పండు తినాలా? జ్యూస్ తాగాలా? ఆరోగ్యానికి ఏది మేలు? క్లారిటీ ఇదిగో
పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అయితే పండ్లను ఏ సమయంలో తినాలి? ఎలా తినాలి అన్న అనుమానాలు చాలా మందిలో ఉంటాయి. వాటిని క్లారిఫై చేసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి.

పండ్లు మన ఆరోగ్యానికి చాలా మంచివి. సరిగ్గా తినకపోతే వాటిలోని పోషకాలు పూర్తిగా అందవు. ఎలాపడితే అలా తింటే అసలుకే మోసం వస్తుంది. తప్పుగా తింటే ఆరోగ్యానికి హాని కూడా కలగవచ్చు. పండ్లను సరిగ్గా ఎలా తినాలో తెలుసుకోవడం ముఖ్యం. పండ్లు తినడానికి సరైన మార్గం ఏమిటో పోషకాహార నిపుణులు Prashant Desai మాటల్లో తెలుసుకుందాం.
పండ్లు తినడానికి సరైన మార్గం ఏమిటి?
ఈ పండుని తొక్కతో సహా తినేయండి
కొన్ని పండ్లని మొత్తంగా తొక్కతో సహా తినడం మంచిది. తొక్కలో ఫైబర్, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియ, ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఉదాహరణకు ఆపిల్ తొక్కలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండెకు మంచివి. శరీరం నుంచి విష పదార్థాలను బయటకు పంపడంలో సహాయపడతాయి.
ఈ పండ్లను జ్యూస్‌గా తాగొద్దు
పండ్ల రసాలు, జ్యూస్‌లు తాగడం ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది. అయితే, పండ్లను రసంగా తీసుకోవడం వల్ల వాటిలోని ఫైబర్ పోతుంది. ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి, కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది. జ్యూస్ తాగడం వల్ల రక్తంలో చక్కెర వేగంగా పెరుగుతుంది. ఎందుకంటే జ్యూస్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఎక్కువగా ఉంటుంది. పండు తింటే GI తక్కువగా ఉండి.. చక్కెర స్థాయి నెమ్మదిగా పెరుగుతుంది.
ఖాళీ కడుపుతో పండ్లు తినకండి
ఖాళీ కడుపుతో పండ్లు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. ఇది శరీరానికి హానికరం. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి. పండ్లలో సహజ చక్కెర (ఫ్రక్టోజ్) ఉంటుంది. ఇది ఇతర ఆహార పదార్థాలు లేకుండా తింటే రక్తంలో చక్కెరను వెంటనే పెంచుతుంది. కాబట్టి, పండ్లను నట్స్, పెరుగు లేదా పనీర్ లాంటి ఇతర ఆహార పదార్థాలతో తినడం మంచిది. దీనివల్ల చక్కెర స్థాయి నెమ్మదిగా పెరుగుతుంది.
పిల్లలకు జ్యూస్‌లు ఇవ్వకండి
పిల్లలకు పండ్ల రసం ఇవ్వడం కంటే పండు ఇవ్వడం మంచిది. పండులో జ్యూస్ కంటే ఎక్కువ ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. పండు తినడం వల్ల పిల్లలకు పూర్తి పోషకాలు అందుతాయి. ఇది వారిని ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుంది. జ్యూస్ త్వరగా ఆకలిని పెంచుతుంది.
సమతుల ఆహారంలో పండ్లను భాగం చేసుకోండి
పండ్లను మీ దినచర్యలో ముఖ్యమైన భాగంగా చేర్చుకోండి. అయితే, సరైన సమయంలో, సరైన పరిమాణంలో తినండి. పండ్లు తిన్న తర్వాత కొంత సేపు నీరు తాగకండి. ఎందుకంటే ఇది జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. షుగర్ పేషెంట్లు డాక్టర్లు సూచించిన పండ్లను మాత్రమే తినడం మంచిది. చక్కెర స్థాయిలను అమాంతం పెంచే పండ్లను డయాబెటిస్ ఉన్నవారు తినకపోవడం మంచిది.

