- Home
- Andhra Pradesh
- రాష్ట్రంలో జంగిల్ రాజ్ పాలన నడుస్తోంది: జగన్.. పుంగూరు దాడి నేపథ్యంలో హైకోర్ట్ కీలక ఆదేశాలు
రాష్ట్రంలో జంగిల్ రాజ్ పాలన నడుస్తోంది: జగన్.. పుంగూరు దాడి నేపథ్యంలో హైకోర్ట్ కీలక ఆదేశాలు
Andhra pradesh: ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. రాజంపేట ఎంపీ పి.వి. మిథున్‌రెడ్డిపై పుంగనూరులో జరిగిన దాడి ఘటనపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మిథున్‌రెడ్డికి ఫోన్ చేసిన జగన్
స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో పుంగనూరులో చోటుచేసుకున్న దాడి ఘటనపై వైఎస్ జగన్ స్పందించారు. వైఎస్సార్సీపీ లోక్‌సభ పక్ష నేత, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. పర్యటన సందర్భంగా ఎదురైన పరిస్థితులు, దాడి జరిగిన తీరు, అక్కడ నెలకొన్న ఉద్రిక్తతల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన జగన్.. పార్టీ నేతలు, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని సూచించారు.
రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తల దూకుడు పెరిగిపోయిందని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల్లో పాల్గొనాల్సిన సమయంలో ప్రత్యర్థి పార్టీల నేతలను లక్ష్యంగా చేసుకోవడం సరికాదన్నారు. రాష్ట్రంలో ప్రజలకు, ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.
ఓటమి భయంతోనే దాడులు చేస్తున్నారన్న జగన్
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతోనే వైఎస్సార్సీపీ నాయకులు, అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని దాడులు, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో ప్రజల మద్ధతు పొందడం కంటే ప్రత్యర్థులను భయపెట్టడానికే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హింసాత్మక రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని జగన్ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య వాతావరణం దెబ్బతింటోందని, పాలన తీరు ‘జంగిల్ రాజ్’ను తలపిస్తోందని మండిపడ్డారు. ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా జరిగేలా చూడాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
పారామిలటరీ బలగాలతో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఒక పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న ఎంపీకే రక్షణ లేకుండా పోయిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. దాడులు జరుగుతున్న సమయంలో పోలీసులు సరైన రీతిలో స్పందించడం లేదని ఆరోపించారు. అధికార పార్టీ తన రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసు వ్యవస్థను ఉపయోగించుకుంటోందని విమర్శించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలకు తావులేకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల యంత్రాంగంపై ఉందని జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పారామిలటరీ బలగాల పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని న్యాయస్థానాల దృష్టికి తీసుకెళ్లి, తమ వద్ద ఉన్న ఆధారాలను సమర్పిస్తామని వెల్లడించారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు భయపడకుండా చట్టబద్ధంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం న్యాయపరమైన మార్గాల్లో పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
పుంగనూరు, రాయచోటిలో ఘటనలు.. హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ
స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన సమయంలోనే పుంగనూరులో ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్సీపీ అభ్యర్థికి మద్ధతుగా నామినేషన్ కార్యక్రమానికి వెళ్తున్న ఎంపీ మిథున్‌రెడ్డి కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగినట్లు వైసీపీ నేతలు ఆరోపించారు. ఈ ఘటనలో ఆయన వాహనంతో పాటు ఇతర పార్టీ నేతలకు చెందిన కార్లు ధ్వంసమైనట్లు వెల్లడించారు. పలువురికి గాయాలయ్యాయని తెలిపారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు.
మరోవైపు, రాయచోటిలో మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి కార్యాలయంపై దాడి చేసి వాహనాలకు నిప్పంటించారని వైఎస్సార్సీపీ జాతీయ ప్రతినిధి షరీఫ్ ఆరోపించారు. ఈ ఘటనలను ప్రస్తావిస్తూ పార్టీ అభ్యర్థులు, కార్యాలయాలకు రక్షణ కల్పించాలని వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఎన్నికల్లో పోటీ చేసే వైఎస్సార్సీపీ అభ్యర్థులకు భద్రత కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం వెంటనే జోక్యం చేసుకుని ఘటనలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని షరీఫ్ డిమాండ్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
స్థానిక ఎన్నికల వేళ పెరిగిన రాజకీయ వేడి
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. నామినేషన్ల దాఖలు, అభ్యర్థుల ప్రచార కార్యక్రమాలతో ప్రధాన పార్టీల మధ్య పోటీ తీవ్రంగా మారింది. ఎన్నికల ప్రక్రియకు తక్కువ సమయం ఉండటంతో పార్టీలు తమ అభ్యర్థుల గెలుపు కోసం వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ క్రమంలో పుంగనూరు, రాయచోటిలో చోటుచేసుకున్న ఘటనలు రాజకీయ చర్చకు దారితీశాయి.

