- Home
- Andhra Pradesh
- ఏపీలో క్యాన్సర్ నివారణకు ఫైజర్, టాటా ఫౌండేషన్ కీలక అడుగు.. 2.38 లక్షల మందికి ప్రయోజనం
ఏపీలో క్యాన్సర్ నివారణకు ఫైజర్, టాటా ఫౌండేషన్ కీలక అడుగు.. 2.38 లక్షల మందికి ప్రయోజనం
Cancer: ఫైజర్ ఇండియా, టాటా కేన్సర్ కేర్ ఫౌండేషన్ సంయుక్తంగా ఏపీలో క్యాన్సర్ అవగాహన, ముందస్తు గుర్తింపు కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ కార్యక్రమం ద్వారా తిరుపతిలో ఇప్పటివరకు 2.38 లక్షల మందికి పైగా ప్రయోజనం చేకూరింది.

క్యాన్సర్ ముందస్తు గుర్తింపుపై ప్రత్యేక దృష్టి
దేశంలో పెరుగుతున్న క్యాన్సర్ కేసులను దృష్టిలో ఉంచుకుని ఫైజర్, టాటా క్యాన్సర్ కేర్ ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. నోటి, రొమ్ము, గర్భాశయ ముఖద్వార కేన్సర్లపై ప్రజలకు అవగాహన కల్పించడం, ఉచితంగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం దీని ప్రధాన ఉద్దేశం. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వైద్య సేవలను మరింత చేరువ చేయడంపై సంస్థలు దృష్టి సారించాయి.
తిరుపతిలో 1.57 లక్షల మందికి పరీక్షలు
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో ఈ కార్యక్రమం ద్వారా 2,38,000 మందికి పైగా సేవలు అందించారు. ఇందులో భాగంగా 1.57 లక్షల మందికి నోటి, రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కోసం పరీక్షలు నిర్వహించారు. వీరిలో 701 మందికి క్యాన్సర్ ఉన్నట్లు అనుమానించగా, తదుపరి పరీక్షల్లో 84 మందికి వ్యాధి నిర్ధారణ అయింది. అలాగే 9,700 మంది ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.
ఐదు రాష్ట్రాల్లో 14 లక్షల మందికి చేరువ
ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్‌తో పాటు జార్ఖండ్, అస్సాం, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లోనూ కొనసాగుతోంది. ఐదు రాష్ట్రాల్లో కలిపి ఇప్పటివరకు 14.1 లక్షల మందికి పైగా ప్రజలకు అవగాహన కల్పించారు. మొత్తం 11,15,558 మందికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించగా, 720 మందికి కేన్సర్ ఉన్నట్లు గుర్తించారు. మరోవైపు 31 వేల మంది ఆరోగ్య నిపుణులకు శిక్షణ అందించారు.
ఏపీలో పెరుగుతున్న క్యాన్సర్ కేసులు
ICMR-NCRP అంచనాల ప్రకారం, 2024లో దేశవ్యాప్తంగా సుమారు 15.3 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 2022లో 70,424గా ఉన్న అంచనా కేసుల సంఖ్య 2024 నాటికి 76,708కు పెరిగింది. ఈ నేపథ్యంలో నవంబర్ 25న తిరుపతిలో ఫైజర్, TCCF సంయుక్తంగా ప్రత్యేక సమావేశం నిర్వహించాయి. క్యాన్సర్ నివారణ, స్క్రీనింగ్ పరీక్షలు, వైద్య సేవల మెరుగుదలపై వివిధ రంగాల ప్రతినిధులు చర్చించారు.
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో మెరుగైన సేవలు
ఈ సమావేశంలో తిరుపతి కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్, టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరితో పాటు వైద్య, ప్రజారోగ్య రంగాల ప్రతినిధులు పాల్గొన్నారు. క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించేందుకు ప్రజల్లో అవగాహన పెంచడం, వైద్య పరీక్షలను అందుబాటులోకి తీసుకురావడం అవసరం అని కలెక్టర్ పేర్కొన్నారు.















