బెండకాయ కూరను తింటే ఏం జరుగుతుందో తెలుసా?
రకరకాల కూరగాయల్లో బెండకాయ ఒకటి. చాలా మందికి బెండకాయ అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఇది జిగటగా ఉంటుంది. కానీ బెండకాయ మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. అసలు బెండకాయను తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయంటే?
బెండకాయ ఆరోగ్యకరమైన కూరగాయ. దీనిలో విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. బెండకాయలో ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ సమ్మేళనాలతో పాటుగా యాంటీ ఆక్సిడెంట్లు కూడా మెండుగా ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతగానో సహాయపడతాయి. బెండకాయ మన జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. దీన్ని తింటే మలబద్దకం సమస్య తగ్గిపోతుంది.
బెండకాయలో విటమిన్ సి, విటమిన్ కె లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ కూరగాయలో ఉండే విటమిన్ కె1 కొవ్వులో కరిగే ఒక విటమిన్. ఇది మన శరీరంలో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది. ఇకపోతే బెండకాయలో ఉండే ఫైబర్.. కొలెస్ట్రాల్ శోషణను తగ్గిస్తుంది. అలాగే గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా చాలా వరకు తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.
బెండకాయలో పాలీఫెనాల్స్, ఫైబర్ వంటి సమ్మేళనాలు మెండుగా ఉంటాయి. ఇవి మన రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయి. ఇది డయాబెటిస్ ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. డయాబెటీస్ ఉన్నవారు బెండకాయలను తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.
బెండకాయ మన ఎముకలను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా బాగా సహాయపడుతుంది. ఈ కూరగాయలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో బీటా కెరోటిన్,లెటిన్, క్సాంథిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి మన కంటిచూపును పెంచుతాయి. కళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.
బెండకాయలో విటమిన్ సి మెండుగా ఉంటుంది. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే సీజనల్ వ్యాధులు, ఇన్ఫెక్షన్లు, అంటువ్యాధులు, ఇతర రోగాలకు మనల్ని దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. బెండకాయలో ఉండే ఫైబర్ మీరు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఈ ఫైబర్ మీరు అతిగా తినకుండా చేసి బరువును నియంత్రిస్తుంది.
బెండకాయంలో విటమిన్ ఎ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇలాంటి బెండకాయను రోజూ తినడం వల్ల వయస్సు-సంబంధిత మాక్యులర్ క్షీణతను, కంటిచూపు మందగించడం వంటి సమస్యల ప్రమాదం తగ్గుతుంది. బెండకాయలో యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు ఉంటాయి. ఇది శరీర మంటను తగ్గించడానికి , ఆర్థరైటిస్ లేదా గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధులొచ్చే రిస్క్ ను కూడా తగ్గించడానికి సహాయపడుతుంది.
బెండకాయలోని విటమిన్ ఎ, విటమిన్ సితో పాటుగా యాంటీ ఆక్సిడెంట్లు మన చర్మం ఆకృతిని మెరుగుపరచడానికి, అకాల వృద్ధాప్యం, ముడతలను తగ్గించడానికి బాగా సహాయపడతాయి.