పాలలో నానబెట్టిన ఖర్జూరాలను తింటే ఏమౌతుందో తెలుసా?
ఖర్జూరాల్లో నేచురల్ షుగర్స్ తో పాటుగా ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తింటే మన ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. వీటిని అలాగే కాకుండా.. పాలలో నానబెట్టి తింటే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
ఖర్జూరాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చాలా మంది వీటిని అలాగే తింటుంటారు. కానీ వీటిని రాత్రంతా పాలలో నానబెట్టి ఉదయాన్నే తింటే మీరు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. అవును ఇలా ఖర్జూరాలను తినడం వల్ల మీ జీర్ణశక్తి పెరుగుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఇంతేకాదు ఇలా తినడం వల్ల మీకు బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి. వాటిలో కొన్నిటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
పోషకాల శోషణ: ఖర్జూరాలు పోషకాల శోషణను పెంచడానికి బాగా సహాయపడుతుంది. మీరు ప్రతిరోజూ ఉదయం పరిగడుపున పాలలో నానబెట్టిన ఖర్జూరాలను తింటే మీ జీర్ణక్రియతో పాటుగా పోషకాల శోషణను పెంచే గట్ బ్యాక్టీరియా మెరుగుపడుతుంది.
మెరుగైన జీర్ణశక్తి: రాత్రంతా పాలలో ఖర్జూరాలను నానబెట్టడం వల్ల అవి ఉదయానికల్లా మృదువుగా అవుతాయి. ఇది పేగులకు అంటుకునే చిన్న చిన్న ముక్కలుగా విడిపోవడానికి సహాయపడుతుంది. దీనివల్ల మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
బెటర్ హార్ట్ హెల్త్: ఖర్జూరాల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి ఖర్జూరాలను పాలలో రాత్రంతా నానబెట్టి ఉదయం తినడం వల్ల మీ గుండె అద్బుతంగా పనిచేస్తుంది. ఇవి మీ గుండెపనితీరును మెరుగపరుస్తుంది. అలాగే శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గిస్తాయి.
బలమైన ఎముకలు : ఖర్జూరాల్లో కాల్షియం మెండుగా ఉంటుంది. ఇది మన ఎముకలను బలంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. పాలలో నానబెట్టిన ఖర్జూరాలను తినడం వల్ల మీకు బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.
నియంత్రిత చక్కెర స్థాయిలు: ఖర్జూరాలు డైటరీ ఫైబర్ కు మంచి మూలం. ఇవి గ్లూకోజ్ శోషణను, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా కాపాడేందుకు సహాయపడతాయి. కాకపోతే వీటిలో నేచురల్ షుగర్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కాబట్టి వీటిని డయాబెటీస్ పేషెంట్లు అతిగా తినకూడదు.
నియంత్రిత బరువు: ఖర్జూరాల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. అలాగే అవసరమైన చిరుతిండిని తినే అవకాశాలను కూడా తగ్గిస్తాయి. ఇవి మీరు బరువు తగ్గడానికి సహాయపడతాయి.