- Home
- Andhra Pradesh
- ఏపీ రైతులకు రూ.7000, తెలంగాణ రైతులకు రూ.2000.. ఏం చేయకుండానే నేరుగా అకౌంట్లోకి డబ్బులు
ఏపీ రైతులకు రూ.7000, తెలంగాణ రైతులకు రూ.2000.. ఏం చేయకుండానే నేరుగా అకౌంట్లోకి డబ్బులు
PM Kisan Annadata Sukhibhava : తెలుగు రైతుల ఖాతాల్లో రేపు(బుధవారం) డబ్బులు పడనున్నాయి. ఏపీ రైతులకు రూ.7,000, తెలంగాణ రైతులకు రూ.2000 అందనున్నాయి. ఏం చేయకున్నా డబ్బులు ఎందుకు పడనున్నాయంటే…

పీఎం కిసాన్+అన్నదాత సుఖీభవ
Annadata Sukhibhava : తెలుగు రైతులకు గుడ్ న్యూస్... రేపు (నవంబర్ 19న) అన్నదాతల బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు పడనున్నాయి. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న చిన్న సన్నకారు రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద పెట్టుబడి సాయం చేస్తోంది... ఇప్పటికే 20 విడతల డబ్బులు అందించింది. 21 విడత పెట్టుబడి సాయం నవంబర్ 19న అంటే బుధవారం విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్దమయ్యింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఈ పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేయనున్నారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రధాని నిధులు విడుదల చేస్తారు... ఆ తర్వాత రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. దేశవ్యాప్తంగా దాదాపు 9 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో రూ.2 వేల చొప్పున డబ్బులు జమ కానున్నాయి. అయితే ఆంధ్ర ప్రదేశ్ రైతులకు మాత్రం రూ.2000 కాదు రూ.7000 అందనున్నాయి.
ఏపీ రైతులకు అన్నదాత సుఖీభవ
తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ సన్నకారు రైతులకు పీఎం కిసాన్ కింద ప్రతి విడతలో రెండు వేల రూపాయలే అందుతాయి. కానీ ఏపీ రైతులకు పీఎం కిసాన్ రూ.2000 తో పాటు మరో రూ.5,000 వేలు అదనంగా లభిస్తాయి... రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బులు ఇస్తుంది. ఇలా కేంద్రం రూ.2000+రాష్ట్రం రూ.5000 కలిపి మొత్తంగా ఏపీ రైతన్నల ఖాతాలో రూ.7,000 చొప్పున డబ్బుల జమ అవుతాయి.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతులకు పెట్టుబడి సాయం హామీ ఇచ్చారు… అందులో భాగంగానే పిఎం కిసాన్ తో పాటు అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలుచేస్తోంది కూటమి ప్రభుత్వం. కేంద్రం అందించే పెట్టుబడి సాయానికి మరికొంత డబ్బులు జతచేసి రైతులకు అందిస్తోంది. ఇలా ఇప్పటికే ఓ విడత అన్నదాత సుఖీభవ డబ్బులు జమ చేసింది కూటమి ప్రభుత్వం... ఇప్పుడు రెండో విడత నిధుల విడుదలకు సిద్దమయ్యింది.
పీఎం కిసాన్ డబ్బులు విడుదలకు కేంద్రం సిద్దమవగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ డబ్బులను కూడా సిద్దం చేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా నవంబర్ 19న ఈ నిధులను విడుదల చేయనున్నారు. కడప జిల్లా కమలాపురంలో అన్నదాత సుఖీభవ నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొనన్నారు.
అన్నదాత సుఖీభవ ప్రత్యేకతలు
పీఎం కిసాన్ పథకానికి సమాంతరంగా అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలుచేస్తోంది కూటమి ప్రభుత్వం. అంటే పీఎం కిసాన్ డబ్బులతో పాటే అన్నదాత సుఖీభవ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయి. ఇలా కూటమి ప్రభుత్వ ఏర్పాటుతర్వాత రెండో విడత పిఎం కిసాన్-అన్నదాత సుఖీభవ నిధులు విడుదల కానున్నాయి.
అన్నదాత సుఖీభవ పథకం రెండవ విడతలో 46,85,838 రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో రూ.3135 కోట్ల సొమ్మును జమ చేయనుంది ప్రభుత్వం. ఒక్కో రైతు ఖాతాలో కేంద్రం వాటా రూ.2 వేలు, రాష్ట్ర వాటా రూ.5 వేలు చొప్పున మొత్తం 7 వేలు జమ అవుతాయి. రెండు విడతల్లో కలిపి మొత్తం రూ.6309.44 కోట్ల రైతులకు అందనున్నాయి.
రెండో విడతలో కేంద్రం పిఎం కిసాన్ వాటా రూ.792.09 కోట్లు... రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.2342.92 కోట్లు. ఇలా మొత్తం రూ.3135 కోట్లు రేపట్నుంచి రాష్ట్రంలోని అర్హులైన రైతుల ఖాతాల్లో జమ అవుతాయి. పిఎం కిసాన్- అన్నదాత సుఖీభవ కింద మొదటి విడత గత ఆగస్టు నెలలోనే రూ.3174 కోట్ల నిధులు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి.
పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ కార్యక్రమం
నవంబర్ 19న పుట్టపర్తిలో జరిగే సత్యసాయిబాబా శతజయంతి వేడుకల్లోప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పాల్గొంటారు. ఈ కార్యక్రమం అనంతరం నేరుగా కడపజిల్లా కమలాపురం చేరుకుని అన్నదాత సుఖీభవ నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక కేంద్ర మంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఇతర ప్రజాప్రతినిధులు రాష్ట్రవ్యాప్తంగా ఈ అన్నదాత సుఖీభవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
10 వేల పైచిలుకు రైతు సేవా కేంద్రాల్లో నిధుల విడుదల కార్యక్రమాన్ని లైవ్ టెలి కాస్ట్ చేసేలా చర్యలు చేపట్టింది ప్రభుత్వం. రైతుల ఖాతాల్లో నిధుల విడుదల మాత్రమే కాకుండా...వ్యవసాయరంగంలో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు వివరించేలా కార్యక్రమాన్ని రూపొందించాలని సిఎం సూచించారు. అగ్రిటెక్, డిమాండ్ ఉన్న పంటల సాగు, మార్కెటింగ్ సౌకర్యం పెంపు, ప్రకృతి సేధ్యం, భూసార పరీక్షలు, పంట ఉత్పత్తులకు ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా అధిక ధర వచ్చేలా చేయడం వంటి అంశాలపై రైతాంగానికి అవగాహన కలిగించేలా కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఇలా ప్రధాని మోదీ పీఎం కిసాన్, సీఎం చంద్రబాబు అన్నదాత సుఖీభవ నిధులను ఒకేరోజు విడుదల చేయనున్నారు. దీంతో దేశవ్యాప్తంగా అందరు రైతుల ఖాతాల్లో కేవలం రూ.2 వేలు జమ అయితే కేవలం ఏపీ రైతుల ఖాతాల్లో మాత్రం రూ.7 వేలు జమ కానున్నాయి. ఈ డబ్బులు వ్యవసాయ పనుల్లోరైతులకు ఉపయోగపడతాయి.
తెలంగాణలో రైతు భరోసా
తెలంగాణ రైతులకు కూడా అటు కేంద్రం పీఎం కిసాన్, ఇటు రాష్ట్రం రైతు భరోసా కింద పెట్టుబడి సాయం చేస్తుంది. కానీ ఈ రెండు ఒకేసారి రావు. కేంద్రం మూడు విడతల్లో ఏప్రిల్-జూలై, ఆగస్ట్-నవంబర్, డిసెంబర్-మార్చ్ మధ్య మూడు విడతల్లో పీఎం కిసాన్ డబ్బులు జమ చేస్తుంది. ప్రతి విడతలో రెండువేల చొప్పున రూ.6 వేలు జమ అవుతాయి. అదే రైతు భరోసా కింద ఎకరాకు రూ.12,000 (విడతకు రూ.6,000 చొప్పున రెండుసార్లు) జమ అవుతాయి.