Proverb: గతికితే అతకదు.. సామెత వెనకాల ఉన్న అసలు అర్థం ఏంటో తెలుసా.?
Proverb: సామెతలు చిన్నగా ఉన్నా వాటిలో ఎంతో అర్థం ఉంటుంది. మోటివేషన్‌తో పాటు జీవిత సారాన్ని విడమరిచి చెబుతుంటాయి. అలాంటి ఒక సామెత గతికితే అతకదు. ఇంతకీ దీని అర్థమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒకప్పుడు పెళ్లి చూపుల్లో ఆచారం
కొన్నేళ్ల క్రితం పెళ్లి చూపులు అంటే ఒక పెద్ద కార్యక్రమం. అబ్బాయి వారి కుటుంబం, బంధువులు కలిసి అమ్మాయి ఇంటికి వెళ్ళేవారు. కానీ, అక్కడ మొదట చూపేది అమ్మాయిని కాదు.. అబ్బాయి ప్రవర్తన, భోజన సమయంలో అబ్బాయి ఎలా కూర్చుంటాడు, ఎలా తింటాడు, ఎలా మాట్లాడతాడు. ఇవన్నీ ఆ కుటుంబం జాగ్రత్తగా గమనించేది. ఎందుకంటే, ఒక మనిషి నిజ స్వభావం భోజన పద్ధతిలో కనిపిస్తుందని వారు నమ్మేవారు.
భోజనం ద్వారా వ్యక్తిత్వ అంచన
అమ్మాయి కుటుంబం ముందుగా విందు ఏర్పాటు చేసేది. అబ్బాయి తినే తీరు, అతని శైలి, చేతి కదలికలు.. ఇవన్నీ ఒక “పరీక్ష” లా ఉండేవి.
* అబ్బాయి శాంతంగా తింటే ఓర్పు కలవాడని.
* అవసరానికి మించి తింటే లోభి అని అర్థం.
* జాగ్రత్తగా తింటే నియంత్రణ గల వ్యక్తి అని భావించేవారు.
ఇది కేవలం భోజనం కాదు.. మనసు అంచనా వేసే పద్ధతి అని అర్థం.
కూర్చునే తీరు కూడా..
* అబ్బాయి కూర్చోవడం కూడా చాలా ప్రాధాన్యం కలిగిన విషయం.
పద్మాసనంలో కూర్చుంటే సౌమ్యుడని, నడుము నిటారుగా ఉంచుకుంటే ఆత్మవిశ్వాసం గలవాడని, మంచి భంగిమతో కూర్చుంటే సంస్కారం ఉన్నవాడని నిర్ణయించేవారు. చిన్న చిట్కాలు కూడా పెద్ద అర్ధం చెప్పేవి.
తినే విధానం – గుణగణాల ప్రతిబింబం
పాతకాలంలో “తినే తీరు” ద్వారా అబ్బాయి గుణాలు తెలుసుకునేవారు. వేళ్ల మధ్య నుంచి అన్నం పడితే దాన్ని లక్ష్మీ దూరం అవుతుందని భావించేవారు. బాగా నమలుతూ తినేవాడు ఓర్పు గలవాడని, తొందరగా తినేవాడు ఆవేశపరుడని, మొదట కారం తినేవాడు కోపిష్టి అని, ప్రతి వంటకం రుచి చూసేవాడు సమతుల్యమైన మనస్తత్వం కలవాడని చెప్పేవారు. ఈ విధంగా ఒక భోజనం ద్వారా మొత్తం మనిషిని అంచనా వేసేవారు.
“గతికితే అతకదు” అంటే..
విందు అనంతరం అమ్మాయి వారు ఒక నిర్ణయానికి వచ్చేవారు. అబ్బాయి ప్రవర్తన, భోజన తీరు, మాటతీరు చూసి “సంబంధం కుదరుతుందా?” అని తేల్చేవారు. దీంతో ఈ నానుడి పాపులర్ అయ్యింది. “గతికితే అతకదు” అంటే, “తినే తీరు నచ్చకపోతే, సంబంధం కుదరదు” అని అర్థం. ఇది కేవలం భోజనం గురించి మాత్రమే కాదు.. వ్యక్తిత్వం, సంస్కారం, గుణగణాలు అన్నీ కలిపి చూసే ఒక పాత పద్ధతి.