ఎంతమోసం ఎంతమోసం... విశాఖలో అయోధ్య ఆలయమంటేనే డౌట్ రావాల్సిందిగా..!
విశాఖపట్నంలో అయోధ్య ఆలయమేంటి? అప్పుడే డౌట్ రావాలిగా ఏదో గడబిడ ఉందని. చివరికి ఇప్పుడు బైటపడింది భక్తి ముసుగులో జరుగుతున్న మోసం. ఇంతకూ ఈ మోసం ఎలా జరుగుతోందంటే..
- FB
- TW
- Linkdin
Follow Us

విశాఖపట్నంలో అయోధ్య రామమందిరం సెట్టింగ్
Visakhapatnam : భక్తి ముసుగులో ప్రజల నుండి భారీగా డబ్బులు వసూలుచేస్తున్న కొందరిని విశాఖపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. సాగరతీరంలో అయోధ్య రామమందిరం సెట్ వేసి బాలరాముడిని విగ్రహాన్ని ఏర్పాటుచేాశారు కొందరు వ్యక్తులు. అచ్చం అయోధ్య మందిరాన్ని తలపించేలా ఉండటంతో విశాఖవాసులు బాగా ఆకర్షితులయ్యారు. నిజమైన ఆలయంలా భావించి స్వామివారిని దర్శించుకుంటున్నారు.
భక్తి మూసుగులో భారీ మోసం
ప్రజల భక్తిని ఆసరాగా చేసుకుని అయోధ్య ఆలయాన్ని మార్కెటింగ్ వస్తువుగా మార్చేశారు. ఆలయంలోకి వెళ్లేందుకు, దర్శన చేసుకునేందుకు, చివరకు చెప్పులు భద్రపర్చేందుకు కూడా డబ్బులు వసూలు చేయడం ప్రారంభించారు. నిర్వహకుల తీరు తేడాగా ఉండటంతో కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో విశాఖపట్నంలో భక్తి పేరిట జరుగుతున్న మోసం వెలుగులోకి వచ్చింది.
అయోధ్య మందిరం పేరిట భారీ వసూళ్లు
ఈ రామమందిరంలోకి సెట్టింగ్ లోకి అడుగు పెట్టగానే చెప్పుల స్టాండ్ వద్ద రూ.5 వసూలు చేస్తారు. అక్కడి నుండి మెళ్ళిగా ముందుకు కదిలితే స్వామివారి దర్శన టికెట్ కౌంటర్ ఉంటుంది. అక్కడ ఏకంగా దర్శనం కోసమంటూ రూ.50 వసూలు చేస్తున్నారు. ఈ మొత్తం ఇస్తేనే రామయ్య దర్శనం... లేదంటే వెనక్కి పంపించేస్తారు. ఇలా గతకొద్దిరోజులుగా అయోధ్య రామాలయం పేరిట డబ్బుల వసూలు దందా సాగుతోంది.
రామయ్య కళ్యాణమంటూ మరో దోపిడీ
అయితే తాజాగా మరో భారీ మోసానికి తెరతీసారు నిర్వహకులు. ఎలాంటి అనుమతులు లేకుండా భారీ ఉత్సవాలకు సిద్దమయ్యారు... సీతారాముల కల్యాణోత్సవానికి ఏర్పాట్లు చేశారు. ఇందులో పాల్గొనే దంపతులకు రూ.2,999 టికెట్స్ విక్రయించారు. ఇలా ఇప్పటికే చాలామంది నుండి భారీగా డబ్బులు వసూలు చేశారు.
విశాఖలో వింత మోసం
భద్రాచలం రామాలయం నుండి పండితులను పిలిపిస్తున్నామని ప్రచారంచేసి మరింతమందిని మోసం చేసేందుకు ప్లాన్ చేశారు నిర్వహకులు. అయితే ఇంతలోనే కొందరు విశాఖ తీరంలో ఏర్పాటుచేసిన అయోధ్య రామమందిరం సెట్టింగ్, అక్కడ జరుగుతున్న వసూళ్లపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదుచేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిర్వహకులను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు అయోద్య మందిరం సెట్టింగ్ ద్వారా ప్రజల నుండి ఎంత డబ్బులు వసూలు చేసారన్నది తెలియాల్సి ఉంది.