- Home
- Andhra Pradesh
- ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. పాస్ మార్కులు తగ్గింపు, మ్యాథ్స్ సబ్జెక్ట్‌లో మార్పు
ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. పాస్ మార్కులు తగ్గింపు, మ్యాథ్స్ సబ్జెక్ట్‌లో మార్పు
Inter: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ విద్యా విధానంలో పెద్ద మార్పులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మార్కుల వ్యవస్థను సులభతరం చేసేందుకు ప్రభుత్వం కొత్త పద్ధతులు తీసుకువచ్చింది. ఈ నిర్ణయాలు 2025–26 విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి రానున్నాయి.

గణితంలో రెండు పేపర్లకు బదులు ఒకే పేపర్
ఇంటర్ మ్యాథ్స్‌లో 1A, 1B పేర్లతో రెండు పేపర్లు ఉంటాయనే విషయం తెలిసిందే. ఒక్కో పేపర్‌కి 75 మార్కులు, పాస్ అవ్వడానికి 25 మార్కులు అవసరమయ్యేవి. ఇప్పుడు ప్రభుత్వం ఈ రెండు పేపర్లను కలిపి 100 మార్కుల ఒకే సబ్జెక్టుగా మార్చింది. కొత్త విధానం ప్రకారం గణితంలో పాస్ మార్కులు 35గా నిర్ణయించారు. ఈ మార్పుతో విద్యార్థులు రెండు పేపర్లకు వేరుగా సిద్ధమవ్వాల్సిన అవసరం ఉండదు.
బైపీసీ విద్యార్థులకు కొత్త బయాలజీ సబ్జెక్ట్
బైపీసీ కోర్సులో కూడా ప్రభుత్వం పెద్ద మార్పు చేసింది. బోటనీ, జువాలజీ సబ్జెక్టులను కలిపి “బయాలజీ” అనే ఒకే సబ్జెక్ట్‌గా మార్చింది. ఫస్ట్ ఇయర్‌లో ఈ సబ్జెక్ట్ 85 మార్కులకు పరీక్ష ఉంటుంది, పాస్ మార్కులు 29గా నిర్ణయించారు. సెకండియర్‌లో 30 మార్కులు తెచ్చుకుంటే పాస్ అవుతారు. ఈ మార్పులతో విద్యార్థులు రెండు వేర్వేరు సబ్జెక్టుల ఒత్తిడి నుంచి బయటపడతారని విద్యాశాఖ భావిస్తోంది.
పాస్ మార్కుల్లో మార్పులు
గతంలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మూడు సబ్జెక్టులలో కలిపి పాస్ అవ్వాలంటే 59.50 మార్కులు అవసరమయ్యేది. ఇకపై 59 మార్కులు వచ్చినా పాస్ అయినట్లే పరిగణిస్తారు. అంటే అర మార్కు తక్కువ వచ్చినా ఫెయిల్ కాదన్న మాట. అలాగే ప్రాక్టికల్ పరీక్షల్లో పాస్ మార్కులు 10.5 నుంచి 11కి పెంచారు. ఈ మార్పులు NCERT విధానానికి అనుగుణంగా తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఎలెక్టివ్ సబ్జెక్టులకు కొత్త ఆప్షన్స్
ఏపీ ఇంటర్ బోర్డు కొత్త విద్యా విధానంలో ఎలెక్టివ్ సబ్జెక్టుల ఎంపికకు విస్తృత అవకాశం కల్పించింది. ఏ గ్రూప్ విద్యార్థులైనా 24 సబ్జెక్టుల్లో తామకు ఇష్టమైనదానిని సెలక్ట్ చేసుకోవచ్చని బోర్డు తెలిపింది. ఈ విధానం విద్యార్థుల్లో ఆసక్తి, సృజనాత్మకత పెంచుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ముందుగానే ఇంటర్ పరీక్షల షెడ్యూల్
ఈసారి ఇంటర్ పరీక్షలు కొంచెం ముందుగానే జరుగనున్నాయి. ఫిబ్రవరి 23 నుంచి ఫస్టియర్, సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభం అవుతాయి. ఎగ్జామ్ ఫీజుల గడువు అక్టోబర్ 22తో ముగుస్తుంది. అయితే రూ.1000 ఆలస్య రుసుముతో అక్టోబర్ 30 వరకు చెల్లించడానికి అవకాశం ఉంది. థియరీ పేపర్లకు రూ.600, ప్రాక్టికల్స్‌కు రూ.275, బ్రిడ్జి కోర్స్ సబ్జెక్టుకు రూ.165 చెల్లించాలి.