కాల్చిన శెనగలు తింటే ఏమౌతుందో తెలుసా?
వారానికి ఒకసారైనా శెనగలు పెనంపై కాల్చి తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఈ శెనగల్లో కొంచెం ఉప్పు, కొంచెం కారంపొడి వేసి తింటే టేస్ట్ అదిరిపోతుంది. అయితే కాల్చిన శెనగలను తింటే ఏమౌతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
శెనగల్లో ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. చాలా మంది వీటిని వానాకాలం, చలికాలంలో ఎక్కువగా తింటుంటారు. వీటిని ఉడకబెట్టి కాకుండా.. కాల్చుకునే ఎక్కువగా తింటుంటారు. ఈ శెనగల్లో ఉండే ఈ రెండు పోషకాలు మన శరీరానికి చాలా అవసరం. దీనిలో ఉండే ప్రోటీన్ మన శరీరంలో కణాలను నిర్మిస్తుంది. అలాగే వాటిని మరమ్మత్తు చేయడానికి సహాయపడుతుంది.
ఇకపోతే శెనగల్లో ఉండే ఫైబర్ కంటెంట్ మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. ఇది మన జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే చలికాలంలో వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. అసలు కాల్చిన శెనగలను తినడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
జీర్ణ ఆరోగ్యానికి మంచిది: కాల్చిన శెనగల్లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు చాలా చాలా అవసరం. మీరు గనుక కాల్చిన శెనగలను రెగ్యులర్ గా తిన్నట్టైతే మీకు మలబద్ధకం, కడుపునొప్పి వంటి సమస్యలు నయమైపోతాయి.
రక్తహీనత నుంచి ఉపశమనం: చాలా మంది ఆడవారికి రక్తహీనత సమస్య ఉంటుంది. ఇలాంటి వారికి కాల్చిన శెనగలు మంచి ప్రయోజనకరంగా ఉంటాయి. అవును వీటిలో ఐరన్ మెండుగా ఉంటుంది. వీటిని మీరు రెగ్యులర్ గా తింటే మీ శరీరంలో రక్త పరిమాణం పెరిగి రక్తహీనత సమస్య తగ్గిపోతుంది.
ఎముకలు బలపడతాయి: కాల్చిన శెనగలు మన ఎముకలను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడతాయి. మన ఎముకల్ని ఆరోగ్యంగా ఉంచడానికి పాలు, పెరుగు ఎలా అయితే సహాయపడతాయో కాల్చిన శెనగలు కూడా అలాగే సహాయపడతాయి. వీటిని రోజూ తింటే మీ ఎముకలు బలంగా ఉంటాయి.
కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే గుండెకు సంబంధించిన సమస్యలు వస్తాయి. అయితే మీరు వేయించిన శెనగాలను ప్రతిరోజూ తింటే ఈ చెడు కొలెస్ట్రాల్ తగ్గడం ప్రారంభమవుతుంది. ఇది మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
బ్లడ్ షుగర్ లెవల్స్: కాల్చిన శెనగల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అలాగే దీనిలో ప్రోటీన్లు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. వీటిని తింటే మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. మీకు డయాబెటీస్ ఉంటే వీటిని తింటే మంచి ప్రయోజనం పొందుతారు.
బరువును అదుపులో: కాల్చిన శెనగల్లో కూడా ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. వీటిని మీరు రోజూ తింటే కడుపు తొందరగా నిండుతుంది. దీంతో మీకు అతిగా ఆకలి వేయదు. ఎక్కువగా తినలేరు. ఇది మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి ఎంతగానో సహాయపడుతుంది.
వెన్నునొప్పి నుంచి ఉపశమనం: బలహీనత వల్ల ఆడవారికి తరచుగా వెన్నునొప్పి వస్తుంటుంది. అయితే మీరు రోజూ రెండు గుప్పెడ్ల కాల్చిన శెనగలు తింటే వెన్నునొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.