IMD Rain Alert : బంగాళాఖాతంలో వాయుగుండం... ఈ ప్రాంతాల్లో భారీ వర్షగండం
IMD Rain Alert : శీతాకాలంలో వర్షాకాలం పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడు మరో వాయుగుండం గండం పొంచివుందని IMD హెచ్చరిస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలను వర్షాలు వదిలిపెట్టడంలేదు. వర్షాకాలం ముగిసినా వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో వానలు కురుస్తూనే ఉన్నాయి. బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు, వాయుగుండాలు తుపానులు ఏర్పడుతున్నాయి. ఇటీవల మొంథా, తాజాగా దిత్వా తుపాను బీభత్సం సృష్టించింది. దిత్వా తుపాను బలహీనపడినా దాని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
బలహీనపడిన దిత్వా తుపాను.. అయినా జోరువానలు
ప్రస్తుతం దిత్వా తుపాను తీవ్రవాయుగుండంగా బలహీనపడింది... ఇది ఇవాళ (డిసెంబర్ 1, సోమవారం) కు మరింత బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం ప్రభావంతో ఇవాళ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుసే అవకాశాలున్నాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఇక కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఇలా వరికోతల సమయంలో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు కూడా ఈ వర్షాలు, చలి తీవ్రత నేపథ్యంలో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలుంటాయి... కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
సముద్రం అల్లకల్లోలం
దిత్వా తుపాను ప్రభావంతో సముద్రం అలజడిగా ఉంటుంది... కాబట్టి మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని సూచించారు. ఇవాళ దక్షిణకోస్తా తీరం వెంబడి గంటకు 45-65 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని APSDMA తెలిపింది.
ఇక్కడే అత్యధిక వర్షపాతం
దిత్వా తుపాను ప్రభావంతో ఆదివారం (నవంబర్ 30) ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు కురిశాయి. నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా నెల్లూరు జిల్లా కావలిలో 8.7 సెంటిమీటర్లు, జలదంకిలో 5.6 సెం.మీ, తిరుపతి జిల్లా చిట్టమూరులో 3.2 సెం.మీ వర్షపాతం నమోదయ్యింది.
నేడు తెలంగాణలో వర్షాలు
దిత్వా తుపాను ప్రభావం తెలంగాణపై కూడా పడింది. ఇవాళ (సోమవారం) భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక జయశంకర్ భూపాలపల్లి, ములుగు, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, రంగారెడ్డి, వనపర్తి, గద్వాల జిల్లాల్లో ఒకటి రెండుచోట్ల సాధారణం నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
7-day forecast(NIGHT) of TELANGANA based on 1200 UTC issued at 2030 hours IST Dated :30-11-2025 pic.twitter.com/WUSp98yS4i
— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) November 30, 2025

