- Home
- Andhra Pradesh
- Andhra Pradesh : లక్ష కోట్ల పెట్టుబడులు, లక్షల ఉద్యోగాలు : ఏపీ భవిష్యత్ నే మార్చేలా చంద్రబాబు మాస్టర్ ప్లాన్
Andhra Pradesh : లక్ష కోట్ల పెట్టుబడులు, లక్షల ఉద్యోగాలు : ఏపీ భవిష్యత్ నే మార్చేలా చంద్రబాబు మాస్టర్ ప్లాన్
ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి కోసం నారా చంద్రబాబు నాయుడు మాస్టర్ ప్లాన్ సిద్దంచేశారు. లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి, లక్షలాదిమందికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ఈ ప్లాన్ ను రెడీ చేశారు. ఇదేంటో తెలుసా?

ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు చంద్రబాబు దృష్టి
Nara Chandrababu Naidu : దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలని అంటారు... ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సామెతను ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డిఏలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామి... ఇంకా చెప్పాలంటే చంద్రబాబు మద్దతుతోనే మోదీ సర్కార్ మూడోసారి అధికారం చేపట్టింది. దీంతో సహజంగానే కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబుకు పలుకుబడి ఎక్కువగా ఉంది. ఇదే మంచి సమయం కాబట్టి ఆంధ్ర ప్రదేశ్ భారీగా నిధులు తెచ్చుకునే పనిలో ఉన్నారు చంద్రబాబు.
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంతో పాటు పోలవరం ప్రాజెక్టుకు ఆర్థిక సాయం చేస్తోంది. ఇంకా అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాల కోసం కూడా కేంద్రం సహాయం చేస్తోంది. ఈ క్రమంలోనే ఏరోస్పెస్, డిఫెన్స్ రంగాల్లో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకువచ్చే దిశగా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే సరికొత్త ఏరోస్పేస్, డిఫెన్స్ విధానాన్ని తీసుకువచ్చింది కూటమి సర్కార్.
ఏపీ ఏరోస్పేస్-డిఫెన్స్ పాలసీ-4.0
ప్రస్తుతం ప్రపంచం పోకడ చూస్తుంటే ఈ ఏరోస్పేస్-డిఫెన్స్ రంగాలకు మంచి భవిష్యత్ ఉందని అర్థమవుతోంది. కాబట్టే ఏపీ సీఎం చంద్రబాబు వీటిపై ఫోకస్ పెట్టారు. ఈ రంగాల్లో పెట్టుబడుల కోసం ఇప్పటికే అనేక ప్రయత్నాలు చేస్తోంది కూటమి ప్రభుత్వం.
ఇటీవల స్వయంగా చంద్రబాబు నాయుడే కేంద్ర రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో సమావేశమై ఏపీలో ఈ రంగాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాల గురించి వివరించారు. రాయలసీమ ప్రాంతం రక్షణ రంగ వస్తువుల తయారీకి అనువుగా ఉంటుంది... కాబట్టి అక్కడ అలాంటి పరిశ్రమల ఏర్పాటుపై ఆలోచించాలని కేంద్ర మంత్రిని కోరారు. ఈ క్రమంలోనే చంద్రబాబు బెంగళూరులోని HAL ను ఏపీకి తరలించాలని కేంద్రాన్ని కోరినట్లు ప్రచారం జరిగింది… ఇది వేరేవిషయం అనుకొండి.
ఇక ఏరోస్పేస్ రంగంలో కూడా పెట్టుబడులకు ఏపీలో అనేక అనువైన ప్రాంతాలున్నాయని సీఎం చంద్రబాబు పలుమార్లు వెల్లడించారు. తాజాగా ఈ ఏరోస్పేస్-డిఫెన్స్ రంగాల్లో రాబోయే ఐదేళ్లలో అంటే 2025 నుండి 2030 వరకు ఎలా వ్యహరించాలన్నదానిపై కూటమి ప్రభుత్వం క్లారిటీతో ఉంది... అందుకోసమే ఏరోస్పేస్-డిఫెన్స్ పాలసీని తీసుకువచ్చింది.
ఈ ఏరోస్పేస్-డిఫెన్స్ పాలసీ 4.0 లక్ష్యాలివే
ఆంధ్ర ప్రదేశ్ ను పాలిస్తున్న ప్రస్తుత కూటమి ప్రభుత్వం పారిశ్రామిక రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అందులోనూ భవిష్యత్ లో భారీ పెట్టుబడులకు అవకాశాలున్న రంగాలను ఎంచుకుంటోంది... అందులో భాగమే ఏరోస్పేస్-డిపెన్స్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడం. రాబోయే ఐదేళ్లలో ఈ రంగంలో లక్ష కోట్ల పెట్టుబడులను రాబట్టడమే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఏరోస్పేస్ రంగంలో మంచి ఉద్యోగావకాశాలు ఉంటాయి. రక్షణ రంగంలోనూ అంతే. కాబట్టి ఈ రంగంలో పెట్టుబడుల వచ్చాయంటే ఆటోమెటిగ్గా ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చినట్లే. ఇలా వచ్చే ఐదేళ్లలో లక్షకు పైగా ప్రత్యక్షంగా ఉద్యోగాలను కల్పించడంతో పాటు పరోక్షంగా మరింతమందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. ఇలా పెట్టుబడులకు పెట్టుబడులు, ఉద్యోగాలకు ఉద్యోగాలు సాధించడమే ఏపీ ఏరోస్పేస్-డిఫెన్స్ పాలసీ లక్ష్యమని కూటమి ప్రభుత్వం చెబుతోంది.
ఏపీలో ఏరోస్పేస్ సంస్థల ఏర్పాటుకు అనువైన ప్రాంతాలివే..
ఆంధ్ర ప్రదేశ్ లో ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు సిద్దమైన చంద్రబాబు ప్రభుత్వం ఇందుకోసం తగిన ల్యాండ్ బ్యాంక్ ను కూడా సిద్దం చేసుకుంటోంది. ఇప్పటికే 23 వేల ఎకరాలను కూడా గుర్తించినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇలా ఏరోస్పేస్-డిఫెన్స్ క్లస్టర్లు, పార్కులు, హబ్ లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది చంద్రబాబు సర్కార్.
ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు అనేకసార్లు లేపాక్షి ప్రాంతంలో ఏరోస్పేస్ పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు ప్రకటించారు. లేపాక్షి-మడకశిర క్లస్టర్ లో ఈ రంగంలో పెట్టుబడులకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఏపీలో డిఫెన్స్ సంస్థల ఏర్పాటుకు అనువైన ప్రాంతాలివే..
కర్నూల్-ఓర్వకల్లు ప్రాంతాల్లో రక్షణ రంగ ఉత్పత్తుల తయారికి సంబంధించిన పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అంటే మానవరహిత విమానాలు, డ్రోన్ల తయారీ పరిశ్రమలకు ఈ ప్రాంతంలో భూములు కేటాయించనుంది.
ఇక జగ్గయ్యపేట-దొనకొండ ప్రాంతంలో యుద్ద సమయాల్లో ఉపయోగించే పేలుడు ఆయుధాలు మిస్సైల్స్ వంటివాటి తయారీ పరిశ్రమల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇక ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం-శ్రీకాకుళం ప్రాంతంలో నావల్ క్లస్టర్ ఏర్పాటుకు సిద్దమయ్యింది.