ఈ చాక్లెట్ తింటే ఏమౌతుందో తెలుసా?
చాక్లెట్ ను ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు.. ప్రతి ఒక్కరూ చాక్లెట్ ను ఇష్టంగా తింటుంటారు. ముఖ్యంగా డార్క్ చాక్లెట్ ను. కానీ ఈ చాక్లెట్ ను తింటే ఏమౌతుందో తెలుసా?
చాక్లెట్ ప్రతి ఒక్కరికీ ఇష్టమే. ముఖ్యంగా చిన్న పిల్లలు, టీనేజ్ పిల్లలు చాక్లెట్లను బాగా తింటుంటారు. మిల్క్ చాక్లెట్, డార్క్ చాక్లెట్ అంటూ ఎన్నో రకాల చాక్లెట్లు అందుబాటులో ఉంటాయి. కానీ అన్ని రకాల చాక్లెట్లలో డార్క్ చాక్లెట్లనే ఎక్కువగా తింటుంటారు. వీటి టేస్ట్ అంత బాగుంటుంది మరి. మీకు తెలుసా? డార్క్ చాక్లెట్ మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. నిజానికి డార్క్ చాక్లెట్ లో ఎక్కువ మొత్తంలో కోకో ఉంటుంది. అలాగే దీనిలో యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. అందుకే దీన్ని తినడం వల్ల ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. అసలు డార్క్ చాక్లెట్లను తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
గుండెకు మేలు: డార్క్ చాక్లెట్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన గుండెకు, ధమనులకు ప్రయోజనకరంగా ఉంటాయి. అలాగే దీనిలో శోథ నిరోధక లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి శరీర మంటను తగ్గిస్తాయి. ధమనులను ఆరోగ్యంగా ఉంచుతాయి. డార్క్ చాక్లెట్ లో ఉండే పాలీఫెనాల్స్ శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. అందుకే ఇది గుండె జబ్బుల నుంచి మనల్ని రక్షిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.
రక్తపోటు: డార్క్ చాక్లెట్లో ఫ్లేవనాయిడ్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి ధమనులను సడలించడానికి సహాయపడతాయి. దీనివల్ల బ్లడ్ ప్రెజర్ నార్మల్ గా ఉంటుంది. ఎక్కువయ్యే ఛాన్స్ ఉండదు. క్లీవ్ల్యాండ్ క్లినిక్ ప్రకారం.. ఫ్లేవనాయిడ్లు నైట్రిక్ ఆక్సైడ్ ను విడుదల చేయడానికి సహాయపడతాయి. ఇది ధమనులను సడలిస్తుంది. అలాగే రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది.దీన్ని తింటే అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. దీంతో మీకు స్ట్రోక్, గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
మెదడుకు మేలు : డార్క్ చాక్లెట్ లో ఉండే ఫ్లేవనాయిడ్స్ కూడా మన మెదడుకు మేలు చేస్తాయి. ఇవి రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి, దీంతో మన మెదడు బాగా పనిచేస్తుంది. దీనివల్ల జ్ఞాపకశక్తి బలహీనత వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.
చర్మానికి మేలు: డార్క్ చాక్లెట్ యాంటీఆక్సిడెంట్లకు మంచి వనరులు. ఇవి సూర్యరశ్మి రక్షణతో పాటుగా ఆక్సీకరణ నష్టం నుంచి కూడా చర్మాన్ని కాపాడుతాయి. అందుకే డార్క్ చాక్లెట్ తినడం వల్ల సూర్యరశ్మి వల్ల చర్మం దెబ్బతినకుండా ఉంటుంది. అలాగే ఇది మీ రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. మీ చర్మం మెరిసేలా చేస్తుంది.