- Home
- Andhra Pradesh
- Cyclone Kaani : బంగాళాఖాతంలో 'కాని' తుపాను లోడింగ్.. ఎప్పుడు, ఎక్కడ తీరం దాటుతుందో తెలుసా?
Cyclone Kaani : బంగాళాఖాతంలో 'కాని' తుపాను లోడింగ్.. ఎప్పుడు, ఎక్కడ తీరం దాటుతుందో తెలుసా?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడటం ఖాయం అయ్యింది. వాతావరణం అనుకూలించి ఇది బలపడితేే మరో తుపాను తప్పదని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ తుపాను పేరు ఏంటి? ఎప్పుడు, ఎక్కడ తీరం దాటుతుంది? తెలుసుకుందాం.

మరో తుపాను బీభత్సం తప్సదా?
తెలుగు రాష్ట్రాలను వరుస వర్షాలు, తుపానులు వెంటాడుతున్నాయి. ఇప్పటికే అర్నబ్, మురసు, అక్వాన్ వంటి తుపానులు ఆంధ్ర ప్రదేశ్ ను అతలాకుతలం చేశాయి... తెలంగాణలో కూడా వర్షాలకు కారణమయ్యాయి. ఈ తుపానులు తీరందాటే సమయంలో భారీ ఈదురుగాలులు, కుండపోత వర్షాలతో ఏపీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు... భారీగా ఆస్తినష్టం జరిగింది. ఈ తుపానుల బీభత్సం నుంచి పూర్తిగా కోలుకోకముందే బంగాళాఖాతంలో మరో తుపాను ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని హెచ్చరికలు జారీ అయ్యాయి.. ఇది తెలుగు ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.
కాని తుపాను లోడింగ్
ఇప్పటికే దక్షిణ అండమాన్ సముద్రం పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో నవంబర్ 30 నాటికి అంటే రేపు (సోమవారం) అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. సముద్రంలో అనుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా, ఆ తర్వాత వాయుగుండంగా మారుతుందని వెల్లడించింది. వచ్చేనెల డిసెంబర్ లో తుపానుగా బలపడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఇలా బంగాళాఖాతంలో తుపాను ఏర్పడితే దానిని 'కాని' అని పిలవనున్నారు… ఇది మాల్దీవ్స్ సూచించిన పేరు. ఈ తుపాను పశ్చిమ-వాయువ్య దిశగా తమిళనాడు లేదా శ్రీలంక తీరాల వైపు కదిలే అవకాశం ఉంది. కాని తుపాను డిసెంబర్ 7 నాటికి తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ తుపాను సముద్రంలోనే బలహీనపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ చెబుతోంది... అంటే తీరందాటే సమయంలో దీని ప్రభావం తక్కువగా ఉంటుందన్నమాట.
దక్షిణ అండమాన్ సముద్రంపై ఏర్పడే ఉపరితల ఆవర్తన ప్రభావంతో నవంబర్ 30వ తేదీ నాటికి అండమాన్ , ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని #APSDMA తెలిపింది.
డిసెంబర్ 2వ తేదీకు ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. https://t.co/sKOcZIUEjT
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) November 27, 2026
ఆంధ్ర ప్రదేశ్ పై తుపాను ఎఫెక్ట్
కాని తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా ప్రాంతాలు, రాయలసీమ, ఉత్తరాంధ్రలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా సముద్రంలో అల్పపీడనం బలపడిన తర్వాత వర్షాల తీవ్రత పెరగనుందట. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు పడటంతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
అయితే ఈ అల్పపీడనం సముద్రంలోనే బలహీనపడితే భారీ తుపాను ముప్పు తప్పే అవకాశం ఉంటుంది. అందుకే ప్రజలు ఆందోళన చెందకుండా అధికారిక వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
తెలంగాణలోనూ కొనసాగుతున్న వర్షాలు
ఇదిలావుంటే తెలంగాణలో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో రికార్డు వర్షపాతం నమోదయ్యింది. మరో రెండుమూడు రోజులు రాష్ట్రంలో ఇలాగే వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాల్లోనూ చిరుజల్లులు కురిసే సూచనలు ఉన్నాయంటోంది. దీంతో ఇప్పటికే చలి వాతావరణం నెలకొన్న ప్రాంతాల్లో వర్షాలు కురిస్తే ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉంది.
తెలంగాణలో పెరుగుతున్న చలి..
ఓవైపు వర్షాలు కురుస్తుండగా, మరోవైపు తెలంగాణలో చలి తీవ్రత కూడా పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, ఏజెన్సీ ప్రాంతాల్లో రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతున్నాయి. తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించిన వివరాల ప్రకారం కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాణిలో అత్యల్పంగా 10.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
తెలంగాణలో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రతలు
తిర్యాణి (కొమ్రంభీం ఆసిఫాబాద్) 10.2°C
గుండాల (భద్రాద్రి కొత్తగూడెం) 11.2°C
జగదేవ్‌పూర్ (సిద్దిపేట) 11.2°C
గంగారం (మహబూబాబాద్) 11.5°C
నేరడిగొండ (ఆదిలాబాద్) 11.6°C
హైదరాబాద్‌లోనూ చలి ప్రభావం కనిపిస్తోంది. రాజేంద్రనగర్‌లో 14 డిగ్రీలు, మౌలాలిలో 14.1 డిగ్రీలు, పటాన్చెరులో 14.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తెలంగాణలో రాబోయే మూడు, నాలుగు రోజుల పాటు చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి. రాత్రి, తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అదికారులు సూచిస్తున్నారు.











