మరో రెండు రోజుల పాటు వర్ష సూచన.. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే
AP Weather Update: ఆంధ్రప్రదేశ్లో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నాయని తెలిపింది.

సముద్రంలో కొనసాగుతున్న ద్రోణి..
మన్నార్ గల్ఫ్ నుంచి నైరుతి బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. ఈ వాతావరణ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA మేనేజింగ్ డైరెక్టర్, RTGS సీఈవో ప్రఖర్ జైన్ తెలిపారు. రాబోయే రెండు రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేశారు. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
గురువారం ఈ జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్
నవంబర్ 26, గురువారం పోలవరం, కోనసీమ, తూర్పుగోదావరి, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లోనూ కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురుగా తేలికపాటి జల్లులు పడవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. శుక్రవారం రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపింది.
పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదు
బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. ముఖ్యంగా తిరుపతి, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో చెప్పుకోదగిన స్థాయిలో వర్షపాతం నమోదైంది. నాయుడుపేట (తిరుపతి జిల్లా)లో 45.3 మి.మీ, అల్లంపాడు (నెల్లూరు జిల్లా)లో 41.5 మి.మీ, గూడూరులో 32.7 మి.మీ, వాకాడు (తిరుపతి జిల్లా)లో 32.5 మి.మీ, విడవలూరు (నెల్లూరు జిల్లా)లో 32 మి.మీ, పెన్నేపల్లె (తిరుపతి జిల్లా)లో 30 మి.మీ, మొలకలపుండ్ల (నెల్లూరు జిల్లా)లో 28 మి.మీ, నెల్లూరులో 23.2 మి.మీ, భీమవరంలో 22.7 మి.మీ వర్షం కురిసింది.
పిడుగులు, ఈదురుగాలుల పట్ల జాగ్రత్త
వర్షాలు కురిసే సమయంలో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని APSDMA సూచించింది. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతున్నప్పుడు చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని హెచ్చరించింది. ఈదురుగాలులు వీచే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచించింది. వాతావరణ పరిస్థితులను గమనిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రఖర్ జైన్ కోరారు.















