గర్భిణులు ఖర్జూరం తినొచ్చా?
గర్భిణులు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వేటిని పడితే అవి తినకూడదు. ఇకపోతే ఖర్జూరాలు మంచి పోషకాహారం. ఇది మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే గర్బిణులు ఖర్జూరాలను..
గర్భం దాల్చినప్పుడు ఆడవారికి కొన్ని రకాల ఆహారాలను తినాలనిపిస్తుంటుంది. ముఖ్యంగా స్వీట్స్ ను ఎక్కువగా తినాలనుకుంటారు. అలాగే గర్బిణులు ఎక్కువగా తినాలనిపించే ఆహారాల్లో ఖర్జూరాలు కూడా ఉన్నాయి. గర్భిణీ స్త్రీలు తమ కోరికలను తీర్చుకోవడానికి తినగలిగే అలాంటి డ్రై ఫ్రూట్స్ లో ఖర్జూరాలు ఒకటి. ప్రెగ్నెన్సీ సమయంలో ఖర్జూరాలను తినడం ఆరోగ్యానికి మంచిదేనంటున్నారు ఆరోగ్యనిపుణులు.
ఖర్జూరాల్లో చక్కెర పుష్కలంగా ఉంటుంది. కానీ వీటిలో పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం, రాగి వంటి ఎన్నో రకాల పోషకాలు కూడా ఉంటాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. గర్భిణీ స్త్రీలు ఖర్జూరం తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఖర్జూరాన్ని తినడం వల్ల ప్రసవానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వీటిలో విటమిన్ సి, విటమిన్ బి1, విటమిన్ బి2, విటమిన్ బి3, విటమిన్ బి5ఎ1 వంటి విటమిన్లతో పాటు క్యాల్షియం, ఐరన్, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. గర్భిణులు ఖర్జూరం తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
అలసట, బలహీనత
గర్భధారణ సమయంలో అలసట, బలహీనత నుంచి బయటపడటానికి ఖర్జూరాలు ప్రయోజనకరంగా ఉంటాయి. విటమిన్లు, ప్రోటీన్లు, ఇతర యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఖర్జూరాలను తినడం వల్ల గర్భిణులకు శక్తి అందుతుంది.
గుండె ఆరోగ్యం
పాలలో నానబెట్టిన ఖర్జూరాన్ని తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఈ ఖర్జూరాలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. ఖర్జూరాల్లో మెగ్నీషియం, పొటాషియం ఉండటం వల్ల రక్తపోటును నియంత్రించడానికి కూడా సహాయపడుతాయి.
మలబద్దకం
గర్భధారణ సమయంలో మలబద్దకం సమస్య రావడం సర్వసాధారణం. దీన్ని నివారించడానికి ఖర్జూరాలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఖర్జూరాల్లో ఉండే ఫైబర్ కంటెంట్ ఇందుకు సహాయపడుతుంది.
రక్తహీనత
నానబెట్టిన ఖర్జూరాలను తినడం గర్భిణులకు ప్రయోజనకరంగా ఉంటుంది. నానబెట్టిన ఖర్జూరాలను తినడం వల్ల శరీరంలో ఐరన్ కంటెంట్ పెరుగుతుంది. దీంతో గర్భిణుల ఒంట్లో రక్తహీనత సమస్య పోతుంది.
ఎముకల ఆరోగ్యం
ఖర్జూరాల్లో ఉండే సెలీనియం, మెగ్నీషియం, మాంగనీస్ బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. అలాగే ఎముకలను ఆరోగ్యంగా, బలంగా ఉంచడానికి కూడా సహాయపడతాయి.
హెయిర్ ఫాల్
ప్రెగ్నెన్సీ సమయంలో ఆడవాళ్ల జుట్టు విపరీతంగా రాలుతుంది. అందరికీ అలా ఉండదు కానీ.. కొంతమందికి మాత్రం జుట్టు ఊడిపోతూ ఉంటుంది. ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఖర్జూరాలను తీసుకోవడం వల్ల నెత్తిమీద, జుట్టుకు రక్త ప్రవాహం పెరుగుతుంది. దీంతో జుట్టు ఊడటం ఆగి జుట్టు బలంగా పెరుగుతుంది.
అయితే గర్భిణీ స్త్రీలు ఖర్జూరాలను ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే వీటిని ఎక్కువగా తింటే బరువు పెరిగి మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.