AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో తొలి విడత పంచాయతీ, రెండో విడత మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు ఓటు వేయగా, పలు చోట్ల ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికలతో పాటు, 23 పట్టణ స్థానిక సంస్థలకు రెండో విడత పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రశాంతంగా ప్రారంభమైంది. విశాఖపట్నం, గుంటూరు జిల్లాలు మినహా మిగిలిన 26 జిల్లాల్లోని 42 డివిజన్లు, 201 మండలాల్లో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది.
మొత్తం 3,240 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా, ఇప్పటికే 709 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3,189 సర్పంచ్ స్థానాలు, 25,101 వార్డు సభ్యుల పదవులకు ఏకంగా 62,863 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పట్టణ ప్రాంతాల్లో శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, కాకినాడ, మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థల్లో 4 మేయర్ పదవులకు 36 మంది, 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఛైర్పర్సన్ పదవులకు 134 మంది పోటీ పడుతున్నారు.
మొత్తం 964 వార్డులు/డివిజన్లలో 2,968 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పంచాయతీల్లో 74,45,583 మంది, పట్టణాల్లో 24,98,312 మంది కలిపి మొత్తం 99,43,895 మంది ఓటర్ల కోసం 34,312 పోలింగ్ కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు.
కుటుంబంతో కలిసి ఓటేసిన సీఎం చంద్రబాబు.. ఉదయం నుంచే ఓటర్ల క్యూ
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనతో పాటు సతీమణి భువనేశ్వరి, కుమారుడు, మంత్రి నారా లోకేష్, కోడలు బ్రాహ్మణి కూడా తమ ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం సీఎం మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.
మరోవైపు, ఓటు వేయడానికి పల్లెలు, పట్టణాల్లో ఓటర్లు ఉదయం నుంచే పెద్ద ఎత్తున క్యూ కట్టారు. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం భూదేవిపేటలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాల వద్ద రద్దీ కనిపించింది. అదే జిల్లా టి.నర్సాపురంతో పాటు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని గోస్పాడు, హాలహర్వి ప్రాంతాల్లోనూ ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేయడానికి తరలివచ్చారు. ఏలూరు జిల్లాలో 164 పంచాయతీలు, 1572 వార్డులకు పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది.
పలు చోట్ల హైటెన్షన్: సంబేపల్లెలో ఉద్రిక్తత.. శిల్పారవి హౌస్ అరెస్ట్
ఒకవైపు పోలింగ్ ప్రశాంతంగా సాగుతుంటే, మరికొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం సంబేపల్లె గ్రామపంచాయతీ వద్ద హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. సర్పంచ్ అభ్యర్థి కొప్పుల యశోదమ్మతో పాటు వైసీపీ సానుభూతిపరులు, ఏజెంట్లను పోలీసులు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారనే ఆరోపణలతో వారు రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు పోలింగ్ కేంద్రం మెయిన్ గేటుకు తాళం వేసి, ఆందోళన చేస్తున్న వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
పోలీసులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ, తాము ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు వైసీపీ సపోర్టు అభ్యర్థి ప్రకటించారు. మరోవైపు, నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పారవిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎన్నికల నేపథ్యంలో ఘర్షణలు జరిగే అవకాశం ఉందన్న ముందస్తు సమాచారంతో పోలీసులు ఆయన ఇంటిని చుట్టుముట్టారు. అయితే, తమ నాయకుడిని ఉద్దేశపూర్వకంగానే అరెస్ట్ చేశారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.
ఎన్టీఆర్, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ ఏర్పాట్లు
ఎన్టీఆర్ జిల్లాలోని ఐదు మండలాల్లో ఉన్న 73 పంచాయతీల్లో 5 ఏకగ్రీవం కాగా, 68 పంచాయతీలకు నేడు పోలింగ్ జరుగుతోంది. మొత్తం 856 వార్డుల్లో 75 ఏకగ్రీవం కాగా, 781 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 1001 పోలింగ్ కేంద్రాల్లో 1662 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా, ఒక్క గొల్లపూడిలోనే అత్యధికంగా 25 వేలకు పైగా ఓటర్లు ఉన్నారు.
ఇక ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మలి విడత మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతోంది. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్‌లోని 60 డివిజన్లు, ఆముదాలవలసలోని 28 వార్డులు, రాజాంలోని 32 వార్డులకు ఓటింగ్ జరుగుతోంది. ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 1800 మంది ఎన్నికల సిబ్బందితో పాటు, 2,200 మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
ఫలితాలు ఎప్పుడంటే?
ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సిరా గుర్తు ఇంకా ఓటర్ల వేళ్లపై చెరిగిపోకపోవడంతో, రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కొత్త నిబంధన పెట్టింది. ఎలాంటి గందరగోళం లేకుండా ఓటర్ల ఎడమచేతి చిటికెన వేలుకు సిరా గుర్తు వేయాలని పోలింగ్ సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వెబ్‌కాస్టింగ్, వీడియోగ్రఫీ, సీసీ కెమెరాల నిఘా మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కఠినంగా అమలు చేస్తున్నామని, ఓటర్లు ఎలాంటి భయాందోళనలు, ప్రలోభాలకు లొంగకుండా నిర్భయంగా ఓటు వేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా కోరారు. గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం 1 గంటకు ముగియనుండగా, మధ్యాహ్నం 2 గంటల నుంచే ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. పట్టణ స్థానిక సంస్థల ఫలితాలు మాత్రం ఈ నెల 30న వెలువడనున్నాయి.
















