తోడయ్యే అవకాశం...
IMD Rain Alert : మొంథా తుపాను తర్వాత తెలగు రాష్ట్రాల్లో పెద్దగా వర్షాలు లేవు... ఉష్ణోగ్రతలు పడిపోయి చలి పెరిగింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి... ఎముకలు కొరికే చలిగాలులు వీస్తున్నాయి. మొన్నటివరకు భారీ వర్షాలు, ఇప్పుడు విపరీతమైన చలి పరిస్థితులతో తెలుగు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు... అలాంటిది ఈ వర్షాలు, చలిగాలులు కలిసివస్తే పరిస్థితి ఏంటి? ఇకపై తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి వెదర్ కండీషన్స్ ఉంటాయని వాతావరణ విభాగాలు హెచ్చరిస్తున్నాయి.
బంగాళాఖాతంలో అల్పపీడనం
బంగాళాఖాతంలో మళ్లీ వర్షాలకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆంధ్ర ప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. నవంబర్ 19 (వచ్చే బుధవారం) నాటికి దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో నవంబర్ 21న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఊరటనిచ్చే అంశం ఏంటంటే ఇది వాయుగుండంగా మారే అవకాశం తక్కువగా… అల్పపీడనం తర్వాత బలహీనపడే అవకాశం ఉందని విపత్తు సంస్థ వెల్లడించింది.
ఏపీలో వర్షాలు
అల్పపీడనం ప్రభావంతో ఈనెల 24 నుండి 27 వరకు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని APSDMA తెలిపింది. అక్కడక్కడ మోస్తరు నుండి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందంది. ఇప్పటికయితే ఈ అల్పపీడన ప్రభావం ఎలా ఉంటుందో స్పష్టత లేదు... రానున్న రోజుల్లో క్లారిటీ వస్తుందన్నారు. ఈ వర్షసూచన నేపథ్యంలో వ్యవసాయ పనుల విషయంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపిఎస్డిఎంఏ సూచించింది.
ఇదిలావుంటే ఆంధ్ర ప్రదేశ్ లో గడ్డకట్టే స్థాయిలో చలిగాలులు వీస్తున్నారు. అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లా జి. మాడుగులలో 6 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ విభాగం ప్రకటించింది. ఇలా రాష్ట్రంలోని చాలాప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని… ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది వెదర్ డిపార్ట్మెంట్.
మరో నాలుగైదురోజులు ఇదే పరిస్థితి
తెలంగాణలో చలిగాలులు రోజురోజులు పెరుగుతున్నాయి... ఉష్ణోగ్రతలు అత్యల్ప స్థాయికి పడిపోతున్నాయి. రాత్రుళ్ల కంటే తెల్లవారుజామున పొగమంచు, చలిగాలులు ఎక్కువగా ఉంటున్నాయి. మరో నాలుగైదు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని.. మరింత దిగువకు ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశాలున్నాయని హెచ్చరిస్తోంది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.
తెలంగాణను వణికిస్తున్న చలి
తెలంగాణలోని ఆదిలాబాద్, కొమ్రంభీ ఆసిఫాబాద్, నిర్మల్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో చలి తీవ్ర ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది వాతావరణ శాఖ. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాబోయే రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 3 నుండి 4 డిగ్రీ సెల్సియస్ తక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది.
రాష్ట్రంలోనే అత్యల్పంగా హైదరాబాద్ శివారు పటాన్ చెరులో 9 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇక ఆదిలాబాద్ లో 10, మెదక్ లొ 10.8, హన్మకొండలొ 12.5, నిజామాబాద్ లో 13.8, దుండిగల్ లో 14.1, రామగుండంలో 14.9 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతాచోట్ల కూడా 10 నుండి 15 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ నమమోదయినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
సంగారెడ్డిలో లోయెస్ట్ టెంపరేచర్
రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు సంగారెడ్డి జిల్లాలో నమోదవుతున్నట్లు తెలంగాణ వెదర్ మ్యాన్ ప్రకటించారు. సంగారెడ్డిలో 7.8 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు. ఇక ఆసిఫాబాద్ లో 8.3, రంగారెడ్డిలో 8.8, మెదక్ లో 9.0, సిరిసిల్లలో 9.1, ఆదిలాబాద్ లో 9.3, కామారెడ్డిలో 9.4, నిజామాబాద్ లో 9.4 డిగ్రీ సెల్సియస్ సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెదర్ మ్యాన్ వెల్లడించారు.
హైదరాబాద్ లో అత్యల్ప ఉష్ణోగ్రతలు
హైదరాబాద్ లో అత్యల్పంగా సెంట్రల్ యూనివర్సిటీ (HCU) పరిసరాల్లో 8.8 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు. ఇక రాజేంద్రనగర్ లో 10.7, బిహెచ్ఈఎల్ లో 11.1, బొల్లాకంలో 11.7, మారేడుపల్లిలో 11.7, గచ్చిబౌలిలో 11.7, కుత్బుల్లాపూర్ లో 12.2, జీడిమెట్లలో 12.7 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉన్నాయని తెలిపారు. మరికొద్దిరోజులు ఇదేస్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉంటాయని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరించారు.