- Home
- Andhra Pradesh
- Rain Alert: రుతుపవనాల రాకపై ఐఎండీ అప్‌డేట్.. ఏపీ, తెలంగాణకు వానలు వచ్చేది అప్పుడేనా?
Rain Alert: రుతుపవనాల రాకపై ఐఎండీ అప్‌డేట్.. ఏపీ, తెలంగాణకు వానలు వచ్చేది అప్పుడేనా?
Weather Update: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు, వడగాలులతో పాటు ఆకస్మిక వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. జూన్ 4న కేరళను తాకనున్న నైరుతీ రుతుపవనాలపై ఐఎండీ తాజాగా కీలక ప్రకటన చేసింది.

విచిత్ర వాతావరణం: ఒకేసారి ఎండలు.. వానలు
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం రూట్ మార్చింది. ఒకే టైంలో ఎండలు దంచికొడుతుంటే, మరోవైపు సడన్ వానలు షాకిస్తున్నాయి. అటు భానుడి భగభగలు, ఇటు ఉరుములు-మెరుపులతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో విభిన్నమైన క్లైమేట్ కండిషన్స్ రికార్డ్ అవుతున్నాయి. ఆదివారం పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉండగా, మరికొన్ని చోట్ల వడగాళ్లు పడే అవకాశముంది. ఇదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో ఎండలు దంచికొట్టనున్నాయి.
రుతుపవనాల రాకపై ఐఎండీ ఏం చెప్పిందంటే?
సాధారణంగా జూన్ 1 కల్లా కేరళను తాకాల్సిన నైరుతీ రుతుపవనాల రాక ఈసారి కాస్త లేట్ కానుంది. మే 26నే వస్తాయని ముందుగా అంచనా వేసిన భారత వాతావరణ శాఖ, తాజాగా ఆ డేట్‌ను జూన్ 4, 5 మధ్యకు మార్చింది. ప్రస్తుతం ఈ గాలులు తమిళనాడులోని కన్యాకుమారి ప్రాంతాన్ని తాకేందుకు అనుకూలంగా ఉన్నాయి.
కేరళకు జూన్ 4న లేదా 5న వస్తే.. మన తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి జూన్ 10 దాటొచ్చని నిపుణులు చెప్తున్నారు. పైగా ఈసారి ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు వచ్చేసరికి గాలుల వేగం తగ్గి, వర్షాల జోరు కాస్త తగ్గే అవకాశం ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి.
ద్రోణుల ఎఫెక్ట్: ఆకాశంలో మేఘాల అలజడి
ప్రస్తుతం మధ్య పాకిస్థాన్ నుండి ఉత్తర కోస్తాంధ్ర వరకు ఒక ద్రోణి విస్తరించి ఉంది. దీనికి తోడు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, లక్షద్వీప్ నుంచి మరో ద్రోణి యాక్టివ్‌గా ఉన్నాయి. ఈ సిస్టమ్స్ వల్ల సముద్ర మట్టం నుంచి దాదాపు 1 కిలోమీటర్ నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు బలమైన మేఘాలు కమ్ముకున్నాయి.
వీటి ప్రభావంతో మే 31 నుంచి జూన్ 3 వరకు కోస్తాంధ్ర, యానాం, రాయలసీమతో పాటు తెలంగాణలో అక్కడక్కడా ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వానలు పడనున్నాయి. ముఖ్యంగా తీరప్రాంతాల్లో గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉంది.
ఏపీ వెదర్ సీన్: రాయలసీమకు వానలు.. 17 మండలాల్లో సెగలు
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉంది. శనివారం అనంతపురం జిల్లా హుస్సేనుపురంలో ఏకంగా 51 మి.మీ రికార్డు స్థాయి వర్షం పడింది.
మరోవైపు దాదాపు 17 మండలాల్లో తీవ్రమైన వడగాలులు వీస్తాయని అలర్ట్ ఇచ్చారు. రాష్ట్రంలో ఎండలు 42°C నుంచి 44°C వరకు రికార్డ్ కావచ్చు. ఉత్తరాంధ్రలో హ్యుమిడిటీ 74 శాతం ఉండటంతో అక్కడ రాత్రి వేళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తెలంగాణ అప్‌డేట్: జూన్ 3 వరకు భగభగలే..
తెలంగాణలో జూన్ 3 వరకు ఎండల తీవ్రత గట్టిగానే ఉండబోతోంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన ప్రకారం.. రాష్ట్రంలో టెంపరేచర్స్ 41°C నుండి 45°C దాకా నమోదయ్యే ఛాన్స్ ఉంది. పగటిపూట ఆకాశం క్లియర్‌గా ఉండి, ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది.
కానీ, ఇది సడన్ వర్షాల సీజన్ కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. సడన్ క్లౌడ్స్ ఫామ్ అయి పిడుగులు పడొచ్చు. అందుకే రైతులు, పశువుల కాపరులు ఉరుములు వచ్చేటప్పుడు చెట్ల కింద, కరెంట్ స్తంభాల పక్కన ఉండకుండా సేఫ్ ప్లేస్‌కు వెళ్లాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

