వేడి వేడి ఆహారాలను ఫ్రిజ్ లో పెడితే ఏమౌతుందో తెలుసా?
చాలా మంది వేడివేడి పాలను తీసుకెళ్లి ఫ్రిజ్ లో పెట్టేస్తుంటారు. ఒక్క పాలనే కాదు వేరే వేడి ఫుడ్స్ ను కూడా పెడుతుంటారు. కానీ ఇది మంచి అలవాటు అస్సలు కాదు. ఎందుకంటే?
ఫ్రిజ్ లో మనం ఎన్నో రకాల ఆహార పదార్థాలను పెట్టేస్తుంటాం. అందులో చల్లనివి ఉంటాయి. వేడివీ ఉంటాయి. కానీ ఫ్రిజ్ లో పొరపాటున కూడా వేడి పదార్థాలను అస్సలు పెట్టకూడదు. వేడి ఆహారాన్ని ఫ్రిజ్ లో పెట్టడం వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతాయని నిపుణులు అంటున్నారు. ఇది ఫ్రిజ్ లో ఉన్న ఇతర ఆహారాలపైనే కాకుండా.. మన ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావాన్ని చూపెడుతుంది. అసలు ఫ్రిజ్ లో వేడి ఆహారాలను పెట్టడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఫ్రిజ్ ఉష్ణోగ్రత పెరుగుతుంది
వేడి వేడి ఫుడ్స్ ను నేరుగా ఫ్రిజ్ లో పెట్టడం వల్ల ఫ్రిజ్ లోపలి ఉష్ణోగ్రత పెరుగుతుంది. నార్మల్ గా ఫ్రిజ్ ఉష్ణోగ్రత 4 °C (39 °F) గా ఉంటుంది. అయితే ఫ్రిజ్ లో వేడి ఫుడ్స్ ను పెట్టడం వల్ల ఈ ఉష్ణోగ్రత అస్థిరంగా ఉంటుంది. ఇది మీ ఫ్రిజ్ ను తొందరగా పాడయ్యేలా చేస్తుంది.
ఆహార పదార్థాలు త్వరగా చెడిపోతాయి
వేడి ఫుడ్స్ ను ఫ్రిజ్ లో పెట్టడం వల్ల ఫ్రిజ్ లోపలి ఉష్ణోగ్రత అసమతుల్యంగా మారుతుంది. దీనివల్ల ఫ్రిజ్ లో ఉంచిన ఇతర ఆహారాలు చాలా త్వరగా చెడిపోతాయి. ఉష్ణోగ్రత 4 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంటే ఆహారాలలో బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములు వేగంగా పెరుగుతాయి. వీటిని తిన్న మనకు లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయి.
ఆహార పదార్థాల నాణ్యతను ప్రభావితం అవుతుంది
వేడి వేడి ఆహారాలను ఫ్రిజ్ లో పెట్టడం వల్ల ఫుడ్స్ నాణ్యత, రుచి ప్రభావితం అవుతాయి. వేడి ఆహారం చల్లబడేటప్పుడు కుదించబడుతుంది. అలాగే దాని ఆకృతి, రుచి రెండూ ప్రభావితం అవుతాయి. ఇది ఆహారలోని పోషకాలను కూడా తగ్గిస్తుంది.
ఫ్రిజ్ వెంటిలేషన్ ను ప్రభావితం చేస్తుంది
హాట్ ఫుడ్ ఫ్రిజ్ వెంటిలేషన్ ను కూడా ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. వేడి ఆహారాన్ని ఫ్రిజ్ లో పెట్టినప్పుడు వెంటిలేషన్ వ్యవస్థ ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. ఇది ఫ్రిజ్ శక్తి వినియోగాన్ని పెంచుతుంది. అలాగే ఫ్రిజ్ జీవితకాలాన్ని కూడా తగ్గిస్తుంది.
ఆహారాలు చెడిపోతాయి
వేడి వేడి ఆహారాలను వెంటనే ఫ్రిజ్ లో పెట్టడం వల్ల ఫ్రిజ్ లో ఉంచిన ఇతర ఆహారాలు పాడయ్యిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆహారం చాలా వేడిగా ఉంటే ఫ్రిజ్ లోపల ఆవిరి, తేమ ఉత్పత్తి అవుతాయి. ఇది ఇతర ఆహారాలను పాడు చేస్తుంది. అలాగే వేడి ఆహారాన్ని తినడం వల్ల ఇతర ఆహారాలతో సంక్రమణ ప్రమాదం పెరుగుతుంది.అందుకే ఎప్పుడైనా సరే వేడి వాటిని ఫ్రిజ్ లో పెట్టాలనుకుంటే వాటిని పూర్తి చల్లబర్చిన తర్వాతే ఫ్రిజ్ లో పెట్టండి.