- Home
- Business
- Farmers: ఆ గ్రామంలోని రైతులంతా కోటీశ్వరులే, కేవలం కూరగాయలతోనే కోట్లు సంపాదించేస్తున్నారు
Farmers: ఆ గ్రామంలోని రైతులంతా కోటీశ్వరులే, కేవలం కూరగాయలతోనే కోట్లు సంపాదించేస్తున్నారు
రైతు కోట్లు సంపాదించడం అంటే సాధారణ విషయం కాదు. ఒక గ్రామంలో కేవలం రైతులు మాత్రమే జీవిస్తున్నారు. ఆ గ్రామంలో వారు కేవలం వ్యవసాయంతోనే కోటీశ్వరులు అయ్యారు.

ఊరంతా రైతులే
ఎంత కష్టపడినా సంవత్సరానికి సరిపడా డబ్బును సంపాదించలేని వృత్తిగా వ్యవసాయం మారిపోయింది. అందుకే ఎంతోమంది గ్రామాలు విడిచి పట్టణాలకు చేరుకుంటున్నారు. రైతులంతా వాచ్ మెన్లుగా, రోజుకూలీలుగా మారిపోతున్నారు. కానీ మన దేశంలో ఉన్న ఒక గ్రామంలో మాత్రం రైతులే కోటీశ్వరులు. ఆ గ్రామంలో ఉన్న వారంతా కూడా కేవలం కూరగాయలను సాగు చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. వారు 16 కోట్ల రూపాయల వ్యాపారం సాగుతోంది. ఇక్కడున్న 300 కుటుంబాల వారు ఆ 16 కోట్ల వ్యాపారాన్ని పంచుకుంటున్నారు. వారు పాటించే ఆధునిక వ్యవసాయ పద్ధతులే వారి విజయానికి కారణం.
ఏ ఊరు?
కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ జిల్లాలో ఉంది ఎలెవంచెరి అనే చిన్న గ్రామం. ఆ గ్రామంలో 300 కుటుంబాలు జీవిస్తున్నాయి. వారంతా కూడా కూరగాయలనే పండిస్తారు. ఎలివంచెరి గ్రామానికి వెళితే చాలు.. పచ్చగా పెరిగిన పంట పొలాలే కనిపిస్తాయి. అక్కడ దాదాపు 30 రకాల కూరగాయలను పండిస్తారు. ప్రతి ఏడాది 5 టన్నుల కూరగాయలు ఇక్కడ నుంచే చుట్టుపక్కల ప్రాంతాలకు వెళతాయి. అందుకే కేరళలోని అతి పెద్ద కూరగాయల ఉత్పత్తి చేసే గ్రామంగా ఇది పేరుపొందింది.
ఒక సంఘంగా ఏర్పడి
1996లో ఇక్కడ ఒక స్వయం సహాయక రైతు సంఘం ప్రారంభమైంది. ఆ సంఘంలో గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ చేరారు. పంట వేయడం దగ్గర నుంచి మార్కెట్ కు పంటను పంపడం వరకు అన్ని పనులు గ్రామస్తులందరూ కలిపే చేసుకుంటారు. దళారులను ఆశ్రయించరు. ఖర్చులు కలిసి పెట్టుకుంటారు. లాభాలు, నష్టాలు అన్నిటినీ సమానంగానే భరిస్తారు. అందుకే ఏ రైతుకూ అప్పు పెరగదు. అందరు రైతులకి అప్పు సమానంగానే ఉంటుంది. భూమిలేని రైతులు ఇతరుల దగ్గర భూమిని లీజుకు తీసుకొని మరీ కూరగాయలను పండిస్తారు.
ఆర్గానిక్ పద్ధతిలోనే
ఇక్కడ రసాయనాలపై ఆధారపడదు. ఆర్గానిక్ పద్ధతుల్లోనే కూరగాయలను పండించడం వల్ల ఎక్కువ ధరకు ఇవి అమ్ముడవుతాయి. అలాగే భూమి పరీక్షలను ముందుగానే చేయించుకుంటారు. ఆ భూమి, ఆ మట్టి పరిస్థితులకు తగ్గట్టు కూరగాయలను ఎంపిక చేసి అక్కడ పండిస్తారు. దీనివల్ల నష్టం రాదు. ఇక్కడ యువత మొత్తం రైతులు గానే ఉన్నారు. యువత వ్యవసాయంలోకి రావడంతో లాభాలు కూడా మరింతగా పెరిగాయి.
రైతుల జీవితం
మనదేశంలో ఇంకా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు 52 శాతానికి పైగానే ఉన్నాయి. కానీ వారిలో ఎంతోమంది నష్టాలతోనే జీవిస్తున్నారు. అలాంటివారు ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళితే రైతుల ఆదాయం కచ్చితంగా పెరుగుతుంది.