హెల్తీ లైఫ్ స్టైల్ కోసం చాలామంది ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా రైస్ తినడం మానేసి చపాతీ వైపు మళ్లుతుంటారు. కొందరైతే కొంచెం కొంచెం రెండూ తినేస్తుంటారు. మరి అన్నం, చపాతీ కలిపి తింటే ఏమవుతుంది? నిపుణులు ఏమంటున్నారో ఇక్కడ చూద్దాం.
ఆరోగ్యంగా ఉండడానికి ఆహారం ఎంతముఖ్యమో అందరికీ తెలుసు. మంచి ఆహారం తీసుకోవడంతోపాటు తినే మోతాదు కూడా కచ్చితంగా దృష్టిలో ఉంచుకోవాలి. ప్రస్తుతం పెరుగుతున్న వ్యాధుల కారణంగా చాలామంది అన్నంకి బదులు చపాతీ తింటున్నారు. అయితే రెండూ కలిపి తినేవాళ్లు కూడా లేకపోలేదు. మరి అన్నం, చపాతీ కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
అన్నం, చపాతీ కలిపి తింటే ఏమవుతుంది?
అన్నం, చపాతీ రెండింటిలోనూ కార్బోహైడ్రేట్లు ఎక్కువ. గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువే. అందుకే ఈ రెండూ కలిపి తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని చెబుతున్నారు నిపుణులు. ఒక కప్పు అన్నం ఒక చపాతీతో సమానం. ఒకవేళ ఎవరైనా ఒక కప్పు అన్నంతో రెండు చపాతీలు తింటే, ఒకేసారి దాదాపు 500 గ్రాముల కార్బోహైడ్రేట్లు శరీరంలోకి వెళ్తాయి. దీనివల్ల అవసరమైన దానికంటే చాలా ఎక్కువ తీసుకున్నట్లు అవుతుంది.
అన్నం, రోటీ కలిపి తింటే జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. ఒకేసారి అన్నం, రోటీ తింటే జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్, అసిడిటీ సమస్యలు పెరుగుతాయి. రోటీ తింటే చాలామందికి అసిడిటీ కూడా వస్తుంది. అలాంటప్పుడు ఒక కప్పు అన్నం తినడం మంచిది. లేదా చపాతీ తినడం మంచిది. రెండూ తినాలంటే 4-5 గంటల విరామం ఉండాలి.
తక్కువ అన్నం, ఎక్కువ కూరగాయలు తినండి. దీనివల్ల శరీరానికి కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ఖనిజ లవణాల సమతుల్యత సరిగ్గా ఉంటుంది. అధిక కొలెస్ట్రాల్, రక్తపోటుతో బాధపడేవాళ్లు కూడా అన్నం, రోటీ కలిపి తినకూడదు. బ్రౌన్ రైస్, ఓట్స్ లాంటివి తినవచ్చు.
గ్లూటెన్ అలర్జీ :
కొందరికి గ్లూటెన్ అలర్జీ ఉంటుంది. వీళ్ళు చపాతీ తిన్న వెంటనే గ్యాస్, ఎసిడిటీతో బాధపడతారు. అలాంటి సమస్య ఉంటే రోటీకి బదులు అన్నం తినడం మంచిది. ఇతర కడుపు సమస్యలతో బాధపడేవాళ్లు కూడా చపాతీకి బదులు అన్నం తినవచ్చు.
డయాబెటిస్ :
రాత్రిపూట అన్నం తింటే బ్లడ్ షుగర్ పెరుగుతుందని చాలామంది అనుకుంటారు. కానీ దీనికి ఎలాంటి ఆధారమూ లేదని కొందరు నిపుణులు చెబుతున్నారు. డయాబెటిస్ ఉన్నవాళ్లు రాత్రిపూట అన్నం తినొచ్చట. కానీ ముందుగా డాక్టర్ సలహా తీసుకోవాలి. వారు చెప్పిన మోతాదులో అన్నం తినండి. అప్పుడు ఆరోగ్యంగా ఉంటారు.
