- Home
- Andhra Pradesh
- ఈ జిల్లాలకు అలర్ట్.. వచ్చే 3 రోజులు భారీ వర్షాలు తప్పవు. జాగ్రత్తగా ఉండాల్సిందే
ఈ జిల్లాలకు అలర్ట్.. వచ్చే 3 రోజులు భారీ వర్షాలు తప్పవు. జాగ్రత్తగా ఉండాల్సిందే
Cyclone Ditwah: దిత్వా తుపాను క్రమంగా దూసుకొస్తోంది. దీని ప్రభావం తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాలపై స్పష్టంగా పడనుందని వాతావరణ శాఖ చెబుతోంది. వచ్చే 3 రోజులు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

దిత్వా తుపాను దిశలో మార్పు
నైరుతీ బంగాళాఖాతంలో ఏర్పడ్డ దిత్వా తుపాన్ ప్రస్తుతం ఉత్తరం వైపు ఎగసిపడుతోంది. గంటకు 55 కిలోమీటర్ల వేగంతో కదులుతుండటంతో దాని బలం తగ్గినట్లు నిపుణులు భావిస్తున్నారు. అయినప్పటికీ ప్రభావం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో స్పష్టంగా కనిపించనుంది. ఈ తుపాను ఆదివారం సాయంత్రం చెన్నైకి సుమారు 130 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రాత్రి చీకటి పడే సమయానికి 100 కిలోమీటర్ల దూరంలోకి చేరుతుంది. ఉత్తరం వైపు ఎగసిపడుతున్నందున తమిళనాడులో తీరం దాటే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. సోమవారం (రేపు) ఉదయం 10 గంటలకు ఇది తిరుపతికి 200 కిలోమీటర్ల దూరంలో నిలిచే అవకాశం ఉంది. అక్కడి నుంచి దిశ మార్చుకుని దక్షిణం వైపు వెళ్లనున్నట్లు శాటిలైట్ అంచనాలు చెబుతున్నాయి. డిసెంబర్ 2వ తేదీ ఉదయం మళ్లీ చెన్నై దక్షిణానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉండే అవకాశం ఉందని అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు
వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం నవంబర్ 30 నుంచి డిసెంబర్ 2 వరకు ఆంధ్రప్రదేశ్‌లో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు. ఆదివారం రాత్రి నుంచి తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా.. తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, రాజమహేంద్రవరం, నగరి, చిత్తూరు, రాయచోటి, కడప, కావలి, చీరాల, మచిలీపట్నం, ఏలూరు, విజయవాడ, తుని, విశాఖపట్నం, విజయనగరం, బొబ్బిలిలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణ విషయానికొస్తే
ఇక తెలంగాణలో ఆదివారం పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కురిసే అవకాశ ఉంది. రోజంతా మబ్బులతో ఉన్నా, వర్షం కొద్దిగానే కురిసే అవకాశాలు ఉన్నాయి. అయితే సోమవారం పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం రాష్ట్రంలో మూడు రోజులు మార్పులు కొనసాగుతాయి. చలి మరింత పెరగొచ్చు కనుక ఉదయం, రాత్రి సమయాల్లో జాగ్రత్తలు అవసరం.
గాలుల వేగం పెరగనుంది
అరేబియా సముద్రంలో గాలి వేగం గంటకు 22 కిలోమీటర్లు. బంగాళాఖాతంలో అదే వేగం 46 కిలోమీటర్లుగా ఉండనుంది. దిత్వా తుపాన్ ప్రభావంతో ఏపీలో గాలి వేగం గంటకు 30 కిలోమీటర్ల వరకు పెరుగుతుంది. తెలంగాణలో వేగం 26 కిలోమీటర్లు దాటే అవకాశం ఉంది. సముద్రంలో అలలు ఎత్తుగా ఎగిసిపడుతున్నందున బోట్లు తిరగబడే పరిస్థితి ఉంది. ఫిషింగ్ యాక్టివిటీ పూర్తిగా నిలిపివేయాలని స్పష్టమైన హెచ్చరికలు వచ్చాయి.
ఉష్ణోగ్రతలు ఎలా ఉండనున్నాయి.?
రెండు రాష్ట్రాల్లో పగటివేళ ఉష్ణోగ్రత 26 డిగ్రీల వరకు ఉంటుంది. రాత్రివేళ తెలంగాణలో 19 డిగ్రీలు, ఆంధ్రప్రదేశ్‌లో 22 డిగ్రీలు నమోదు కావచ్చు. ఇక తెలంగాణలో పగటివేళ 49 శాతం, రాత్రుళ్లు 87 శాతం తేమ ఉండనుంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో పగలు 74 శాతం, రాత్రి 78 శాతం తేమ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

